నిధులు మళ్లించాం.. కానీ ఎక్కడికో తెలియదు | Margadarsi Chit Funds MD Sailaja Kiran In CID investigation | Sakshi
Sakshi News home page

నిధులు మళ్లించాం.. కానీ ఎక్కడికో తెలియదు

Published Wed, Jun 7 2023 4:24 AM | Last Updated on Wed, Jun 7 2023 6:45 AM

Margadarsi Chit Funds MD Sailaja Kiran In CID investigation - Sakshi

తమ చందాదారుల నుంచి ఎంత మొత్తం వసూలు చేశారో తెలియదు! బ్రాంచీలు, ప్రధాన కార్యాలయంలో ఉన్న నిధులెన్నో తెలియదు! మిగిలిన నిధులను ఎక్కడికి మళ్లించారో కూడా తెలియదు! కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టం గురించి ఏమాత్రం తెలియదు! అసలు నాకేమీ తెలియదు.. తెలియదు.. తెలియదు!! 
–సీఐడీ విచారణలో మార్గదర్శి ఎండీ శైలజ తీరు ఇదీ

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–2గా ఉన్న సంస్థ ఎండీ చెరుకూరి శైలజా కిరణ్‌ను సీఐడీ అధికారులు మంగళవారం హైదరాబాద్‌లో మరోసారి విచారించారు. సీఐడీ ఎస్పీలు అమిత్‌ బర్దర్, హర్షవర్థన్‌రాజు, విచారణ అధికారి రవికుమార్‌తోపాటు 30 మందితో కూడిన సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి ఉదయం 10 గంటలకు చేరుకోగా దాదాపు అరగంటపాటు గేటు తాళం తీయలేదు.

అనంతరం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సీఐడీ విచారణ కొనసాగింది. ‘మీరు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ కదా? మీ పేరిటే చెక్‌ పవర్‌ కూడా ఉంది. నిధుల మళ్లింపుపై ఆధారాలు ఇవిగో..! మరి వీటిపై ఏమంటారు..?’ అని సీఐడీ అధికారులు సూటిగా ప్రశ్నించడంతో ‘నాకు ఆరోగ్యం బాగా లేదు! నేను సమాధానాలు చెప్పలేకపోతున్నా.. ఇబ్బంది పెట్టొద్దు..’ అంటూ శైలజా కిరణ్‌ తప్పించుకునేందుకు యత్నించారు. 

విచారణకు సహకరించకుండా..
తనకు ఆరోగ్యం బాగా లేదని, విదేశాల నుంచి రావడంతో జ్వరం వచ్చిందంటూ శైలజా కిరణ్‌ విచారణకు సహకరించకుండా చాలాసేపు జాప్యం చేశారు. విచారణ మొదలైన కొద్దిసేపటికే జ్వరంగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయంటూ వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమెను పరీక్షించిన డాక్టర్‌ కొన్ని మాత్రలు సూచించి విచారణ కొనసాగించవచ్చని చెప్పారు.

సీఐడీ అధికారులు మళ్లీ విచారణ చేపట్టిన కొద్దిసేపటికే మరోసారి తనకు ఆరోగ్యం సహకరించడం లేదని శైలజా కిరణ్‌ పేర్కొన్నారు. విచారణను అర్ధాంతరంగా ముగించేందుకు ప్రయత్నించగా సీఐడీ అధికారులు పూర్తి సహనం వహిస్తూ విచారణను కొనసాగించారు. 

మళ్లించాం... ఎక్కడికో తెలియదు!
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారుల నుంచి వసూలు చేసిన నిధులను ఎక్కడికి మళ్లించారనే విషయాన్ని తెలుసుకోవడంపై సీఐడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. బ్రాంచీల కార్యాలయాల్లోని రికార్డుల ప్రకారం రూ.వేల కోట్లు చందాదారుల నుంచి వసూలు చేసినట్లు తేలింది. బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టిన రూ.793.50 కోట్లను అటాచ్‌ చేసేందుకు సీఐడీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  చందాదారుల నుంచి భారీగా వసూలు చేసిన మిగతా నిధులను ఎక్కడికి మళ్లించారన్నది అంతుచిక్కని వ్యవహారంగా మారింది.

రికార్డుల్లో సరైన వివరాలు లేకుండా ఆడిటర్ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డారు. సీఐడీ అధికారులు అదే విషయంపై శైలజా కిరణ్‌ను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఏపీలోని 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా వసూలు చేసిన చందా నిధులను ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టామని పేర్కొనట్లు సమాచారం. నిర్దిష్టంగా ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారన్నది మాత్రం ఆమె వెల్లడించలేదు. దీనిపై సీఐడీ అధికారులు ఎంత ప్రశ్నించినా తనకేమీ తెలియదని శైలజా కిరణ్‌ చెప్పడం గమనార్హం.

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ తమ చందాదారులకు చిట్టీల మొత్తాన్ని ఎందుకు చెల్లించలేకపోతోందని సీఐడీ అధికారులు శైలజా కిరణ్‌ను ప్రశ్నించగా సూటిగా సమాధానం ఇవ్వలేదు. చందాదారుల సొమ్ము భద్రంగా ఉందంటూ తప్పించుకునే యత్నం చేశారు. అదే నిజమైతే చిట్టీల మొత్తం ఎందుకు చెల్లించలేకపోతున్నారని సీఐడీ అధికారులు ప్రశ్నించగా ఆమె స్పందించలేదు. 

మరోసారి విచారణ
విచారణకు శైలజా కిరణ్‌ సహకరించకపోవడంతో ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేయాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. ఆమెకు అనుకూలంగా ఉన్న రోజే విచారించాలని భావిస్తున్నారు. ఈమేరకు త్వరలో మరోసారి నోటీసులు జారీ చేయనున్నారు. ఆ తరువాత రామోజీరావును కూడా మరోసారి విచారించాలని సీఐడీ భావిస్తోంది.

చట్టాన్ని ఉల్లంఘించి... నిధులు కొల్లగొట్టి!
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ ద్వారా చెరుకూరి రామోజీరావు, శైలజ భారీగా ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సోదాల్లో ఆధారాలతో సహా వెల్లడైంది. రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించి ఆర్థిక అక్రమాలను నిర్ధారించారు. కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టం–1982 ప్రకారం చందాదారుల నుంచి వసూలు చేసిన నిధులను సంబంధిత బ్రాంచీ కార్యాలయాలున్న నగరాలు/పట్టణాల్లోని జాతీయ బ్యాంకుల్లోనే జమ చేయాలి.

అందుకు విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ రూ.వేల కోట్లను హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి మళ్లించింది. చిట్‌ఫండ్స్‌ సంస్థలు తమ నిధులను ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మాత్రం తమ చందాదారుల నిధులను అత్యంత మార్కెట్‌ రిస్క్‌ ఉంటే మ్యూచువల్‌ ఫండ్స్, షేర్‌ మార్కెట్‌లోకి మళ్లించింది. తమ కుటుంబ వ్యాపార సంస్థల్లో పెట్టుబడిగా పెట్టింది.

చిట్‌ఫండ్స్‌ సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ తమ చందాదారుల చిట్టీల మొత్తాన్ని పూర్తిగా వారికి ఇవ్వకుండా రశీదులిస్తూ 4 – 5 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అంటే అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తోంది. పెద్ద ఎత్తున నల్లధననాన్ని తమ సంస్థ ముసుగులో చలామణిలోకి తెస్తున్నట్లు కూడా సీఐడీ గుర్తించింది.

గత డిసెంబర్‌ నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కొత్త చిట్టీలు వేయడం లేదు. ఇప్పటికే దాదాపు రూ.400 కోట్ల టర్నోవర్‌ నిలిచిపోయింది. చందాదారుల సొమ్మును గుర్తుతెలియని సంస్థల్లో పెట్టుబడిగా పెట్టింది. ఆ నిధులు ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం లేదు. దీంతో చందాదారులకు చిట్టీల మొత్తం చెల్లించలేకపోతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement