ప్రత్తిపాడు: ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు నిజంగా కష్టపడుతున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సోమవారం గ్రామ సచివాలయ భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీల్లో పెట్టిన ప్రత్యేక హోదా రావాలని రాష్ట్రం విడిపోయిన నాటినుంచీ ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సైతం ప్రత్యేక హోదా కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని మంత్రి గుర్తు చేశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా పలుసార్లు మోదీని నేరుగా కలిసి హోదా అంశాన్ని గుర్తు చేశారని, ముఖ్యమంత్రులతో మోదీ మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఇదే అంశంపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడారని వివరించారు. అయితే, ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని, ప్రత్యేక ప్యాకేజీ చాలని గత ప్రభుత్వం చెప్పడం వల్లే ఈ అంశాన్ని పక్కన పెట్టామని కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు చాలాసార్లు చెప్పారని హోంమంత్రి అన్నారు.
కేంద్రం వెనక్కిపోవడం బాధాకరం
విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే చాలా లాభాలున్నాయని, అందుకోసమే ఎప్పటి నుంచో హోదా అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిలదీస్తున్నారని హోం మంత్రి సుచరిత చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర హోం శాఖ అజెండాలో పెట్టిన ప్రత్యేక హోదా అంశంపై వెనక్కిపోవడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ చెప్పిందన్నారు. 2014లో మోదీనే స్వయంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని, అధికారంలోనికి వచ్చిన తరువాత దాటవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని చెప్పారు. ఎందుకంటే మనం అడిగే పరిస్థితుల్లో ఉన్నామని, వారు అడిగించుకునే పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు.
‘హోదా’ కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్
Published Tue, Feb 15 2022 3:43 AM | Last Updated on Tue, Feb 15 2022 3:43 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment