మహారాణిపేట(విశాఖ దక్షిణ): కరోనా బూస్టర్ డోస్ అమలుకు అధికార యంత్రాంగం శుక్రవారం శ్రీకారం చుట్టింది. విశాఖ జిల్లాలోని కేజీహెచ్, ప్రభుత్వ ఆస్పత్రులు, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు ఒకటి, రెండు డోస్‌లు వేసుకున్న అందరికీ దీనిని వేసేందుకు ప్రణాళిక రూపొందించారు. మొత్తం 14,57,463 మందికి బూస్టర్ డోస్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. అందులో 18 నుంచి 44 ఏళ్ల వయసున్న 9,02,463 మంది, 45 నుంచి 59 ఏళ్ల లోపు 5,60,340 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 5,340 మందికి బూస్టర్ డోస్ వేశారు. ఈ నెల 15 నుంచి రెండున్నర నెలల పాటు(సెప్టెంబర్ 30 వరకు) వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ సమయం లోగా ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తొలి రోజు 800 మందికి బూస్టర్ డోస్ వేసినట్లు ఆమె చెప్పారు.
ఫస్ట్, సెకండ్ డోస్‌లు పూర్తయిన వారు..
విశాఖ జిల్లాలో మొత్తం 20,85,216 మందికి కరోనా మొదటి డోస్.. 21,81,642 మందికి రెండో డోస్ టీకాలు వేశారు. మొదటి డోస్‌లో 115.5 శాతం మంది, రెండో డోస్‌లో 104.60 శాతం మంది ఉన్నారు. హెల్త్‌కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, 18 నుంచి 44 ఏళ్ల వయస్సు గల వారు, 45 నుంచి 59 ఏళ్ల వయస్సు గలవారు, 60 ఏళ్లు దాటిన వారు, 12 నుంచి 14 ఏళ్ల లోపు వారు, 15 నుంచి 18 ఏళ్ల లోపు వారు తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేయించుకోవాలని డీఎంహెచ్‌వో పేర్కొన్నారు.
బూస్టర్ డోస్ తప్పనిసరి
జిల్లాలోని కేజీహెచ్‌తోపాటు 63 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక ఏరియా ఆస్పత్రి, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలి ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో బూస్టర్ డోస్ వేస్తున్నారు. మొదటి, రెండో డోస్‌లు వేసుకున్న ప్రతి ఒక్కరూ నిర్ణీత కాలంలో ఆధార్ కార్డు ద్వారా నమోదు చేసుకొని బూస్టర్ డోస్ వేయించుకోవాలి.
– డాక్టర్ కె.విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment