తమిళ ముల్లె.. అరవ పల్లె.. ‘నందలూరు.. రొంబవూరు’ | Nandalur Annamayya District People Of Tamil Migrants Dravidian Culture | Sakshi
Sakshi News home page

తమిళ ముల్లె.. అరవ పల్లె.. ‘నందలూరు.. రొంబవూరు’

Published Mon, Aug 1 2022 11:04 AM | Last Updated on Mon, Aug 1 2022 4:20 PM

Nandalur Annamayya District People Of Tamil Migrants Dravidian Culture - Sakshi

నందలూరు రైల్వేస్టేషన్‌ అత్యంత సమీపంలోని అరవపల్లె ప్రదేశం

రాజంపేట:  దేశంలోనే అతిపెద్ద రవాణా సంస్థ భారతీయరైల్వే. అటువంటి రైల్వేతో అనేక ప్రాంతాలకు గుర్తింపు వచ్చింది. అలాంటివాటిలో అన్నమయ్య జిల్లా నందలూరు ఒకటి. అందునా.. ఇక్కడ ఉన్న అరవపల్లె.. ప్రత్యేక గుర్తింపు పొందింది.  దశాబ్దాల క్రితం తమిళనాడు నుంచి వచ్చిన అనేకమందికి ఈ ప్రాంతం నిలయమైంది. ఆవాసాల ఏర్పాటుతో మొదలై క్రమంగా పెద్దగ్రామంగా రూపుదిద్దుకుంది. కాలానుగుణంగా మారిన పరిస్థితుల్లో కూడా తన ఉనికిని నిలుపుకుంది. ఇది ద్రవిడ జీవన సంస్కృతికి పట్టం కడుతోంది. అమ్మ తల్లి ఆరాధన ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఆధునికతను, అభివృద్ధిని సాధించినప్పటికీ ఆత్మను మాత్రం వదులుకోనంటోంది. 

రైల్వే కేంద్రం ఏర్పాటుతో.. 
నందలూరు రైల్వే కేంద్రం ఒకప్పుడు సదరన్‌ రైల్వేలో ఉండేది. ఇక్కడ స్టీమ్‌ ఇంజన్‌ రైల్వే లోకో షెడ్‌ కూడా ఉండేది. ముంబాయి–చెన్నై రైలుమార్గం ఏర్పాటులో భాగంగా స్టీమ్‌ రైలింజన్లను నడిపేందుకు నందలూరును కేంద్రంగా బ్రిటిషు రైల్వేపాలకులు ఎంచుకున్నారు. చెయ్యేరు నది నీటి నాణ్యత స్టీమ్‌ ఇంజన్ల నిర్వహణకు ఉపయోగపడుతుందనేది ప్రధాన కారణం.

గుంతకల్‌ రైల్వే జంక్షన్‌ నుంచి తమిళనాడులోని చెన్నై వరకు నడిచే రైళ్లన్నింటికీ నందలూరులో ఇంజన్‌ మార్పిడి జరిగేది. సిబ్బంది కూడా అటూ, ఇటూ మారేవారు. ఈ నేపథ్యంలోనే రైల్వేపరంగా నందలూరుకు గుంతకల్‌ రైల్వేడివిజన్‌లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక్కడి నుంచి నేరుగా మద్రాసుకు ప్యాసింజర్‌ రైలు కూడా నడిచేది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి నందలూరుకు ఉద్యోగ, ఉపాధి పనుల నిమిత్తం అనేకమంది వచ్చారు. అయితే వీరిలో అగ్రభాగం తమిళులదే.

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, అరకోణం, పెరంబూరు, తిరుత్తిణి తదితర ప్రాంతాలకు చెందిన వారు వివిధ రకాలలో అధికారులు, ఉద్యోగులు, కార్మికులుగా పనిచేసేందుకు నందలూరు రైల్వే కేంద్రానికి తరలివచ్చారు. వీరిని స్థానికులు అరవోళ్లు అని పిలిచేవారు. ఈ క్రమంలో నందలూరు రైల్వేస్టేషన్‌కు సమీపంలో వారు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. క్రమేణా అది అరవపల్లె పేరిట గ్రామంగా మారింది. ప్రస్తుతం నాగిరెడ్డిపల్లె అర్బన్‌ పరిధిలో ఈ పల్లె ఉంది. తొమ్మిది వార్డులకు విస్తరించింది. 


నందలూరు రైల్వేస్టేషన్‌ 

జోన్‌ మారడంతో.. 
1977లో సదరన్‌ రైల్వే నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి నందలూరు మారింది. ఫలితంగా వందలాది మంది తమిళనాడుకు చెందిన వారు చెన్నై సెంట్రల్‌తో పాటు ఇతర ప్రాంతాలకు బదిలీ చేసుకొని వెళ్లిపోయారు. కొందరు నందలూరు నీళ్లు, వాతావరణం, స్థానికుల మంచితనంతో ఇక్కడే ఉండిపోయారు. చెన్నై, కంచి, సేలం, అరక్కోణం, మధురై తదితర ప్రాంతాలకు చెందినవారు పెద్దసంఖ్యలో అరవపల్లెలోనే నివాసముండేవారు. కాలక్రమేణా 1000 తమిళ కుటుంబాలున్న గ్రామంలో ఆ సంఖ్య ఇపుడు 30కి చేరింది. ఈ పల్లెలో తమిళులతో పాటు ఇపుడు ఇతరులు కూడా ఉంటున్నారు.  కాగా, బదిలీలపై ఇక్కడి నుంచి తమ రాష్ట్రాలకు వెళుతూ వెళుతూ తమిళనాడువాసులు ‘నందలూరు.. రొంబవూరు’ అని సర్టిఫికెట్‌ ఇచ్చారు.  

ఆరాధ్యదైవం..ముత్తుమారెమ్మ  
తమిళనాడు ప్రాంతంలో ముత్తుమారెమ్మను ఆరాధ్యదైవంగా కొలుచుకుంటారు. తమ సంప్రదాయంలో భాగంగా అరవపల్లెలో కూడా వారు ముత్తుమారెమ్మ గుడి నిర్మించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారి ఆలయంగా కొలవబడుతోంది. ఈ గుడి  మొదలియార్‌ కుటుంబీకుల ఆధ్వర్యంలో నడుస్తోంది. యేటా జాతర కూడా నిర్వహిస్తుంటారు. 

రైల్వేకార్మికులతో ఒకప్పుడు కళకళ 
రైల్వేస్టీమ్‌ ఇంజన్‌ లోకోషెడ్‌ ఏర్పడినప్పటి నుంచి రైల్వేకార్మికులతో అరవపల్లె ఒకప్పుడు కళకళలాడేది. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు.  పాల్‌ఘాట్‌ నుంచి వచ్చిన  మా పూర్వీకులు 1955లో ఏర్పాటుచేసిన శ్రీ లక్ష్మీవిలాస్‌ హోటల్‌ ఎంతో ఆదరణ పొందింది. అప్పట్లో రైల్వే స్టాఫ్‌లో తమిళులు అధికంగా ఉండేవారు. ముత్తుమారెమ్మ ఆలయం అభివృద్ధికి నా తండ్రి నారాయణస్వామి అయ్యర్‌ తన వంతు కృషిచేశారు.   
–బాలసుబ్రమణ్యంస్వామి,  శ్రీలక్ష్మీవిలాస్, అరవపల్లె  

నందలూరుతో విడదీయరాని అనుబంధం 
సదరన్‌ రైల్వే జోన్‌ వల్ల తమిళులతో నందలూరు రైల్వేకేంద్రానికి విడదీయ రాని అనుబంధం ఏర్పడింది. తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ విధులు నిర్వహించే వందలాది కార్మికుల కుటుంబాలు ఉండేవి. 1976లో నందలూరు కార్యాలయంలో పనిచేసేటప్పుడు విధుల నిర్వహణకు సంబంధించి సదరన్‌ రైల్వే జోనల్‌ కేంద్రమైన మద్రాసు(చెన్నై)కు వెళ్లేవారం.  రైల్వే జోన్‌ మార్పిడిలో  చెన్నైకు వెళ్లకుండా చాలా మంది మంది తమిళ కుటుంబీకులు నందలూరులో కొనసాగుతున్నారు.
–ఆనంద్‌కుమార్,  రిటైర్డ్‌ ఎస్‌ఎంఆర్, న్యాయవాది, నాగిరెడ్డిపల్లె 

పూర్వీకుల నుంచి ముత్తుమారెమ్మ కోవెల 
మా పూర్వీకుల నుంచి ముత్తుమారెమ్మ కోవెల ఏర్పాటైంది. అప్పటి నుంచి గుడి నిర్వహణ చేపడుతూ వస్తున్నాం. నందలూరు రైల్వేస్టేషన్‌ సమీప ప్రాంతంలోనే మా పల్లె ఉంది. రైల్వేతోనే జనజీవనం ముడిపడింది. అది అలాగే కొనసాగింది.  
–వెంకటరమణ మొదలియార్, ధర్మకర్త, ముత్తుమారెమ్మకోవెల, అరవపల్లె 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement