సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధి లోకి రాష్ట్ర ప్రభుత్వం అనేక కొత్త చికిత్సలు తీసుకురావడంతో ఎంతోమందికి లబ్ధిచేకూరుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు కేవలం 1,059 రకాల చికిత్సలు మాత్రమే అందుబాటులో ఉండేవి. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఇప్పుడా సంఖ్య 2,436కి చేరింది. అంతేకాక.. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకూ ఉన్న వారిని కూడా పథకం పరిధిలోకి చేర్చడంతోపాటు బిల్లు రూ.వెయ్యి దాటితే వాటినీ ఆరోగ్యశ్రీలోకి తీసుకువచ్చారు. దీంతో ఇప్పటివరకు 1,96,491 మంది లబ్ధిపొందారు. అలాగే, గతంలో 1,059 చికిత్సలు మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడు ఏదైనా కొత్త సమస్య వస్తే బాధితులు తమ చేతి నుంచి పెట్టుకోవాల్సి వచ్చేంది. ఇప్పుడా పరిస్థితి నుంచి పూర్తిగా విముక్తి లభించింది.
రూ.430.11 కోట్లు వ్యయం
ఇక ఆరోగ్యశ్రీ పథకంలోకి కొత్తగా చేర్చిన చికిత్సల కోసం 2020 జనవరి నుంచి 2021 అక్టోబర్ 9 వరకు రూ.430.11 కోట్లు వ్యయమైంది. అంటే.. ఒక్కో పేషెంటుకు రాష్ట్ర ప్రభుత్వం సగటున రూ.21,889 ఖర్చు చేసింది. అంతేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఖ్య కూడా భారీగా పెంచారు.
ఇతర రాష్ట్రాల్లో 129 నెట్‌వర్క్ ఆస్పత్రులు
మరోవైపు.. గతంలో రాష్ట్రం దాటి చికిత్సకు వెళ్తే సొంత డబ్బులతో చికిత్స చేయించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడలాంటి పరిస్థితికి స్వస్తి చెప్పారు. పొరుగునున్న మూడు రాష్ట్రాల్లో 129 ఆస్పత్రులను జాబితాలో చేర్చారు. ఇందులో 81 తెలంగాణలో, 33 కర్ణాటకలోనూ, 15 తమిళనాడులోనూ ఉన్నాయి. పెద్దపెద్ద జబ్బులు వచ్చి, మన రాష్ట్రంలో చికిత్సకు అవకాశంలేకపోతే ఇతర రాష్ట్రాలకూ వెళ్లి చేయించుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇలా ఇప్పటివరకూ 29,185 మందికి అనుమతులిచ్చారు. ఇందుకు రూ.74.68 కోట్లు ఖర్చయింది.
6 లక్షల మందికి ఆసరా
ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేయించుకుని కోలుకునే సమయంలో కుటుంబ పోషణ నిమిత్తం బాధితుడికి సర్కారు ‘ఆరోగ్య ఆసరా’తో అండగా నిలుస్తోంది. దీని ద్వారా సుమారు 6 లక్షల మంది లబ్ధిపొందారు. ఇందుకోసం రూ.349 కోట్లను సర్కారు చెల్లించింది. అలాగే, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కదలలేని స్థితిలో ఉన్న 57,331 మంది రోగులకు నెలనెలా రూ.35 కోట్ల మేర పెన్షన్ ఇస్తున్నారు. ఇందుకోసం 12 జబ్బులను గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment