
సాక్షి, నెల్లూరు : ఆనందయ్య మందుపై ఐసీఎంఆర్, ఆయూష్ నివేదికల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం జరుగుతోందని చెప్పారు. ప్రతిఒక్కరూ రాజకీయాలు పక్కనబెట్టి ప్రభుత్వానికి సహరించాలని, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండ్రోజుల క్రితం ఆనందయ్య ఆయుర్వేద మందు వేసుకున్న.. రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కోటయ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.
శనివారం నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మంత్రి అనిల్ పర్యటించారు. అధికారులు, వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు అన్ని విధాలా ముందుకెళ్తున్నామన్నారు. ప్రధాన ఆస్పత్రిలో మరో ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటుకు యత్నిస్తున్నామని చెప్పారు. బ్లాక్ ఫంగస్ కేసుల కోసం ప్రత్యేకంగా 50 బెడ్లు ఏర్పాటు చేశామన్నారు.