చందాదారులకు మార్గదర్శి బెదిరింపులు 'చెప్పింది చేయండి' | Margadarsi threats Calls to Subscribers by MD Sailaja Kiran | Sakshi
Sakshi News home page

చందాదారులకు మార్గదర్శి బెదిరింపులు 'చెప్పింది చేయండి'

Published Fri, Sep 8 2023 4:46 AM | Last Updated on Fri, Sep 8 2023 7:34 AM

Margadarsi threats Calls to Subscribers by MD Sailaja Kiran - Sakshi

మాట్లాడుతున్న సీఐడీ అదనపు డీజీ సంజయ్‌. చిత్రంలో సీఐడీ ఎస్పీ ఫక్కీరప్ప, బాధితురాలు అన్నపూర్ణ

సాక్షి, అమరావతి: సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ చందాదారు­లను ఆ సంస్థ యాజమాన్యం బెదిరిస్తోందా? మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజ కిరణ్‌ ఆఫీసు నుంచే చందాదారులకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోందా? ఇంతగా బరితెగించడం నిజమేనా? దీనిపై బాధితులు ఫిర్యాదు చేస్తున్నారా? తదితర ప్రశ్నలన్నింటికీ సీఐడీ విభాగం అవునని స్పష్టం చేస్తోంది. ఘోస్ట్‌ చందా­దారుల పేరిట అక్రమాలకు పాల్పడుతుండ­టాన్ని సీఐడీ ఆధారాలతోసహా వెలికి తీస్తుంటే బెంబేలెత్తిన మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ ఇలా బెదిరింపులకు పాల్పడుతోందని కుండబద్దలు కొట్టింది.

చందాదారులు, ఏజంట్లను మోసగిస్తూ మార్గదర్శి భారీగా అక్రమాలకు పాల్పడుతోందని పలువురు బాధితుల ఫిర్యాదుతో విశాఖపట్నం, విజయవాడ, నరసరావుపేటలో తాజాగా ఆ సంస్థపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం సీఐడీ అదనపు డీజీ సంజయ్‌ వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఎస్పీ ఫకీరప్పతో కలసి విలేకరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఘోస్ట్‌ చందాదారుల పేరిట ఆర్థిక దందా
► మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ ప్రతి చిట్టీ గ్రూపులో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున మొత్తం మీద రాష్ట్రంలో 3 వేల మంది ఘోస్ట్‌ చందాదారుల పేరిట భారీగా ఆర్థిక మోసానికి పాల్పడుతోంది. ఆ 3 వేల మందికి తెలియకుండానే వారిని చందాదారులుగా చూపిస్తూ వారి పేరిట అక్రమంగా ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తోంది. ఇతరత్రా సేకరించిన వారి గుర్తింపు కార్డులతో వ్యవహారం నడుపుతోంది. వారి సంతకాలను ఫోర్జరీ చేస్తూ తీవ్ర నేరానికి పాల్పడుతోంది. 

► ఘోస్ట్‌ చందాదారుల పేరిట చెక్‌లు జారీ చేస్తున్నప్పటికీ, ఆ చెక్కులను మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ యాజమాన్యం వారి వద్దే అట్టిపెట్టుకుంటోంది. ఆ చెక్కుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయడం లేదు. బ్యాంకులో జమ చేయడం లేదు. ఇదో అతి పెద్ద ఆర్థిక మోసం. అలాంటి 3 వేల మంది ఘోస్ట్‌ చందాదారుల్లో వంద మందిని సీఐడీ విచారిస్తోంది. 

► దాంతో బెంబేలెత్తిన మార్గదర్శి యాజమాన్యం ఆ ఘోస్ట్‌ చందాదారులకు ఫోన్లు చేసి బెదిరిస్తోంది. సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని, తర్వాత తాము అన్నీ సెటిల్‌ చేస్తామని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్‌ తన పీఏ శశికళ ద్వారా చందాదారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. 

అక్రమ డిపాజిట్లుగా నల్లధనం
► రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ అక్రమ డిపాజిట్లు సేకరిస్తోంది. దీనిపై ప్రశ్నిస్తే తిరిగి బుకాయిస్తోంది. రాబోయే నెలలకు చిట్టీ గ్రూపులకు చెల్లించాల్సిన చందాలను అడ్వాన్స్‌గా జమ చేస్తున్నారని వక్రీకరించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ అసలు చిట్టీ గ్రూపులు మొదలు కాకుండానే చందాదారుల పేరిట నాలుగైదు నెలల ముందే డిపాజిట్లు సేకరించిన విషయాన్ని సీఐడీ గుర్తించింది. 

► చిట్టీ గ్రూపులు మొదలు కాకుండానే ఎవరైనా చందాల మొత్తం చెల్లిస్తారా? ఎవరూ చెల్లించరు కాబట్టి అవి అక్రమ డిపాజిట్లే. రాష్ట్రంలోని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారులు దాదాపు 2 వేల మందిలో రూ.కోటికి పైగా విలువైన అక్రమ డిపాజిట్లు చేసిన, చిట్టీ గ్రూపుల్లో చందాదారులుగా ఉన్న వారు ఏకంగా 800 మందికిపైగా ఉన్నారు. చాలా కంపెనీల పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు సేకరించారు.

► ఆ 800 మందికిపైగా డిపాజిట్‌దారులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. అంత భారీగా డిపాజిట్లు ఎలా చేశారు.. ఆ నిధులు ఏ ఆదాయ మార్గాల ద్వారా వచ్చాయనే కోణంలో విచారిస్తోంది. విజయవాడలో ఓ బిల్డర్‌ ఏకంగా రూ.50 కోట్ల విలువైన చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా ఉన్నారు. 

► ఇలాంటి భారీ మొత్తాల డిపాజిట్‌దారులు, చిట్టీ గ్రూపుల్లో సభ్యుల గురించి ఆదాయ పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులకు కూడా సీఐడీ సమాచారమిచ్చింది. అక్రమ డిపాజిట్ల ముసుగులో నల్లధనం చలామణిలోకి తీసుకువస్తున్నారా అన్నది సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు పరిశీలించాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. 

ఏజంట్లకూ కుచ్చుటోపి
► మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ తమ చందాదారులు, ఏజంట్లను కూడా మోసగిస్తోంది. కుట్ర పూరితంగా వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ వారి ఆస్తులు రాయించుకుంటోంది. దీనిపై చందాదారులు, ఏజెంట్లు, ఘోస్ట్‌ చందాదారుల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని పరిశీలించి తగిన ఆధారాలు ఉన్న వాటిపై సీఐడీ కేసులు నమోదు చేస్తోంది. 

► విజయవాడలో కోళ్ల ఫారం యజమాని బొండు అన్నపూర్ణా దేవి అనే మహిళను ఏకంగా 65 చిట్టీ గ్రూపుల్లో  చందాదారునిగా చేర్పించి ఆమెను అప్పుల ఊబిలోకి నెట్టేశారు. కుట్ర పూరితంగా విజయవాడలోని లబ్బీపేట, గుడివాడ మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ కార్యాలయాలు కేంద్రంగా ఈ మోసానికి పాల్పడ్డారు. విదేశాల్లో ఉన్న ఆమె కుమార్తె ప్రియాంక సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు. ష్యూరిటీలు ఇచ్చినా సరే కొర్రీలు వేస్తూ ఆమెను డిఫాల్టర్‌గా చూపిస్తూ వారి ఆస్తులు కూడా రాయించుకున్నారు. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో మంగళగిరి సీఐడీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశాం.

ఆమె రూ.14 కోట్ల విలువైన 65 చిట్టీ గ్రూపుల్లో చందాదారుగా ఉన్నారు. ఆమె రూ.8 కోట్లు చందా మొత్తం చెల్లించారు. కానీ చిట్టీ పాట పాడితే ఆమె చేతికి ఇచ్చింది కేవలం రూ.48 లక్షలు మాత్రమే. ఇందులో రూ.8 కోట్ల విలువైన 45 చిట్టీ గ్రూపుల్లో ఆమె రూ.1.7 కోట్లు చందా మొత్తంగా చెల్లిస్తే.. చిట్టీ పాట పాడిన తర్వాత ఆమె చేతికి ఇచ్చింది కేవలం రూ.8 వేలు. ఆమెను డిఫాల్టర్‌గా చూపిస్తూ వారి కుటుంబ ఆస్తులు కూడా రాయించుకుంటున్నారు. 

► విశాఖపట్నం కంచరపాలెంకు చెందిన పిలక లలిత కుమారి ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగి. ఆమెను విశాఖపట్నంలోని డాబా గార్డెన్స్‌ మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ బ్రాంచి కార్యాలయంలో రూ.5 లక్షల చిట్టీ గ్రూపులో ఘోస్ట్‌ చందాదారుగా చేర్చారు. ఆ విషయం తెలిసి ఆమె చిట్‌ రిజిస్ట్రార్‌ను ఆశ్రయించారు. అక్కడ ఉన్న పత్రాల్లో ఉన్న సంతకాలు చూసి అవి తాను చేయలేదని ఫోర్జరీ చేశారని తెలిపారు. 

► ఆమె చిట్టీ పాడినట్టు.. ఆమెకు చిట్టీ మొత్తం చెల్లించినట్టు కూడా రికార్డుల్లో ఉంది. అందుకు ఇద్దరు సాక్షి సంతకాలు కూడా చేశారు. తనకు తెలియకుండానే తనను చందాదారుగా చేర్చడంతోపాటు తన సంతకాలు ఫోర్జరీ చేయడంపై లలిత కుమారి విశాఖపట్నం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దాంతో విశాఖపట్నం డాబా గార్డెన్స్‌ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బ్రాంచి మేనేజర్‌ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఏజెంట్‌ కె.సంతోష్, సాక్షి సంతకాలు చేసిన జి.నరసింగరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్గదర్శి చిట్‌ ఫండ్స్, ఎండీ శైలజ కిరణ్, ఆమె పీఏ శశికళ, విజయవాడ లబ్బిపేట బ్రాంచి మేనేజర్‌ బండారు శ్రీనివాసరావు, గుడివాడ బ్రాంచి మేనేజర్‌ వైవీవీడీ ప్రసాద్, పాతూరి రాజాజీ, పాపి నాయుడులను నిందితులుగా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

► పల్పాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ ఏజంట్‌నే ఆ సంస్థ మోసం చేసింది. ఏజంట్‌ సంతకాన్ని బ్రాంచి మేనేజర్‌ ఫోర్జరీ చేశారు. ఏజంట్‌ ఫిర్యాదుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

మా కుటుంబాన్ని దోచేసి రోడ్డున పడేశారు 
– బోరున విలపించిన బొండు అన్నపూర్ణా దేవి 
‘మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ మమ్మల్ని పూర్తిగా మోసం చేసి ఆర్థికంగా కుదేలయ్యేట్టు చేసింది. మా కుటుంబాన్ని రోడ్డున పడేసింది. మా ఆస్తులు, బంగారం, వృద్ధాప్యంలో అవసరాల కోసం దాచుకున్న మొత్తం అంతా మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌కు ధారపోశాం. అయినా సరే ఇంకా మమ్మల్ని వేధిస్తూ మిగిలిన ఉన్న ఇంటిని కూడా తీసుకునేందుకు వేధిస్తోంది. మా కుమార్తె సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి మోసానికి పాల్పడింది.

నా భర్త ప్రభుత్వ వెటర్నరీ వైద్యుడు. నేను కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాను. నేను మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌లో ఒక గ్రూపులో చందాదారుగా చేరాను. ఆ తర్వాత ఏకంగా 65 గ్రూపుల్లో నన్ను చందాదారుగా చేర్చింది. నిబంధనల ప్రకారం మేము ఇచ్చిన ష్యూరిటీలను కూడా గుర్తించకుండా ఉద్దేశ పూర్వకంగా మమ్మల్ని 17 చిట్టీ గ్రూపుల్లో డిఫాల్టర్‌గా చూపించింది. మా ఆస్తులు తీసుకుంది.

నా భర్త జీపీఎఫ్‌ డబ్బులు కట్టి, పిల్లల పెళ్లి కోసం దాచుకున్న బంగారం కూడా అమ్మి చెల్లించాం. అయినా సరే ఇంకా బకాయి ఉన్నారంటూ మా ఇల్లు వేలం వేయించారు. మా ఇంటికి వచ్చి అల్లరి చేశారు. మా అమ్మాయి విదేశాల్లో వైద్య విద్య చదువుతోంది. ఆమె సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి చందాదారుగా చేర్చారు. ఆమె చిట్టీ పాట పాడినట్టు చూపించారు. రూ.9 లక్షల నష్టానికి చిట్టీ పాట పాడినట్టు చూపించి బకాయిలు మినహాయించుకుని కేవలం రూ.210 మాత్రమే ఇస్తామని రికార్డుల్లో సర్దుబాటు చేశారు.

చిట్టీ గ్రూపునకు సంబంధించి వాయిదాల బకాయిలు చెల్లించాలని మమ్మల్ని వేధిస్తున్నారు. అసలు ఈ దేశంలోనే లేని మా కుమార్తె ఎలా చందాదారుగా చేరింది? ఎలా వేలం పాటలో పాల్గొంది? తను వచ్చి ఎప్పుడు సంతకం చేసింది? ఇంత దారుణంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మమ్మల్ని మోసం చేసింది. మమ్మల్ని కుట్ర పూరితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ యాజమాన్యం, మేనేజర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.’

రూ.9.43 కోట్ల జగజ్జనని చిట్‌ ఫండ్స్‌ ఆస్తులు అటాచ్‌ 
కేంద్ర చిట్‌ ఫండ్స్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడిన రాజమహేంద్రవరానికి చెందిన జగజ్జనని చిట్‌ ఫండ్స్‌కు చెందిన రూ.9,43,52,020 విలువైన స్థిరాస్తులను అటాచ్‌ చేయాలని సీఐడీ నిర్ణయించింది. వాటిలో భవనాలు, భూములు, ఖాళీ స్థలాలతో కూడిన మొత్తం 12 స్థిరాస్తులను అటాచ్‌ చేయనుంది. చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు సీఐడీ ప్రతిపాదనకు హోమ్‌ శాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై న్యాయస్థానం ఆమోదం కోసం సీఐడీ పిటిషన్‌ దాఖలు చేయనుంది. న్యాయస్థానం అనుమతి అనంతరం ఆ ఆస్తులను అటాచ్‌ చేస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement