సాక్షి, కృష్ణా జిల్లా: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టలేకపోవడం చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. శనివారం ఆయన గుడివాడలో తాపీ కార్మిక సంక్షేమ సంఘ నూతన భవనాన్ని కార్మిక శాఖ మంత్రి జయరామ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ పోటీ చేసిన 106 స్థానాల్లో ఒక్క శాతం కూడా ఓట్లు సాధించలేని టీడీపీని జాతీయ పార్టీ అని ప్రకటించుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా టీడీపీని చంద్రబాబు పతనం చేశారని, ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు.. ప్రజా నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఢీ కొడతాననడం అవివేకమని దుయ్యబట్టారు. (చదవండి: చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్!)
‘‘రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది. చంద్రబాబు కోర్టులకు వెళ్లడం వల్లనే ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు నిలిచి రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడుతుంది. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ అడ్డుకుంటుంది. హైదరాబాద్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి పునరావృతమవుతాయి. టీడీపీని చంద్రబాబు నాయుడు గాలి పార్టీగా తయారు చేసి, ఆయన ఒక గాలి నాయకుడిగా మిగిలిపోయాడు. ఆయన నాయకుడిగా ప్రజల తిరస్కారానికి గురయ్యి, ఒక మేనేజర్ మాదిరి మిగిలిపోయారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని’’ విమర్శలు గుప్పించారు. (చదవండి: పోలవరానికి రూ.2,234.28 కోట్లు విడుదల)
పెండింగ్ బిల్లులు విడుదల చేస్తాం: మంత్రి జయరామ్
కార్మిక వర్గాలకు మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి జయరామ్ అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను విడుదల చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరి దోపిడీకి గురికాకుండా, ఇసుక పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జయరామ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment