మాట్లాడుతున్న మంత్రులు సురేష్, గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చేసే వినూత్న ఆవిష్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఇందులో భాగంగా నవంబర్ నెలలో ఐటీ, విద్యా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్టార్టప్ కాంగ్రెస్ అండ్ ఎక్స్‌పో నిర్వహించబోతున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన బ్రోచర్లను బుధవారం సచివాలయంలో మంత్రులు మేకపాటి, ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. అనంతరం మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ నేపథ్యంలో టెక్నాలజీ వినియోగం బాగా పెరిగిందన్నారు. సీఎం వైఎస్ జగన్ మెరుగైన విద్య అందించడం నుంచి ఉపాధి అవకాశాలు కల్పించడం వరకు ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు.
ఇందులో భాగంగా గ్లోబల్ ఎక్స్‌పో సదస్సును విశాఖలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. గతంలో బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు యువతను మోసం చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్షలాది ఉద్యోగ నియామకాలు చేశారని చెప్పారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశారన్నారు. అలాగే నవంబర్ 18, 19, 20 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఎక్స్‌పో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి వివిధ దేశాలకు చెందిన వేలాది మంది టెక్నాలజీ, పారిశ్రామిక, విద్య, స్టార్టప్ రంగాలకు చెందిన నిపుణులు హాజరవుతారని వివరించారు. అలాగే ఈ గ్లోబల్ ఎక్స్‌పోలో వందలాది పరిశ్రమలకు చెందిన వారు.. తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తారని తెలిపారు. కాగా, కోవిడ్ నేపథ్యంలో అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వర్చువల్‌గా సెమినార్లు నిర్వహించే యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment