
షాప్‌లో భర్తకు చేదోడుగా నిలిచిన సుజాత- పెళ్లినాటి ఫొటో (ఫైల్)
ప్రేమ.. ఆకర్షణ.. తెలిసీ తెలియని వయస్సులో రెండు మనసుల మధ్య చిగురించే బంధం ఎన్నో మార్పులకు నాంది పలుకుతుంది. ఇళ్లలో తెలియనంత వరకు అది ప్రేమామృతం. తెలిసిన రోజు నుంచి ముళ్ల మీద ప్రయాణం. పెద్దలు ఒప్పుకుంటే ప్రణయం.. లేదంటే ప్రళయం. మూడునాళ్ల ముచ్చటగా ముగుస్తున్న ప్రేమలు కొన్నయితే.. మెప్పించి ఒప్పించి గెలుపుతీరాలకు చేరే ప్రేమలు ఇంకొన్ని. ఇందుకు భిన్నంగా సాగిందీ ప్రేమకథ. ఇరువురి పెద్దలూ అక్షింతలకు సిద్ధమైనా.. విధి కన్నుకుట్టింది. ఓ ప్రమాదంలో ప్రియుడు శాశ్వత దివ్యాంగుడు కాగా.. ఆ ప్రియురాలు మూడుముళ్ల సాక్షిగా అతని జీవితాన్ని కొత్త అడుగులు వేయించింది. ఆ ప్రేమపక్షుల గెలుపుతీరమే ఈ వారం ‘సండే స్పెషల్’.
సోమందేపల్లి: సోమందేపల్లికి చెందిన చేనేత కార్మికుడు శిరివెళ్ల కుళ్లాయప్ప, నాగరత్నమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో చిన్న కుమారుడు వినోద్. పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని కుళ్లాయప్ప దంపతులు భావించారు. ఇందులో భాగంగా తమ సంపాదనలో కొంత మేర పిల్లల చదువులకు వెచ్చిస్తూ వచ్చారు. వినోద్‌ను బీటెక్ చదివించేందుకు హిందూపురంలోని ఓ కళాశాలలో చేర్పించారు.
కలలు కల్లలు కాగా..
మరో ఏడాదిలో కోర్సు పూర్తి అవుతుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జీవితంలో స్థిరపడాలని వినోద్ కలలు కన్నాడు. 2012లో కళాశాలకు ద్విచక్ర వాహనంపై బయలుదేరిన వినోద్.. కొద్ది దూరం వెళ్లగానే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడటంతో ఉన్నత వైద్య చికిత్సల కోసం కుటుంబసభ్యులు వెంటనే బెంగళూరుకు తీసుకెళ్లారు. ప్రమాదంలో రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతినడంతో శస్త్రచికిత్స చేసి తొలగించారు. వైద్య చికిత్సలు చేయించే ఆర్థిక స్థోమత కుళ్లాయప్పకు లేకపోవంతో వినోద్ స్నేహితులు, పలువురు దాతలు ముందుకొచ్చారు. దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చు పెట్టి ప్రాణాపాయం తప్పించినా.. జీవితం అవిటిదైంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలనే కల కలగానే మిగిలిపోవడంతో వినోద్ కుంగిపోయాడు. ఆ సమయంలోనే హైదరాబాద్‌లోని అభయ ఫౌండేషన్ గురించి తెలుసుకుని అక్కడకు చేరుకున్నాడు. వినోద్ పరిస్థితిని గమనించిన ఫౌండేషన్.. రూ.10 లక్షల విలువ చేసే కృత్రిమ కాళ్లను 2013లో ఉచితంగా అమర్చి, వాటి సాయంతో నడిచేలా చేసింది.
తోడుగా నిలిచిన ప్రియురాలు..
వినోద్, సుజాత ఇద్దరూ ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటి నుంచి స్నేహితులు. ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. కళాశాల స్థాయికి చేరుకోగానే వీరి మధ్య ప్రేమ చిగురించింది. విషయం తెలుసుకున్న ఇరువైపుల కుటుంబసభ్యులు ఆమోదం తెలుపుతూ చదువుల అనంతరం పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఊహించని ప్రమాదంతో వినోద్ వైకల్యం బారిన పడడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. అవిటి వాడితో జీవితం సాఫీగా సాగదని, పెళ్లి వద్దని సుజాతకు బంధువులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా సుజాత మనసు మారలేదు. ఎవరెన్ని చెప్పినా అతనితోనే తన జీవితమంటూ భీష్మించింది. వీరి ప్రేమను హర్షిస్తూ 2015లో స్నేహితులు దగ్గరుండి పెళ్లి జరిపించారు. తర్వాత వీరు బెంగళూరుకు మకాం మార్చారు. అక్కడ ఓ కాలేజీలో అడ్మిన్‌గా రూ.10వేల జీతానికి వినోద్ చేరాడు. ఎంఎస్సీ పూర్తి చేసిన సుజాత సైతం రూ.13 వేల జీతంతో ఓ కళాశాలలో లెక్చరర్‌గా చేరారు. కుటుంబ పోషణ పోను మిగిలిన మొత్తాన్ని దాచుకుని రూ.3 లక్షల వరకూ ఆదా చేసుకున్నారు. ఈ మొత్తంతో సొంతూరిలో ఏదైనా వ్యాపారం చేసుకుని జీవించాలనుకుని 2018లో సోమందేపల్లికి తిరిగి వచ్చేశారు.
అండగా నిలిచిన తల్లిదండ్రులు..
కోటి ఆశలతో సొంతూరికి వచ్చిన కొడుకు, కోడలికి వినోద్ తల్లిదండ్రులు కుళ్లాయప్ప, నాగరత్నమ్మ అండగా నిలిచారు. సోమందేపల్లిలో ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ పెట్టాలనే కొడుకు ఆలోచనకు చేయూతనిచ్చారు. షాప్ ఏర్పాటుకు రూ.8 లక్షల పెట్టుబడి అవసరం కాగా, తాముంటున్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.5 లక్షలను వినోద్ తల్లిదండ్రులు సమకూర్చడంతో ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ రెండేళ్లలో అన్ని విధాలుగా వ్యాపారం కలిసి వచ్చింది. వారి కృషి ఫలించి పెట్టుబడులు కాస్తా రూ.30లక్షలకు చేరుకున్నాయి. ప్రస్తుతం దూరవిద్య ద్వారా వినోద్ డిగ్రీ చేస్తూ మరోవైపు ఫ్లెక్సీలు.. పెళ్లి పత్రికలు, రబ్బర్ స్టాంపులు, విజిటింగ్ కార్డులు, బ్యాంకు లావాదేవీలు జరుపుతూ వచ్చే సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సుజాత, వినోద్ దంపతులకు చేతన్, కార్తికేయన్ అనే ఇద్దరు పిల్లలు సంతానం.
ప్రేమకు ద్రోహం చేయకూడదనుకున్నా..
టెన్త్ పూర్తి అయిన తర్వాత మా స్నేహం కాస్త ప్రేమగా మారింది. వినోద్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు చాలా బాధపడ్డాను. ఆ సమయంలో పెళ్లి చేసుకోవద్దని కొందరు బలవంతం పెట్టారు. అయితే కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండాలని, ద్రోహం చేయకూడదని భావించా. ఇష్టపూర్వకంగానే వినోద్‌ను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడెంతో సంతోషంగా ఉన్నాం.
– సుజాత, వినోద్ భార్య, సోమందేపల్లి
చదవండి:
కన్నీళ్లు తెప్పిస్తున్న డెలివరీ డ్రైవర్ దీన గాథ
అచ్చెన్న ‘రాజ్యం’లో అరాచకం
Comments
Please login to add a commentAdd a comment