సాక్షి, కృష్ణా జిల్లా: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేసిన తర్వాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఆయనకు ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో టీడీపీ 20కి 20 సీట్లు గెలిస్తే ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణపై పునరాలోచన చేసే అవకాశం ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ఒక వేళ ఉపఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాలన్నారు. (ఆ వ్యాఖ్యలు దుర్మార్గం: దేవినేని అవినాష్)
గత టీడీపీ హయాంలో చంద్రబాబు తీసుకున్న పిచ్చి తుగ్లక్ నిర్ణయాలకు విసుగు చెందిన ప్రజలు.. చిత్తు చిత్తుగా ఓడించారని, అయినా సిగ్గులేకుండా జూమ్ యాప్‌లో పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘ రాయలసీమ జిల్లాల్లో 52 సీట్లు ఉంటే చంద్రబాబు, బాలయ్యలను మాత్రమే గెలిపించారు. అక్కడ ప్రజలు కూడా చీదరించుకున్న బుద్ధి రాలేదు. టీడీపీకి కంచుకోట ఉత్తరాంధ్ర ప్రాంతం. అక్కడ ప్రజలు కూడా చంద్రబాబుకు బుద్ధి చెప్పారు. కృష్ణా, గుంటూరు ప్రజలు కూడా ఆయన చేసిన మోసం గ్రహించి లోకేష్‌ను ఓడించారని’’ మంత్రి విమర్శలు గుప్పించారు.
సీఎం వైఎస్ జగన్, ప్రజల అభీష్టం మేరకు తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలిపారన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని.. లేకపోతే మళ్లీ రాష్ట్ర విభజన ఉద్యమాలు వస్తాయనే ఆలోచనతోనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒకే చోట లక్ష కోట్లు వ్యయంతో మహా నగరం నిర్మించడం సాధ్యం కాదన్నారు. అమరావతి రాజధాని నిర్మించడానికి అయ్యే ఖర్చులో 10 శాతం విశాఖపట్నంలో పెడితే మనం కూడా మహా నగరాలకు ధీటుగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతామని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment