మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు, అధికారులు
సాక్షి, అమరావతి: వచ్చే జూన్ నెలాఖరులోగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. గ్రామ, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సచివాలయంలో గురువారం గ్రామ, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మునిసిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, గ్రామ, వార్డు సచివాలయాలు, స్పందన సలహాదారు ధనుంజయరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలి
మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది పనితీరుకు సంబంధించి ఆయా శాఖల వారీగా సర్టిఫికెట్లు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌ను ఆదేశించారు.
మునిసిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ (ఏపీ సేవా పోర్టల్)ను గురువారం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారని తెలిపారు. దీంతో ప్రజలు వివిధ సేవలకు ఏ సచివాలయం నుంచి అయినా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. గ్రామ, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ.. ప్రస్తుతం గ్రామాల్లో 11,162, పట్టణాల్లో 3,842.. మొత్తం 15,004 సచివాలయాలు పనిచేస్తున్నాయని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో 11, వార్డు సచివాలయాల్లో 10 ఫంక్షనరీలకు సంబంధించిన సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. ఈ సచివాలయాల్లో ఉన్న 14,493 ఖాళీలను త్వరితగతిన భర్తీచేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 3.50 కోట్ల సేవలు అందించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment