బాధాతప్త.. బరువైన హృదయాలతో స్పందిస్తున్నాం. కలెక్టర్ల వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చాలన్న లక్ష్యంతోనే మీరు ఈ కథనాన్ని ప్రచురించారు. తుపాన్లు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు, అగ్ని, రోడ్డు ప్రమాదాల వంటి ఘటనలు జరిగిన సమయాల్లో దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చి, ప్రజలకు ఉపశమనం కలిగించడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు.
– కలెక్టర్లు
సాక్షి, అమరావతి: తమ నైతిక, ఆత్మస్థెర్యాన్ని దెబ్బతీసే విధంగా ‘హనీ ట్రాప్.. ఇద్దరు కలెక్టర్ల కహానీ’ పేరుతో తప్పుడు కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లందరూ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగా రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాసరెడ్డి ద్వారా ఆ పత్రిక యాజమాన్యానికి లీగల్ నోటీసు పంపారు. కలెక్టర్ల పరువు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా కథనం ప్రచురించినందుకు బేషరతుగా క్షమాణలు చెబుతూ.. దానిని ప్రచురించాలని ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేశారు. వారం లోపు స్పందించకుంటే, తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఆ నోటీసులోని వివరాలు ఇలా ఉన్నాయి.
► స్వాతంత్య్రం సిద్ధించిన రోజుల నుంచి కలెక్టర్లను ఓ వ్యవస్థగా ఎంతో గౌరవ ప్రదంగా చూస్తున్నారు. అలాంటి కలెక్టర్ల వ్యవస్థపై అభాండాలు మోపుతూ బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్లిష్ట పరిస్థితుల్లో పని చేస్తూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేయడమే కాకుండా, ప్రజలతో విడదీయరాని బంధాన్ని కొనసాగిస్తూ పాలనను ముందుకు తీసుకెళుతున్నాం.
► సమతా వాదం.. లౌకిక వాదం.. మానవతా వాదం వంటి ఉత్కృష్ట సిద్ధాంతాలను నిలబెడుతున్నాం. నిస్వార్థంగా ప్రజలకు సేవలందిస్తూ, ప్రజల మద్దతును ఆస్వాదిస్తూ సంపాదించుకున్న కలెక్టర్ల వ్యవస్థ ప్రతిష్టను ఒక కలం పోటుతో దిగజార్చేశారు.
► ఇలాంటి ప్రయత్నాలు జర్నలిజం నైతిక పతనాన్ని నిరూపిస్తున్నాయి. మీ రాజకీయ బాసులను సంతృప్తి పరిచేందుకు అబద్ధపు రాతలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నందుకు మీపై మేం జాలి చూపిస్తున్నాం. మీరు నైతిక విలువలను పూర్తిగా గాలి కొదిలేసి, అబద్ధాల చుట్టూ తిరుగుతున్నారు.
రాజకీయ లబ్ధి కోసమే..
► మీ కథనం పాత్రికేయ విలువలను ఉల్లంఘించేదిగా ఉంది. అంతేకాక దురుద్దేశంతో కూడుకున్నది కూడా. కొందరు అనైతిక విలువలు లేని వ్యక్తుల దుష్ప్రవర్తనను సాకుగా తీసుకుని, మొత్తం ఐఏఎస్ వ్యవస్థపైనే విషం చిమ్ముతూ మీరు కథనం రాశారు.
► కేవలం రాజకీయ లబ్ధి కోసమే మీరు ఇలా చేశారు. మీ బురదజల్లుడు, తప్పుడు నిందారోపణల వల్ల ప్రజలకు నిబద్ధతతో సేవ చేస్తున్న దేశంలోని కలెక్టర్లందరి నైతిక స్థెరాన్ని దెబ్బతీశారు. వాస్తవాలను తెలుసుకోకుండా, తటస్థంగా ఉండాలన్న జర్నలిజం విలువలకుపాతరవేస్తూ కథనం ప్రచురించారు.
► ఇలాంటి రాతలు రాసిన మీ మీడియా హౌస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మౌనాన్ని పిరికితనంగా భావిస్తారని, సందర్భం వచ్చినప్పుడు వాస్తవాలు తెలియచేసి, తదనుగుణంగా స్పందించాలని మహాత్మా గాంధీ చెప్పారు. అందుకే రాజకీయ ప్రయోజనాలను ఆశించి రాసిన ఈ దురుద్దేశ పూర్వక కథనాన్ని ఖండిస్తున్నాం.
మీరు రాసిన కథనం వల్ల మా కుటుంబాలు చెప్పలేనంత తీవ్ర మనోవేదనకు గురయ్యాయి. మీరు కథనం రాసిన విధానం కలెక్టర్ల వ్యవస్థ పనికిరాదన్న తప్పుడు భావన సామాన్యుడికి కలిగించేలా ఉంది. మీ కథనంలో కూర్చినదంతా తీవ్ర అభ్యంతరకరం.. గర్హనీయం.