సాక్షి, అమరావతి: ఫ్యాషన్.. ప్రపంచానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫ్యాషన్ పేరు చెప్పి మన దేశంలో ఏటా రూ.వేల కోట్ల వ్యాపారం సాగుతోంది. ముఖ్యంగా మహిళలు సౌందర్యం, అలంకరణ వస్తువుల కోసం విపరీతంగా ఖర్చు చేస్తుంటారు. ఈ విషయంలో మగవారు మగువలకు ఏమాత్రం తక్కువ కాదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా పురుషుల ఫ్యాషన్ మార్కెట్ 11 శాతం వృద్థి చెందడమే దీనికి నిదర్శనంగా చూపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ మార్కెట్ టర్నోవర్ ఏటా రూ.31 వేల కోట్లు అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంతలా మగాళ్లు తగ్గట్లేదంటే మారుతున్న సామాజిక ధోరణులు (ట్రెండ్స్) దీనికి కారణమంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ, గడ్డం గ్రూమింగ్, ఫెర్ఫ్యూమ్స్‌కు సంబంధించి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వినియోగం పురుషులు ప్రపంచ ట్రెండ్‌లను అనుసరించేలా చేస్తోంది.
అలా మొదలై.. ఇలా పెరిగింది
పురుషులు వస్త్రధారణ, అలంకరణలో ప్రత్యేకత చూపించడమేది కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు. పూర్వకాలం నుంచీ రాజసాన్ని, దర్పాన్నీ ప్రదర్శించే విధంగా దుస్తులను ధరించే అలవాటు ఉండేది. మహారాణి, యువరాణుల మెడలో బంగారం, వజ్రాల నగలు వేసుకుంటే.. వారికి సమానంగా రాజు, యువరాజులు కూడా హారాలు, కిరీటాలు ధరించే వారు. రాజుల తరువాత మండలాధీశులు, వ్యాపారులు కొంతవరకూ ఇలాంటి అలంకరణలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే సామాన్య ప్రజల్లో ఇలాంటివి చాలా అరుదుగా ఉండేవి.
వారంతా సాధారణ వస్త్రాలు, మామూలు నగలు ధరించే వారు. కానీ.. కాలంతో పాటు పేద, ధనిక అనే తేడా లేకుండా ఎవరి స్థాయిలో వారు ఫ్యాషన్‌గా కనిపించేందుకు తాపత్రయపడటం ప్రారంభించారు. కేవలం విలువైన వస్తువులు ధరించడమే ఫ్యాషన్ అనుకునే స్థాయి నుంచి తాము ఏది ధరిస్తే అదే ఫ్యాషన్ అనే స్థితికి వచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏది ట్రెండింగ్‌లో ఉందో చూసుకుని ఆ ఫ్యాషన్ మోడల్‌ను ఫాలో అయిపోతున్నారు. కొందరు సినిమా, క్రికెట్ స్టార్లు తమ ప్రత్యేక వస్త్రధారణ, అలంకరణతో ట్రెండ్ సెట్ చేస్తూ, యూత్‌కి మార్గదర్శకం అవుతున్నారు. దీనికి తగ్గట్టుగానే కార్పొరేట్ దిగ్గజాలు వారి రిటైల్ అవుట్‌లెట్లలో మగవారి కోసం ప్రత్యేకంగా బ్రాండెడ్ వస్త్రాలు, వస్తువులను అందుబాటులో ఉంచుతున్నారు.
దుస్తుల తర్వాత ప్రాధాన్యం వాటికే..
పురుషులు ఎక్కువగా ఖర్చు చేస్తున్న వాటిలో మొదటి స్థానంలో దుస్తులున్నాయి. అంతర్జాతీయ ఫ్యాషన్లను యథాతథంగా అనుసరిస్తున్నారు. ఆన్‌లైన్ ఈ–కామర్స్ సైట్లలో ఆర్డర్ పెడితే ఎక్కడి నుంచైనా కావాల్సిన దుస్తుల్ని ఇంటికి తెప్పించుకునే వెసులుబాటు రావడంతో దుస్తుల ఫ్యాషన్‌లో సరిహద్దులు చెరిగిపోయాయి. మారుతున్న సాంస్కృతిక ప్రమాణాలు ఇందుకు దోహదపడుతున్నాయి.
ఎండ ప్రభావం నుంచి మొహాన్ని.. చర్మాన్ని రక్షించే సన్‌బ్లాక్ క్రీమ్‌లు రాసుకోవడాన్ని మగవారు ఒకప్పుడు వింతగా భావించే వారు. కానీ.. ఇప్పుడు క్రీమ్‌లతో పాటు సువాసనలు వెదజల్లే ఫెర్ఫ్యూమ్స్ వాడకం పెరిగింది. పురుషులు మునుపెన్నడూ లేనివిధంగా వ్యక్తిగత సంరక్షణ పద్ధతులను పాటిస్తున్నారు. అంతర్జాతీయ ఫ్యాషన్, జీవనశైలి ధోరణులకు మన దేశంలో పురుషులు ఆకర్షితులవుతున్నారు. అందుబాటులో ఉన్న అనేక మాధ్యమాల ద్వారా తమకు అవసరమైన వాటిపై వారు అవగాహన పెంచుకుంటున్నారు.
ఆరోగ్య స్పృహ పెరగడం కూడా ఇందుకు మరో కారణమని చెప్పవచ్చు. ఆడవారితో పాటు పురుషులకు కూడా జుట్టు సంరక్షణ ముఖ్యమని భావిస్తున్నారు. దీనికి తగ్గట్టు మెన్స్ బార్బర్ షాప్‌లు విపరీతంగా పెరిగాయి. ఇవి హెయిర్ కట్‌లతో పాటు గడ్డం ట్రిమ్మింగ్, మానిక్యూర్, పెడిక్యూర్, షేవ్, ఫేషియల్స్ వంటి సేవలను అందిస్తున్నాయి. అంతేకాదు ఇలాంటి చోటనే పురుషులు ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటున్నారు. వివిధ వస్త్రధారణ పద్ధతులు, సౌందర్య ఉత్పత్తుల గురించి తెలిపే సామాజిక సమావేశ స్థలాలుగా సెలూన్స్ పరిణామం చెందాయి.
Comments
Please login to add a commentAdd a comment