శాసన సభలో మంత్రి, కూటమి సభ్యుల చర్చ
సాక్షి, అమరావతి: ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్ల జారీ వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఇరికించాలన్న లక్ష్యంతో గురువారం శాసన సభలో పెద్ద చర్చే జరిగింది. టీడీఆర్ బాండ్ల జారీలో భారీ అవకతవకలు జరిగాయని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పడం, ఇందులో కారుమూరిని ‘ఫిక్స్’ చేయాలని కొందరు సభ్యులు కోరడం, నివేదిక రాగానే అలాగే చేద్దామని మంత్రి చెప్పడం చూస్తే అంతా ఓ ప్రణాళిక ప్రకారం చర్చ జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. గురువారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ గడిచిన ఐదేళ్లలో 3,301 టీడీఆర్ బాండ్లు జారీ చేశారని చెప్పారు.
తణుకు, విశాఖ, గుంటూరు, తిరుపతిలో బాండ్ల జారీలో ఆరోపణలు రావడంతో శాఖాపరంగా, ఏసీబీతో కూడా విచారణ చేయిస్తున్నామన్నారు. తణుకులో 27.96 ఎకరాలకు రూ.63.24 కోట్లకు బాండ్లు జారీ చేయాల్సి ఉండగా, ఏకంగా రూ.754.67 కోట్లకు జారీ చేశారన్నారు. అంటే రూ.691.43 కోట్ల స్కామ్ జరిగిందని, ఇందుకు బాధ్యులైన ముగ్గురు అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేసామని మంత్రి వివరించారు. రాబోయే 15 రోజులు బాండ్ల జారీని పూర్తిగా నిలిపివేసినట్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యేలు అరిమిల్లి రాధాకృష్ణ, గోరంట్ల బుచ్చెయ్యచౌదరి మాట్లాడుతూ.. సూత్రధారులపై చర్యలు తీసుకోవాలే తప్ప చిన్న చిన్న ఉద్యోగులపై కాదని అన్నారు.
తణుకు స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హస్తముందని, ఆయన్ని ఖచి్చతంగా ఈ కేసులో ఇరికించాల్సిందే (ఫిక్స్)నని డిమాండ్ చేశారు. దీనికి మంత్రి బదులిస్తూ విచారణ నివేదిక రాగానే తప్పకుండా కారుమూరిని ఫిక్స్ చేద్దామని చెప్పారు. తిరుపతి, విశాఖ, గుంటూరులో కూడా అప్పటి ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేద్దామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 3.13 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment