వాంగ్మూలాలు మార్చేద్దాం.. వాస్తవాలు కప్పెట్టేద్దాం | A massive conspiracy targeting IPS | Sakshi
Sakshi News home page

వాంగ్మూలాలు మార్చేద్దాం.. వాస్తవాలు కప్పెట్టేద్దాం

Published Sat, Aug 31 2024 4:57 AM | Last Updated on Sat, Aug 31 2024 8:20 AM

A massive conspiracy targeting IPS

ప్రభుత్వ పెద్దల కుతంత్రానికి విజయవాడ సీపీ వత్తాసు

కొందరు ఐపీఎస్‌లే లక్ష్యంగా భారీ కుట్ర

మాయలేడీ కాదంబరి జత్వానీ కేసును వక్రీకరించే పన్నాగం

ఇందులో భాగంగా శుక్రవారం విజయవాడకు వచ్చిన కాదంబరి

ఓ స్టార్‌ హోటల్‌లో బస కల్పించిన పోలీసులు

తాజాగా ఏం చెప్పాలో.. ఎలా చెప్పాలో బ్రీఫింగ్‌

సీపీతో భేటీ.. అనంతరం విచారణాధికారి ఎదుట హాజరు

హోటల్‌లో పోలీసులు ఇచ్చిన స్క్రిప్టునే వల్లె వేసిన వైనం

తనను ఆ రోజు ఏపీ పోలీసులు కిడ్నాప్‌ చేశారని మీడియాకు వెల్లడి

సాక్షి, అమరావతి: వలపు వల విసిరి పారిశ్రామికవేత్తలను బురిడీ కొట్టించి ఆస్తులు కొల్లగొట్టే కి‘లేడీ’ కాదంబరి జత్వానీ కేసులో తిమ్మిని బమ్మి చేసేందుకు టీడీపీ కూటమి సర్కారు కుట్రలకు పదునుపెడుతోంది. ఈ కేసుకు వక్రభాష్యం చెబుతూ రాజకీయ కక్ష సాధింపు కుట్రను వేగవంతం చేస్తోంది. గతంలో ఈ కేసుకు సంబంధించి అధికారులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు తప్పని ముద్ర వేసేందుకు కుయుక్తులు పన్నుతోంది. 

నారా లోకేశ్‌ దుగ్ధతో తన రెడ్‌బుక్‌లో ప్రస్తావించిన పోలీసు అధికారులపై కక్ష సాధించడంతోపాటు వైఎస్సార్‌సీపీ సర్కారుపై దుష్ప్రచారం చేసేందుకు పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత తదితరులంతా ఈ కేసులో నిందితురాలికి వత్తాసు పలుకుతూ మాట్లాడటం ప్రభుత్వ పన్నాగాన్ని బట్టబయలు చేస్తోంది. టీడీపీ పెద్దల ఒత్తిడి మేరకు విజయవాడ పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసును వక్రీకరిస్తూ రాజకీయ కక్ష సాధింపు ఉపకరణాలుగా మారుతున్నారు.  

ఆ ముగ్గురు ఐపీఎస్‌లే లక్ష్యం... మేం చెప్పినట్లు వాంగ్మూలాలివ్వండి 
మాయలేడీ కాదంబరి జత్వానీ బ్లాక్‌మెయిలింగ్‌ చేయడంతోపాటు ఫోర్జరీ పత్రాలతో తనకు చెందిన 5 ఎకరాలను దక్కించుకోవడంపై బాధితుడు విద్యాసాగర్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం న్యాయస్థానం సమ్మతితో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసు అధికారుల బృందం ముంబై వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో ఆమెను అరెస్ట్‌ చేసింది. అనంతరం ముంబై న్యాయస్థానంలో హాజరుపరచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తీసుకువచ్చారు. అదే రోజు విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. 

అనంతరం న్యాయస్థానం ఐదు రోజులు పోలీసు కస్టడీకి అనుమతించడంతో కాదంబరి జత్వానీ వ్యక్తిగత న్యాయవాది సభ, ప్రభుత్వ వీఆర్‌వో సమక్షంలో విచారించారు. ఫోర్జరీ పత్రాలకు సంబంధించిన సాక్షులు, 5 ఎకరాలను విక్రయించేందుకు అడ్వాన్స్‌ ఇచ్చిన వారు... ఇలా పలువురు సాక్షులను విచారించారు. పోలీసుల విచారణతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఆమెకు రిమాండ్‌ విధించింది. అంతా చట్ట ప్రకారం సాగిన ఈ కేసుకు వక్రభాష్యం చెప్పాలంటే ఏం చేయాలనే ఆరాటంతో టీడీపీ కూటమి సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఈ క్రమంలో గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన సాక్షులు, అధికారులను విజయవాడ పోలీసులు పిలిపించి తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారు. 

నాడు ఐపీఎస్‌ల ఒత్తిడితో వాంగ్మూలు ఇచ్చామని చెప్పాలంటూ వేధిస్తున్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని బెదిరిస్తున్నారు. అప్పట్లో ముంబై వెళ్లిన పోలీసుల బృందంలో కిందిస్థాయి అధికారులను కూడా  బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. లోకేశ్‌ రెడ్‌బుక్‌లో పేర్కొన్న ఓ సీనియర్‌ ఐపీఎస్‌తోపాటు మరో ఇద్దరు ఐపీఎస్‌ల ఒత్తిడితోనే తాము కాదంబరి జత్వానిపై తప్పుడు కేసులు నమోదు చేసినట్లు చెప్పాలని బెదిరిస్తుండటం గమనార్హం. తాజాగా దీనిపై విచారణ అధికారిగా డీసీపీ కె.స్రవంతి రాయ్‌ను నియమించినా గతంలో ఇచ్చిన దానికి విరుద్ధంగా వాంగ్మూలాలు ఇప్పించే ప్రక్రియను విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు స్వయంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం. 

ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఉదంతం పోలీసు శాఖలో ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. గతంలో సక్రమంగా సాగిన విచారణను.. కోర్టు కూడా ఆమోదించిన విచారణ ప్రక్రియను కేవలం రాజకీయ దురుద్దేశంతో తిరగదోడి అక్రమ కేసులు బనాయించడం విస్మయం కలిగిస్తోందని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.  

విజయవాడ కమిషరేట్‌లో హైడ్రామా 
హైడ్రామాలో భాగంగా కి‘లేడీ’ కాదంబరి జత్వానిని శుక్రవారం విజయవాడ రప్పించారు. ఓ స్టార్‌ హోటల్‌లో ఆమెకు బస కల్పించి కొందరు పోలీసు అధికారులు ఆమెకు తాము సిద్ధం చేసిన స్క్రిప్ట్‌ అందించారు. గతంలో చెప్పిన విషయాలను వక్రీకరిస్తూ ఎలా మాట్లాడాలో తర్ఫీదు ఇచ్చారు. తన తల్లి, న్యాయవాదులతో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబును కలిసిన అనంతరం విచారణ అధికారి స్రవంతి రాయ్‌తో ఆమె చర్చించినట్లు తెలుస్తోంది. 

పోలీసు అధికారులు ముందుగా అందచేసిన స్క్రిప్‌్టనే ఆమె వల్లించినట్లు సమాచారం. తనను బెదిరించి సంతకాలు తీసుకున్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె వాదన అసంబద్ధమని పోలీసు వర్గాలు, పరిశీలకులు స్పష్టం  నిజంగానే బలవంతంగా తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని ఉంటే ముంబై వెళ్లిన వెంటనే ఆ విషయాలను బయటపెట్టి న్యాయస్థానంలో కేసు వేసేవారని పేర్కొంటున్నారు. 

అంబరీష్‌ జత్వానీ స్మగ్లర్‌.. 
పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతలు, బ్యూరోక్రాట్లను బ్లాక్‌మెయిల్‌ చేసి భారీగా ఆస్తులు కొల్లగొట్టే కుట్రలో కాదంబరి జత్వానీకి ఆమె తమ్ముడు అంబరీష్‌ జత్వానీ భాగస్వామి అనే విషయం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దుబాయ్‌ అండర్‌ వరల్డ్‌ మాఫియాతో సన్నిహిత సంబంధాలున్న అంబారీష్‌ జత్వానీ అంతర్జాతీయ స్మగ్లర్‌ కూడా. 

గతంలో బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తూ అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారులకు చిక్కాడు. 2021 డిసెంబర్‌ 30న 599.490 గ్రామాలు బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తుండగా కస్టమ్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇక సజ్జన్‌ జిందాల్‌తోసహా పలువురు పారిశ్రామికవేత్తలను బ్లాక్‌మెయిల్‌ చేసి భారీగా ఆస్తులు గుంజడంలో అతను పాత్రధారిగా వ్యవహరించాడు.  

హనీట్రాప్, బ్లాక్‌మెయిలింగ్‌ జత్వాని కుటుంబ దందా
– ‘సాక్షి’ టీవీ చర్చలో కుక్కల విద్యా సాగర్‌  
‘బ్లాక్‌మెయిలింగ్, ఫోర్జరీలకు పాల్పడి అక్రమంగా ఆస్తులు కొల్లగొట్టడం కాదంబరి జత్వానీ, ఆమె కుటుంబం దందా. పెళ్లి చేసుకోవాలని లేదంటే ఆస్తులు రాసివ్వాలని బెదిరిస్తారు. సంతకాలు ఫోర్జరీ చేయడం, బోగస్‌ డాక్యుమెంట్లు సృష్టించడం, ఆస్తులు కొల్లగొట్టడం పక్కా కుట్రతో చేస్తారు. ఈ దందాలో కాదంబరి జత్వానీతోపాటు ఆమె తల్లి, సోదరుడు అంబరీశ్, ఇతర కుటుంబ సభ్యులు భాగస్వాములు. నాతోపాటు జిందాల్, ఏసియన్‌ పెయింట్స్‌ లాంటి పెద్ద పారిశ్రామిక సంస్థల కుటుంబాలకు చెందినవారితోపాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాల్లో ఎంతోమంది కాదంబరి జత్వాని బాధితులున్నారు. 2009లో నటాషా అనే పేరుతో పరిచయం చేసుకుంది. 

తనకు రెండేసి చొప్పున పాస్‌పోర్ట్‌లు, ఆధార్‌ కార్డులు ఉన్నాయి. ఎన్నోసార్లు బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు అడిగేది. నా ఫోటోలను మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. జగ్గయ్యపేటలో నా 5 ఎకరాల భూమిని ఫోర్జరీ పత్రాలతో ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ ఏడాది ఫ్రిబవరిలో తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశా. పోలీసులు కేసు నమోదు చేసి చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్‌ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. నాలాంటి ఎంతోమంది మోసపోకుండా  సమర్థంగా వ్యవహరించారు. నాకు వైఎస్సార్‌సీపీతో ఎలాంటి సంబంధం లేదు. 

2014 ఎన్నికల ముందు మా నాన్న నాగేశ్వరరావు చనిపోవడంతో ఆయన ఇన్‌చార్జిగా ఉన్న పెనమలూరు నుంచి వైస్సార్‌సీపీ తరపున పోటీ చేయాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్నా. అప్పటి నుంచి నాకు ఏ పార్టీతోనూ సంబంధాలు లేవు. కాదంబరి జత్వానీని హఠాత్తుగా పిలిపించి తప్పుడు ఆరోపణలు చేయిస్తుండటం వెనుక పక్కా కుట్ర ఉంది. ఆమె నుంచి గత ఫిబ్రవరిలో పోలీసులు స్వాధీనం చేసుకున్న 7 ఫోన్లలోని వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదు? ఈ కేసు విషయంలో న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నా. బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలకు భయపడేదే లేదు.’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement