పార్టీ నేతలు, కార్యకర్తలపైన టీడీపీ కూటమి నేతల అమానుష దాడులు
వైఎస్సార్‌సీపీ కార్యాలయాల్లోకి అక్రమచొరబాట్లు, విధ్వంసం
నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న పోలీసులు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రమాదంలో పడుతున్నాయి
కూటమి నేతల దాష్టీకాలను వెంటనే నిలువరించండి
రాష్ట్ర డీజీపీకి వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల లేఖ
సాక్షి, అమరావతి: అధికార కూటమి నేతల అమానుష దాడుల నుంచి రాష్ట్రంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలని పార్టీ ముఖ్య నేతలు డీజీపీ ద్వారకా తిరుమలరావును కోరారు. పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, పార్టీ కార్యాలయాల్లోకి అక్రమ చొరబాట్లను, దాడులను నిలువరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈమేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురువారం డీజీపీకి ఓ లేఖ రాశారు. దానిని డీజీపీకి మెయిల్ ద్వారా పంపారు. కూటమి నేతల దౌర్జన్యాలకు సంబంధించిన పలు ఆధారాలు, వివరాలు కూడా లేఖతో పాటు జత చేశారు.
‘రాష్ట్రంలో టీడీపీ కూటమి గెలుపొందినప్పటి నుంచి గత 25 రోజులుగా వైఎస్సార్‌సీపీ నాయకులకు, కార్యకర్తలకు, వారి ఆస్తులకు, పార్టీ కార్యాలయాలకు రక్షణ లేకుండా పోయింది. పార్టీ నాయకులు, కార్యకర్తలపైన అమానుషంగా దాడులు చేస్తున్నారు. వారి ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. ఈ కేసులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పోలీసులు తగిన రీతిలో చర్యలు తీసుకోవడంలేదు. మా ప్రాణాలకు హాని ఉందని చెప్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదు.
ఈ ఘటనలపై వెంటనే కేసులు నమోదు చేసి, కారకులను వెంటనే అరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లోకి టీడీపీ, జనసేన మంత్రులు, నాయకులు, కార్యకర్తలు అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యాలకు దిగుతున్నారు. గురువారానికి రాష్ట్రంలోని 14 చోట్ల పార్టీ కార్యాలయాల్లోకి చొరబడ్డారు. మా పార్టీ కార్యాలయాలు, ప్రాంగణాల్లోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యాలకు పాల్పడి చట్టాన్ని ఉల్లంఘించారు.
ఘర్షణలు రేపేందుకు ప్రయత్నించారు. టీడీపీ, జనసేన నాయకులు అక్రమంగా ప్రవేశించినా, బెదిరింపులకు దిగినా పోలీసులు ఎక్కడా వారిని నియంత్రించడంలేదు సరికదా వారి అక్రమాలకు దన్నుగా నిలబడ్డారు. శాంతి భద్రతలను కాపాడి, రక్షణగా ఉండాల్సిన పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులకు తావివ్వడం ద్వారా శాంతి భద్రతలను ప్రమాదంలో పడేశారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయాలకు రక్షణ లేకుండా పోయింది.
అధికార టీడీపీ కూటమి నాయకుల దాడులు, దౌర్జన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. నిర్లిప్తంగా వ్యవహరించిన పోలీసు అధికారులపైనా శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment