ఒకవైపు టీకా.. మరోవైపు ఎన్నికలా? సాధ్యం కాదు | Letter of CS Adityanath Das to the State Election Commissioner | Sakshi
Sakshi News home page

ఒకవైపు టీకా వేస్తున్నాం.. మరోవైపు ఎన్నికలా? సాధ్యం కాదు

Published Sat, Jan 23 2021 3:10 AM | Last Updated on Sat, Jan 23 2021 1:53 PM

Letter of CS Adityanath Das to the State Election Commissioner - Sakshi

ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఎన్నికల విధుల్లో కూడా వీరే కీలకం. వాళ్లే ముందు వ్యాక్సిన్‌ తీసుకోవాలన్న కేంద్ర మార్గదర్శకాల మేరకే ముందుకు వెళుతున్నాం. ప్రధానంగా వ్యాక్సిన్‌ తీసుకున్న వారు కొద్ది రోజుల పాటు పరిశీలనలో (అబ్జర్వేషన్‌) ఉండటం తప్పనిసరి. ఏవైనా అలర్జీలు, రియాక్షన్లు తలెత్తుతున్నాయా? ఇతర ఆరోగ్య ఇబ్బందులు ఎదురవుతున్నాయా? తదితర అంశాలను నిరంతరం పరిశీలించాలి. వారు రెండో డోసు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కొంత వ్యవధి తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఎన్నికల విధుల్లో పాల్గొనడం ఆచరణ సాధ్యం కాదు. మరోవైపు హైకోర్టు కూడా ఎన్నికలతో పాటు వ్యాక్సినేషన్‌ కూడా ముఖ్యమేనని స్పష్టంగా చెప్పింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను నిర్వహిస్తూనే అదే సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించడం ఆచరణ సాధ్యం కాదు కాబట్టే సుప్రీంకోర్టుకు వెళుతున్నాం. అత్యున్నత న్యాయస్థానంలో దీనిపై సోమవారం విచారణ జరగనుంది. అంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎస్‌ఈసీని కోరుతున్నాం.    
– ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలకు తాము వ్యతిరేకం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ స్పష్టంగా చెప్పారు. ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ... రాష్ట్రంలో కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా వేసే కార్యక్రమాన్ని చేపట్టామని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వారికి వ్యాక్సిన్‌ అందించాల్సి ఉందని తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు శుక్రవారం ఆయనొక లేఖ రాశారు. ‘‘కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సిన్‌ రెండు డోసులివ్వాలి. మొదటి, రెండో డోసులకు మధ్య నాలుగు వారాల వ్యవధి అవసరం. రెండో డోసులూ తీసుకున్న నాలుగు వారాల తర్వాతే వారిలో పూర్తిస్థాయి యాంటీ బాడీస్‌ వృద్ధి చెందుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఆ విధుల్లో కూడా ఈ ఫ్రంట్‌లైన్‌ వారియర్సే కీలకమవుతారు. మరి వారికి టీకా ఇవ్వటం ఎలా? ఇవ్వకపోతే కేంద్ర మార్గదర్శకాలను పాటించనట్లే. పైపెచ్చు వారి ఆరోగ్యాన్ని, ప్రాణాలను ఫణంగా పెడుతున్నట్టే’’ అని ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్ర నిబంధనలను ఉల్లంఘించినట్లే’ అని లేఖలో స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్పెల్పీ) దాఖలు చేసిందని, ఇది సోమవారం విచారణకు రానున్నదని సీఎస్‌ తన లేఖలో తెలియజేశారు. 


ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోండి..
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చిన 60 రోజుల తర్వాత పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎస్‌ తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రజారోగ్యం, ప్రజాభ్యుదయం దృష్ట్యా ఎన్నికల ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని ఎస్‌ఈసీని తన లేఖలో దాస్‌ అభ్యర్థించారు. ఈ లేఖను అందచేసేందుకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఎస్‌ఈసీ కార్యాలయానికి వెళ్లగా వారిని కలిసేందుకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఇష్టపడలేదు. తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా ఆ లేఖను తీసుకున్నారు. 

ఎస్‌ఈసీకి సీఎస్‌ రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ..
► హైకోర్టు ఆదేశాలతోనే మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లోకి వచ్చిందన్నది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఎస్‌ఈసీ కొందరు అధికారులను నిబంధనలను పాటించకుండా తొలగించారు. ఆ అధికారులు ‘కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌’ కార్యక్రమం అమలులో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో తొలగింపును వాయిదా వేస్తున్నాం.
► రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాక ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
► ఎన్నికల షెడ్యూలు జారీ చేయక ముందే జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో అర్థవంతమైన సంప్రతింపులు జరిపి ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్ధంగా ఉందో లేదో అంచనా వేసుకోవాలి. ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ను సజావుగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అవి రెండూ ముఖ్యమేనని స్పష్టం చేసింది. 
► ఎస్‌ఈసీపై రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత గౌరవం ఉంది. అవసరమైనంత మేరకు సిబ్బందిని ఎస్‌ఈసీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
► ఎన్నికల షెడ్యూలుపై హైకోర్టు ఉత్తర్వుల తర్వాత పోలీసు శాఖ, ఎన్నికల ప్రక్రియలో భారీ ఎత్తున పాల్గొనే వివిధ శాఖల అధికారులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను మీ దృష్టికి తెస్తున్నాం. ఎన్నికల ప్రక్రియను నిర్వహించే ఈ శాఖల సిబ్బందికి మొదటి, రెండో విడతల కింద వ్యాక్సినేషన్‌ అందించాలి. ఈ సిబ్బందికి ఇప్పటికే వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం.
► ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని అమలు చేయడం సాధ్యం కాదు. ఎన్‌డీఎంఏ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చిన 60 రోజుల తర్వాతే ఆ వ్యక్తిలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం ఆదేశాలను ఉల్లంఘించినట్లు అవుతుంది.
► ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ను సజావుగా నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. ఈ రెండు కార్యక్రమాలను సజావుగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంత ఉందో ఎస్‌ఈసీ మీద కూడా అంతే ఉందనే విషయం మీకు తెలియంది కాదు.  హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ను సజావుగా నిర్వహించాలంటే ఎస్‌ఈసీ ఎన్నికల షెడ్యూలును సవరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 
► ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే వారి ఆరోగ్యం, బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నది మీకు తెలుసు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక వ్యాధి నిరోధక శక్తి పెంపొందినప్పుడు వారిని ఎన్నికల విధులకు వినియోగిస్తాం. 
► పంచాయతీ ఎన్నికల షెడ్యూలు ప్రభావం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంపై పడుతుందనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించడానికి షెడ్యూలులో కేంద్రం ఏవైనా మార్పులు సూచిస్తే ఆ మేరకు వ్యవహరిస్తాం. ఈ అంశాలను వివరిస్తూ సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్సెల్పీ పిటిషన్‌ సోమవారం విచారణకు రానుంది.
► ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ వ్యాక్సినేషన్, ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి వీలుగా కొత్త షెడ్యూలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికలు, పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ తదితర శాఖ అధికారులు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వ్యాక్సిన్‌ ఇచ్చి వారిలో నైతిక స్థైర్యం నింపడానికి సిద్ధంగా ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement