
సాక్షి, అమరావతి: ప్రతి ఏటా మార్చి 31న రూపొందించే బ్యాలెన్స్‌షీట్‌లో... చెల్లించాల్సిన బకాయిలు, ఇతర అప్పులకు సమానంగా తమ వద్ద వందల కోట్ల రూపాయల చెక్కుల రూపంలో, మరికొన్ని వందల కోట్ల రూపాయలు నగదు రూపంలో ఉన్నట్లు చూపిస్తున్నారు. వాటిని తమ ఆస్తులుగా పేర్కొంటున్నారు. మరి ఆ చెక్కుల్ని తదుపరి కాలంలో ఎప్పుడైనా డిపాజిట్ చేయాలి కదా? ఆ నగదును సంస్థ అవసరాల కోసం ఖర్చు చేయాలి కదా? విచిత్రమేంటంటే అందులో పేర్కొన్న చెక్కుల్లో ఒక్క చెక్కు కూడా తరువాతి కాలంలో సంస్థ ఖాతాలోకి వచ్చిన దాఖలాలు ఉండటం లేదు.
నగదు పరిస్థితి కూడా అంతే!!. అంటే ఆ చెక్కులు గానీ, ఆ నగదు కానీ వాస్తవంగా కంపెనీ దగ్గర ఉన్నవి కావన్న మాట!!. వాటిని అప్పటికే వేరే సంస్థల ఖాతాల్లోకో, ఇతరత్రా అవసరాలకో మళ్లించేశారు. కానీ... అవన్నీ తమ వద్దే ఉన్నట్లుగా తప్పుడు బ్యాలెన్స్‌షీట్ ద్వారా మభ్య పెడుతున్నారు. తమ సంస్థ తగిన ఆస్తులతో బలంగానే ఉన్నదని ఒకవైపు చిట్లు వేస్తున్న చిట్ దారులను, మరోవైపు నియంత్రణ సంస్థలను నమ్మిస్తున్నారు. ఇదీ.. రామోజీరావు నడిపిస్తున్న ‘మార్గదర్శి’ అసలు కథ. మార్గదర్శి సంస్థను ఆడిట్ చేస్తున్న ఆడిటింగ్ సంస్థల ప్రతినిధి నేరుగా దర్యాప్తు సంస్థ ఎదుట అంగీకరించిన వాస్తవం. ఇదే కాదు. తనిఖీలకు అడుగడుగునా అడ్డుపడుతున్న మార్గదర్శిలో... ఎక్కడ ఏ సోదా జరిపినా నివ్వెరపోయే నిజాలే వెలుగుచూస్తున్నాయి.
వాస్తవాలను బయటకు వెల్లడించకపోవటం ద్వారా.. చిట్లు వేస్తున్నవారికి తమ సొమ్ము ఎంత భద్రంగా ఉందో, లేదో కూడా తెలియని పరిస్థితి సృష్టిస్తున్నారు. అంతేకాదు.. డిపాజిట్లు తీసుకోవటాన్ని నిషేధించినా సరే... వాటిని ఇతరత్రా రూపాల్లో తీసుకుంటూ నిబంధనలకు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. చట్టాలను పరిహాసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని మార్గదర్శి ఆడిటింగ్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కో కంపెనీలో సీఐడీ జరిపిన తనిఖీల్లో వెల్లడైన పలు అక్రమాలు బయటపడ్డాయి.
చార్టర్డ్ అకౌంటెంట్‌కు 14 రోజుల రిమాండ్...
మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్యాంకు లావాదేవీలు, రికార్డుల నిర్వహణలో పలు అవకతవకలున్నట్లు మార్గదర్శి చిట్స్‌కు ఆడిటర్‌గా వ్యవహరిస్తున్న బ్రహ్మయ్య అండ్ కో ప్రతినిధి సీఐడీ విచారణలో వెల్లడించారు. దాంతో బ్రహ్మయ్య అండ్ కో సీఏ కుదరవల్లి శ్రావణ్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేసి గురువారం విజయవాడలోని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా... చందాదారుల సొమ్మును తరలించటం, మ్యూచ్‌వల్ ఫండ్స్‌లోను, షేర్లలోను అక్రమంగా పెట్టుబడులు పెట్టడం, ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లు సేకరించడం చేసినట్లు ఇప్పటికే సీఐడీ అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే బ్రహ్మయ్య అండ్ కో సంస్థ రికార్డులను తనిఖీ చేసి, ఆ సంస్థ సీఏ శ్రావణ్‌ను విచారించారు.
ఈ విచారణలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. మార్గదర్శి ఖాతాలు సవ్యంగానే ఉన్నాయని ఏటా ఆడిట్ నివేదిక ఇస్తున్న ఈ సంస్థ... అసలు మార్గదర్శి చిట్స్ బ్యాంకు ఖాతాలు, రికార్డులు, లావాదేవీలను సమగ్రంగా పరిశీలించకుండానే ఈ నివేదిక ఇస్తున్నట్లు సదరు చార్టర్డ్ అకౌంటెంట్ వెల్లడించటం గమనార్హం.
ఇలాంటి డిపాజిట్లు ప్రమాదకరమే?
► చిట్లు వేసేవారిలో కొందరు చిట్‌ను పాడుకుంటారు కానీ... ఆ డబ్బును తీసుకోవటానికి అవసరమైన ష్యూరిటీలను కంపెనీకి సబ్‌మిట్ చేయలేరు. మరికొందరైతే రకరకాల కారణాల వల్ల పాడుకున్న మొత్తాన్ని తీసుకోకుండా భవిష్యత్తులో తాము చెల్లించాల్సిన చిట్ మొత్తానికి సంబంధించి దాన్ని సదరు చిట్‌ఫండ్ సంస్థ వద్దే వదిలిపెడతారు. ఇంకొందరైతే ఓ రెండు మూడు నెలలు ఉంన్నపుడు చిట్‌ను పాడుకుని... ఆ మిగిలిన నెలల ఫ్యూచర్ చిట్ సబ్‌స్క్రిప్షన్ మొత్తాన్ని సంస్థ దగ్గరే వదిలేస్తారు.
అయితే ఏ చిట్‌ఫండ్ సంస్థయినా తమ ప్రతి బ్రాంచి కార్యాలయంలోనూ... అక్కడి చిట్టీలకు సంబంధించిన ఫ్యూచర్ సబ్‌స్క్రిప్షన్ మొత్తాన్ని జమ చేసేందుకు ప్రత్యేకంగా రెండో బ్యాంకు ఖాతాను నిర్వహిస్తుండాలి. ఇలా ఫ్యూచర్ చిట్ల మొత్తాన్ని ఆ ఖాతాలో జమ చేయాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ ఏ ఒక్క బ్రాంచిలోనూ ఇలా ఫ్యూచర్ సబ్‌స్క్రిప్షన్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి వేరే బ్యాంకు ఖాతా తెరవలేదు.
అన్నిచోట్ల నుంచీ ఆ మొత్తాన్ని హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి తరలిస్తోంది. దానికో రశీదు ఇస్తూ 4–5 వడ్డీ చెల్లిస్తోంది. ఇది అనధికారికంగా డిపాజిట్లు వసూలు చేయటమే. చట్టవిరుద్ధంగా వసూలు చేస్తున్న ఈ డిపాజిట్లను గనక ఏ ఆర్‌బీఐనో జప్తు చేస్తే..? చిట్‌దారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారే ప్రమాదం ఉంది. అయినా సరే మార్గదర్శి వసూలు చేస్తున్న అక్రమ డిపాజిట్లు సక్రమమేననే రీతిలో బ్రహ్మయ్య అండ్ కో సంస్థ నివేదిక ఇవ్వటం విస్మయం కలిగించేదే!!.
► ఇక మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ ఆదాయ, వ్యయాల ఖాతాలు, ఆస్తి, అప్పుల ఖాతాలు, తమ పెట్టుబడలు వివరాలను బహిర్గతం చేయటం లేదు. గోప్యంగా ఉంచుతోంది. ఇది చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధం. అయినా సరే బ్రహ్మయ్య అండ్ కో ఇది పట్టించుకోకుండా అంతా సక్రమంగానే ఉందని ఆడిట్ నివేదిక ఇచ్చేస్తోంది.
అక్రమాలు వాస్తవమే: బ్రహ్మయ్య సంస్థ సీఏ శ్రావణ్
సీఐడీ దర్యాప్తు సందర్భంగా బ్రహ్మయ్య అండ్ కో సీఏ కుదరవల్లి శ్రావణ్ కీలక విషయాలు వెల్లడించారు. తాము అసలు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి కార్యాలయాల్లో రికార్డులను వ్యక్తిగతంగా పరిశీలించకుండానే ఆడిట్ నివేదిక జారీ చేస్తున్నామని అంగీకరించారు. మార్గదర్శి చిట్స్ ఆదాయ– వ్యయాలు, ఆస్తి– అప్పులకు సంబంధించిన ఎలాంటి వివరాలనూ ఆయన సీఐడీ అధికారులకు చెప్పలేకపోయారు.
ఒక్కో బ్రాంచి బ్యాంకు ఖాతాల్లో అప్పుడప్పుడు చూపిస్తున్న వందల కోట్ల రూపాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ తరువాత అవి ఎక్కడికి మాయమయ్యాయి? అనేది ఆయన ఏమాత్రం చెప్పలేకపోయారు. ఆ వివరాలేవీ తనకు తెలియవని ఆయన అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment