Mukesh Ambani Speech at AP Global Investors Summit 2023 - Sakshi
Sakshi News home page

అపార వనరులు.. యువ నాయకుడు: ముఖేష్‌ అంబానీ

Published Sat, Mar 4 2023 3:51 AM | Last Updated on Sat, Mar 4 2023 8:32 AM

Mukesh Ambani Comments at Global Investors Summit 2023 - Sakshi

ఒప్పంద పత్రాలతో సీఎం జగన్, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ. చిత్రంలో మంత్రులు పెద్దిరెడ్డి, గుడివాడ, ఉన్నతాధికారి విజయానంద్‌

(విశాఖ జీఐఎస్‌ వేదిక నుంచి సాక్షి, ప్రతినిధి): దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టుబడుల సదస్సుకు ఎన్నడూ హాజరు కాని రిలయన్స్‌ గ్రూపు చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ విశాఖ వేదికగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో పాల్గొనడం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ఈ సదస్సు కోసం 5 గంటలకు పైగా సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించడమే కాకుండా రాష్ట్రంలోని అపార వనరులు, సీఎం వైఎస్‌ జగన్‌ పాలన దక్షత, యువ నాయకత్వాన్ని కొనియాడుతూ ప్రసంగించారు.

అపార వనరులు కలిగి ఉండటం ఒక వరమని, ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టిన తాము భవిష్యత్తులో కూడా అదే బంధాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 10 గిగావాట్ల రెన్యువబుల్‌ సోలార్‌ ఎనర్జీ ప్లాంట్‌ను నెలకొల్పనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. జీఐఎస్‌ సదస్సులో ముఖేష్‌ అంబానీ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే... 

బ్లూ ఎకానమీ (సముద్ర వాణిజ్యం)లో సాగరమంత అవకాశాలను కల్పిస్తూ రాష్ట్రం స్వాగత ద్వారాలు తెరిచింది. రెన్యువబుల్‌ ఓషన్‌ ఎనర్జీ, సముద్ర ఖనిజాలు, మెరైన్‌ బయోటెక్నాలజీ రంగాల్లో చాలా అవకాశాలున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ పటిమతో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా, ఎంత వేగంగా విస్తరిస్తోందో అదేవిధంగా సీఎం వైఎస్‌ జగన్‌ యువ నాయకత్వం, దార్శనికతతో వృద్ధి రేటు, సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది.

ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన రాష్ట్ర యువత, అధికారులకు శుభాకాంక్షలు. నూతన భారత దేశ వృద్ధిలో ఏపీ ముందుండి నడిపిస్తుందన్న నమ్మకం ఇక్కడ యువత, వ్యాపారవేత్తల్లో ధృడంగా కనిపిస్తోంది.  

► ఆంధ్రప్రదేశ్‌లోని అపార అవకాశాలను గుర్తించి చమురు, గ్యాస్‌ రంగంలో 2002లో అడుగుపెట్టాం. రూ.1,50,000 కోట్లకుపైగా పెట్టుబడులను కేజీ డి–6 అసెట్స్‌పై పెట్టాం. భవిష్యత్తులో దేశ సహజవాయువు ఉత్పత్తిలో 30% కేజీ డి–6 నుంచే వస్తుంది. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఎంత కీలకమో చెప్పేందుకు ఇదే నిదర్శనం.

జియో సేవలకు సంబంధించి రాష్ట్రంలో టెలికాం విస్తరణ కోసం రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టాం. ఆంధ్రప్రదేశ్‌ జనాభాలో 98 శాతం 4జీ నెట్‌వర్క్‌ కవర్‌ చేసింది. ఇప్పుడు ట్రూ 5జీ సేవలను 2023 చివరి నాటికల్లా మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తాం. 5జీ రాకతో రాష్ట్రంలో డిజిటల్‌ విప్లవం అన్ని రంగాల్లో వృద్ధికి దోహదం చేస్తుంది. దీని ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి. 

► ఆంధ్రప్రదేశ్‌లో పుష్కలంగా సారవంతమైన భూములు, సహజ వనరులు, నైపుణ్యం, విశిష్ట సంస్కృతి ఉన్నాయి. విశాఖలో అందమైన బీచ్‌లున్నాయి. అధిక ఆదాయాన్ని అందించే కృష్ణా, గోదావరి నదుల మధ్య మంచి భూములున్నాయి. విజయనగరం సామ్రాజ్యం నుంచి తిరుమల వరకు ఎంతో చారిత్రక ప్రదేశాలున్నాయి. ఇవన్నీ వినియోగించుకుంటూ ఆధునిక కాలంలో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తోంది.

ఇన్‌ఫ్రా, ఫార్మా రంగంలో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికవేత్తలు గణనీయమైన శక్తి కలిగి ఉన్నారు. అంతర్జాతీయంగా పేరొందిన సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు, వృత్తి నిపుణులు పలువురు ఏపీకి చెందిన వారే. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో మంచి నైపుణ్యంతో వివిధ నాయకత్వ హోదాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నారు.

► రిలయన్స్‌ రిటైల్‌ ద్వారా భారీగా విస్తరించాం. రాష్ట్రంలో 1.20 లక్షల మంది కిరాణా వ్యాపా­రులతో ఒప్పందం చేసుకున్నాం. 6,000 గ్రామాల్లో రిలయన్స్‌ రిటైల్‌ సేవలను అందిస్తోంది. రాష్ట్రంలో 20,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధితోపాటు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాం. రైతులు, హస్తకళాకారుల ఉత్పత్తులను విక్రయిస్తూ నేరుగా 50,000 కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తున్నాం. రిలయన్స్‌ ఫౌండేషన్‌ విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో కృషి చేస్తోంది.

గ్రామీణ సామాజిక కేంద్రాల్లో రిలయన్స్‌ భాగస్వామి కానుంది. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలతో ఇదే విధమైన బంధాన్ని కొనసాగిస్తామని హామీ ఇస్తున్నా. రాష్ట్ర వృద్ధి రేటులో రిలయన్స్‌ భాగస్వామిగా ఉంటుంది. మాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ప్రోత్సహి­స్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, అధికారులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఈ సదస్సు విజయవంతమై రాష్ట్రాభివృద్ధిలో నూతన అధ్యాయాన్ని సృష్టించాలని కోరుకుంటున్నా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement