AP: సంపూర్ణ గృహహక్కు పథకం.. వాస్తవాలు ఇవిగో.. | List Of 12 Housing Schemes In AP: Know Unknown Facts Behind Schemes | Sakshi
Sakshi News home page

AP: సంపూర్ణ గృహహక్కు పథకం.. వాస్తవాలు ఇవిగో..

Published Thu, Dec 2 2021 10:35 AM | Last Updated on Thu, Dec 2 2021 8:28 PM

List Of 12 Housing Schemes In AP: Know Unknown Facts Behind Schemes - Sakshi

సాక్షి, అమరావతి: పేదలకు సంపూర్ణ హక్కులు కల్పించాలని, వారి ఇళ్లపై వారికి అధికారాలను ఇవ్వాలని ఏనాడు ఆలోచించని చంద్రబాబు.. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఓటీఎస్‌ పథకంపై అసత్య ప్రచారానికి ఒడిగడుతున్నారు. దాన్ని ఏవిధంగానైనా అడ్డుకోవాలనే దురుద్దేశ్యంతో ఈ పథకంపై తప్పుడు ప్రచారాలు చేయడంతో పాటు గ్రామస్థాయిలో పనిచేసే అధికారుల మీద ఒత్తిడి పెంచుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత. అందుకుగాను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్లు కానీ, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కానీ నిరంతరం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 

ఈ పథకాన్ని ఏవిధంగానైనా అడ్డుకోవాలనే దురుద్దేశ్యంతో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్న గ్రామ స్ధాయిలో ఎక్కడో ఒక చోట ఒక పంచాయతీ సెక్రటరీ ప్రభుత్వ అనుమతి లేకుండా ఇచ్చిన ఆదేశాలను సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేయడం, అదే ప్రచారాన్ని మరుసటి రోజు టీడీపీ కరపత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు రాయించడం ఇవన్నీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే చర్యలో భాగంగా కుట్రలకు పాల్పడుతున్నారు. గతంలో 28 లక్షల మంది లబ్ధిదారులకిచ్చే ఇళ్ల నిర్మాణాన్ని కూడా ఇలాగే కోర్టులకెక్కి ఆపించిన సంగతి తెలిసిందే. ఆ ఆదేశాలను కూడా రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం కొట్టివేయడంతో పేదల సొంతింటికల త్వరలోనే నెరవేరబోతోంది. 

ప్రస్తుతం ఓటీఎస్‌ను అలాగే నిలిపివేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో ప్రజలకు ఎలాగూ మేలు చేయలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పేదలకు చేస్తోన్న మేలు కూడా వారికి అందకుండా చేస్తున్నారు. అప్పుడు ఇళ్ల నిర్మాణాన్ని ఆపారు. ఇప్పుడు రుణసదుపాయం పొందిన వారికి వాళ్ల ఇళ్లపై సంపూర్ణ హక్కులను కూడా పొందనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంపూర్ణ గృహహక్కు పథకంపై వాస్తవాలు ఒకసారి పరిశీలిస్తే..

 వాస్తవాలు ఇవిగో..
1. వన్‌ టైం సెటిల్‌ స్కీం 24 జనవరి 2000లో ప్రారంభమైంది. ఈ స్కీమ్‌ కింద ప్రభుత్వం వడ్డీ మాఫీ మాత్రమే ఇచ్చేది. రుణం చెల్లించిన తర్వాత తనఖా పెట్టుకున్న పత్రాన్ని తిరిగి లబ్ధిదారులకు ఇచ్చేవారు. మార్చి 31, 2014 వరకు అంటే 14 సంవత్సరాల 2 నెలల కాలంలో 2,31,284 మంది వన్‌టైం సెటిల్‌ మెంట్‌ స్కీంను వినియోగించుకున్నారు. మొత్తం 56,69,000 మంది లబ్ధిదారులున్నారు. 

2. 2014 ఏఫ్రిల్‌ నుంచి 2019లో మన ప్రభుత్వం వచ్చేంతవరకు  ఈ పథకం ఎప్పుడూ అమలు కాలేదు. ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ వాళ్లు సెప్టెంబర్‌ 30, 2016న జరిగిన బోర్డు మీటింగ్‌లో వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంను పొడగించమని ప్రతిపాదనలు పంపారు. అదే విధంగా మరో నాలుగు దఫాలు 27–10–2016, 03–11–2016, 10–04–2018 మరియు 13–02–2019 మొత్తం ఐదు దఫాలుగా ప్రభుత్వాన్ని పదే, పదే కోరారు. 

ఇన్ని సార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చాలా నిర్ధయగా, అప్పటి ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి వచ్చినా, పేద ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రతిపాదనలు పంపిన ప్రతిసారీ ఏదో ఒక నెపంతో వాటిని వెనక్కి తిప్పి పంపింది.

అప్పటికే 14 సంవత్సరాలు అమల్లో ఉన్న స్కీంను కనీసం వడ్డీ మాఫీ చేయడానికి కూడా అప్పటి ప్రభుత్వానికి  మనసు కూడా రాలేదు. 2014–19 మధ్యలో ఒక్కరంటే ఒక్క లబ్ధిదారుడికి కూడా రుణమాఫీ సంగతి దేవుడెరుగు వడ్డీ కూడా మాఫీ చేయలేదు. అమల్లో ఉన్న పథకాన్ని కూడా నిర్వీర్యం చేశారు. 
 
3. వైఎస్‌ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో ఆయన్ను కలిసిన ప్రజలు.. ఉన్న వన్‌టైం సెటిల్‌ మెంట్‌ స్కీంను కూడా నిలిపివేశారని ఆయన దగ్గర తమ కష్టాలను ఏకరువు పెట్టారు. వడ్డీల వల్ల చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా పెరిగిపోయిందని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.

అప్పుడు పేద ప్రజలకు పట్టాలివ్వడం, నివసించే హక్కు ఇవ్వడం తప్ప అమ్ముకునే హక్కు కల్పించడం, వారసులకు బహుమతిగా ఇచ్చే అవకాశం లేదని తెలుసుకున్న సీఎం జగన్‌ చలించిపోయారు. దీంతో ఓటీఎస్‌ పథకం కంటే మరింత మెరుగైన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆనాడే నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా వైఎస్‌ జగన్‌ సంపూర్ణ గృహహక్కు పథకం ప్రవేశపెట్టడం జరిగింది. 

4. ఈ పథకాన్ని అమలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూములు (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌) చట్టం 1977 చట్టానికి సవరణలు తీసుకువచ్చారు. ఆగస్టు 15, 2011 కంటే ముందు ఇచ్చిన నివేసిన పత్రాలు కానీ, డీఫామ్ పట్టాలు కింద ఇళ్లు కట్టుకున్న వాళ్లు ఈ పథకంలో లబ్ధిపొందుతారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం 1994లో కూడా సవరణలు తీసుకురావడం జరిగింది.

5. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి సుమారు 40 లక్షల మంది రుణం తీసుకున్న లబ్ధిదారులు ఉన్నారు. ఈ నేపధ్యంలో రుణం, వడ్డీతో కలిపి ఎంత మొత్తం ఉన్నా.. లబ్ధిదారులకి ఉపశమనం కలిగించాలన్న ఉద్దేశ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15వేలు, కార్పొరేషన్‌ పరిధిలో రూ.20 వేలుతో ఈ పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతాల్లో నిర్ణయించిన మొత్తం కంటే వాళ్లు కట్టవలసిన రుణం తక్కువ ఉంటే అదే మొత్తాన్ని చెల్లించి ఈ పథకానికి అర్హులు కావచ్చు. 

నిర్ణయించిన మొత్తం కంటే కట్టవలసిన సొమ్ము ఎక్కువగా ఉంటే.. నిర్ణీత మొత్తం కన్నా ఎక్కువగా ఉన్న మొత్తం పూర్తిగా మాఫీ చేయబడుతుంది. ఉదాహరణకి గ్రామీణ ప్రాంతంలో ఒక లబ్ధిదారుడు రూ.9వేలు రుణభారం ఉందనుకుంటే.. సదరు లబ్ధిదారుడు రూ.10వేలకు బదులు రూ.9 వేలు చెల్లిస్తే సరిపోతుంది. అలాగే మరో లబ్దిదారుడు రూ.50,000  రుణం చెల్లించాల్సి ఉందనుకుంటే.. ఆ లబ్ధిదారుడు రూ.10వేలు కడితే అతడికి రూ.40,000 మాఫీ అయి, ఆ మేరకు లబ్దిపొందుతాడు. 

6. అలాగే సుమారు 12 లక్షల మంది హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఏ విధమైన రుణం తీసుకోకుండా ఇళ్లు కట్టుకున్నారు. వాళ్లందరికీ రూ.10 నామమాత్రపు రుసుముతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు వాళ్ల పేరు మీదే, వాళ్ల ఇంటికి సంబంధించిన నివేసిత స్ధలానికి ఇవ్వబడుతుంది. 

7. గతంలో అమలైన ఓటీఎస్‌ స్కీంలో నిర్ణయించిన మొత్తాన్ని కట్టిన వారికి, తాకట్టు పెట్టిన నివాసిత స్థలపత్రం కానీ, డీఫామ్‌ పట్టా కానీ తిరిగి ఇవ్వబడేది. ఏ విధమైన అమ్ముకునే హక్కు కానీ, వారసులుకు బహుమతిగా రిజిస్ట్రేషన్‌ చేసే హక్కు కానీ లభించేది కాదు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో లబ్ధిదారుడికి వాళ్ల ఇళ్లపై సర్వహక్కులు కల్పించబడతాయి. అమ్ముకోవడానికి, బహుమతిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ప్రభుత్వమే వారి పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తుంది. భవిష్యత్తులో ఏ విధమైన ఇతర లింకు డాక్యుమెంట్లు అవసరం లేకుండా, ప్రభుత్వం ఇచ్చిన రిజిస్టర్డ్‌ డాక్యుమెంటుతో అమ్ముకుని నేరుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 

8. లబ్ధిదారుడికిచ్చే రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంటు కోసం రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. లబ్ధిదారుడికి చెందిన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంటు గ్రామ, వార్డు సచివాలయంలోనే రిజిస్ట్రేషన్‌ చేసి డిసెంబరు 21 తర్వాత సచివాలయంలోనే అందజేస్తారు. 

9. గతంలో ఉన్న ఓటీఎస్‌ స్కీంలో నివేసిత పత్రం మీద కానీ, డీఫామ్‌ పట్టాల మీద గానీ బ్యాంకులు రుణసదుపాయం కల్పించేవి కావు. ఇప్పుటి ప్రభుత్వం ఇచ్చే రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ మీద భూమి, ఇంటి విలువ మీద 75 శాతం వరకు కూడా బ్యాంకులు రుణ సదుపాయం కల్పించనున్నాయి. 

ఉదాహరణకు స్ధలం విలువ రూ.6 లక్షలు అనుకుంటే, ఇంటి విలువ రూ.2లక్షలు అనుకుంటే బ్యాంకులు 75 శాతం వరకు రుణం అంటే రూ.6 లక్షలు వరకు లోన్‌ సదుపాయం ఉంటుంది. కార్పొరేషన్‌లో స్ధలం విలువ  రూ.12 నుంచి 15 లక్షలు అనుకుంటే ఇంటి విలువ రూ. 1 నుంచి 3 లక్షలు అనుకుంటే అతనికి 75 శాతం రుణం అంటే రూ. 8 లక్షలు నుంచి రూ.12 లక్షల వరకు కొత్తగా రుణం పొందే సౌకర్యం ఉంటుంది. 

10. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంటు లబ్ధిదారుడికి ఇచ్చే సమయంలో యూజర్‌ ఛార్జీలు, రిజిస్ట్రేషన్‌ ఫీజు, స్టాంప్‌ డ్యూటీ మూడు మాఫీ చేయబడ్డాయి. మాఫీ అయిన మొత్తం ఒక కార్పొరేషన్‌ పరిధిలో తీసుకుంటే సుమారు రూ.1లక్ష లబ్ధి చేకూరుతుంది. ఒకవేళ లబ్ధిదారుడి పేరుమీద రిజిస్ట్రేషన్‌ తన సొంత ఖర్చులతో చేసుకోవాలనుకుంటే ఈ రూ.1లక్ష ఖర్చవుతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేసింది.

11. ఈ పథకంలో లబ్ధిపొందిన లబ్ధిదారులను రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్వహిస్తున్న నిషేధిత జాబితా 22–ఏ నుంచి తొలగిస్తాం. అందువల్ల భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. రెవెన్యూశాఖ నుంచి ఏ విధమైన నిరభ్యంతర పత్రం అవసరం లేదు. 

12. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం 13 జిల్లాల్లోనూ ప్రజల సహకారంతో గత 12 రోజులలో 1 లక్షా 6 వేల మంది  ఉపయోగించుకున్నారు. అలాగే ప్రతి రోజూ దాదాపు 12 వేల నుంచి 15 వేల మంది ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. ఇలా చక్కగా జరుగుతున్న కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించడానికి ప్రతిపక్షం ప్రయత్నించడం చాలా దారుణం, ఇది చాలా హేయమైన చర్య. 2014 నుంచి 2019 మధ్యలో 43,776 మంది ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోయినా రుణమొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించి, నివేసిత పత్రాలు, డీఫామ్‌ పట్టాలు వెనక్కి తీసుకున్నారు. 

టీడీపీ ప్రభుత్వం హయాంలో సంవత్సరానికి కనీసం 9 వేలమందికి కూడా లబ్ధి చేకూర్చలేకపోయారు. ఇప్పుడు ఈ మంచి పథకాన్ని అడ్డుకోవడానికి..తాము అధికారంలోకి వస్తే పూర్తిగా మాఫీ చేస్తామని, చెప్పడం హాస్యాస్పదం. టీడీపీ అధికారంలో ఉండగా రైతు రుణమాఫీ అని ఏ రకంగా రైతులను వంచించారో ఏ అన్నదాతను అడిగినా చెప్తారు. డ్వాక్రా రుణమాఫీ అని, బ్యాంకుల్లో బంగారం మీ ఇంటికొస్తుందని విడిపించకండని అక్కచెల్లెమ్మలను ఏ విధంగా మోసం చేశారో ఎవరిని అడిగినా కథలు, కథలుగా చెప్తారు. చివరకి  మేనిఫెస్టోలో ఇఛ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని అడిగిన పాపానికి, చివరకి వెబ్‌సైట్‌ నుంచి పార్టీ మేనిఫెస్టోనే ఏకంగా తొలగించిన ఘనత టీడీపీది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement