సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జూపార్క్లను మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్దం చేయాలని అటవీశాఖ అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో బుధవారం అటవీశాఖపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ సందర్శకులను మరింతగా ఆకర్షించేలా తిరుపతి, విశాఖ జూపార్క్ లను తీర్చిదిద్దాలని కోరారు. దేశంలోని పలు జంతుసందర్శనశాలల్లో అదనంగా ఉన్న జంతువులను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మన వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్న జంతువులను ఇతర జూలకు ఇచ్చి, వారి వద్ద ఉన్న జంతువులను మనం తెచ్చుకునే విధానం ఉందని, దీనిపై అధికారులు కసరత్తు చేయాలని కోరారు.
అలాగే జామ్ నగర్‌లోని ప్రైవేటు జూలో ఉన్న జంతువులను కూడా ఎక్స్చేంజ్, లేదా కొనుగోలు ద్వారా కూడా సమీకరించుకోవచ్చని సూచించారు. దీనిపై వన్యప్రాణి విభాగం అధికారులు డిపిఆర్‌లు సిద్దం చేయాలని, నిర్ధిష్ట సమయంలోగా వాటిని అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు. తిరుపతిలో కపిలతీర్థం నుంచి జూపార్క్ వరకు మెమో ట్రైన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా జూపార్క్‌కు సందర్శకుల సంఖ్య పెరిగేలా చేయవచ్చని అన్నారు. వివిధ పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ నిధుల ద్వారా సహకారాన్ని పొందాలని అన్నారు. తిరుపతి జూపార్క్‌లో వైట్ టైగర్ సఫారీపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో అటవీశాఖ నర్సరీల ద్వారా మేలుజాతి మొక్కలను రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. తిరుపతి, రాజమహేంద్రవరం లోని రీసెర్చ్ సెంటర్ల ద్వారా అధిక ఫలసాయం, కలపను అందించే మేలుజాతి మొక్కలను అభివృద్ధి చేయాలని అన్నారు. తిరుపతిలోని బయోట్రిమ్ ద్వారా ఎర్రచందనంపై పరిశోధనలు చేసి, మేలుజాతి మొక్కలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రైతుల నుంచి ఎర్రచందనంపై డిమాండ్ ఎక్కువగా ఉందని, ప్రైవేటు నర్సరీలు ఎక్కువరేట్లకు మొక్కలను విక్రయిస్తున్నాయని చెప్పారు. అటవీశాఖ నర్సరీల ద్వారా అందుబాటు ధరలోనే ఎర్రచందనం మొక్కలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వెదురు, జీడిమామిడి, నేరేడు, ఉసిరి, చింత, యూకలిప్టస్ వంటి మొక్కలను నర్సరీల ద్వారా అందిస్తున్నామని, వీటిల్లో కూడా మరింత మేలైన జాతులను అభివృద్ధి చేయాలని సూచించారు.
చదవండి: (సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదు: మంత్రి అప్పలరాజు)
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కొత్తగా అటవీ అధికారుల శిక్షణకు అకాడమీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిదని అన్నారు. ఈ అకాడమీ ద్వారా అటవీశాఖ ఉద్యోగులు, అధికారుల్లో వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచాల్సి ఉందని, అకాడమీకి అవసరమైన చేయూతను అందిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో అంతరించి పోతున్న అరుదైన జీవ, జంతుజాలంను పరిరక్షించుకునేందుకు బయో డైవర్సిటీ బోర్డ్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న నగరవనాల్లో అరుదైన మొక్కల పెంపకం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖతో సమన్యయం చేసుకుంటూ జీవవైవిధ్యం పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని బోర్డ్ అధికారులను ఆదేశించారు. నేషనల్ గ్రీన్ కార్ఫ్స్ ద్వారా జిల్లా స్థాయిలో ఎకో క్లబ్ లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా విద్యార్ధులకు పర్యావరణం పట్ల అవగాహనను కల్పించడం, స్థానికంగా ప్రజల్లోనూ పర్యావరణ పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్సెషల్ చీఫ్ సెక్రటరీ (ఇఎస్ఎఫ్&టి) నీరబ్ కుమార్ ప్రసాద్, అటవీ దళాల అధిపతి వై.మధుసూదన్ రెడ్డి, డాక్టర్ బిఎంకె రెడ్డి (ఎపి బయో డైవర్సిటీ బోర్డ్ చైర్మన్), ఇఎస్ఎఫ్&టి స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, వన్యప్రాణి విభాగం అడిషనల్ పిసిపిఎఫ్ శాంతిప్రియా పాండే, అడిషనల్ పిసిసిఎఫ్ (విజిలెన్స్) గోపీనాధ్, ఆర్పీ ఖజూరియా (పిసిసిఎఫ్- ప్రొడెక్షన్&అడ్మిన్), ఎకె నాయక్ (పిసిసిఎఫ్-ఐటి), పిఎవి ఉదయ్ భాస్కర్ (అకాడమీ డైరెక్టర్) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment