ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: పర్యావరణ హితమైన నానో యూరియా వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలని ప్రభుత్వం సంకల్పించింది. రానున్న ఖరీఫ్‌లో ఈ యూరియా వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించడంతో పాటు వారికి మరింత అందుబాటులోకి ఉంచేలా ప్రణాళిక సిద్ధం చేసింది. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) నానో టెక్నాలజీ ద్వారా లిక్విడ్ రూపంలో ఈ నానో యూరియాను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
500 మిల్లీ లీటర్ల బాటిల్‌లో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాకు సమానం. బస్తా యూరియా మార్కెట్‌లో రూ.266.50 ఉండగా, నానో యూరియా బాటిల్ కేవలం రూ.240కే అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అమ్మకాలకు శ్రీకారం చుట్టగా, 20వేల మంది రైతులు 34,128 బాటిళ్లు (17వేల లీటర్లు) యూరియాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత రబీలో సుమారు లక్ష మందికి పైగా 5,46,012 బాటిళ్లు (2.73 లక్షల లీటర్లు) కొనుగోలు చేశారు.
కొరత లేకుండా నిల్వలు..
ముందస్తు ఖరీఫ్ కోసం ఏర్పాట్లు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం సీజన్‌లో రైతులకు ఏ దశలోనూ ఎరువుల కొరత రానీయకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఖరీఫ్‌లో 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటికే 6.19లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేసింది. సాంప్రదాయ ఎరువుల వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయంగా నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలంటూ సీఎం వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు 2022–23 సీజన్ కోసం 16లక్షల బాటిళ్ల (8లక్షల లీటర్లు) ఇఫ్కో ఏపీకి కేటాయించింది.
వీటిలో కనీసం 10లక్షల బాటిళ్లు (5 లక్షల లీటర్లు) ఖరీఫ్‌లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది. వీటిలో కనీసం 25 శాతం ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. నానో యూరియా వినియోగంపై రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాగా నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ, జింక్, కాపర్ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ట్రయిల్ రన్‌లో ఉన్న ఈ ఉత్పత్తులను ఖరీఫ్–2023 సీజన్ నుంచి మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కావాల్సినంత నిల్వలు
ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏపీలో నానో యూరియా వినియోగం పెరుగుతోంది. రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రానున్న ఖరీఫ్ సీజన్ కోసం 8లక్షల లీటర్ల నానో యూరియా బాటిళ్లను ఏపీకి కేటాయించాం. అవసరమైతే కేటాయింపులు మరింత పెంచేందుకు ఇఫ్కో సిద్ధంగా ఉంది.
– శ్రీధర్‌రెడ్డి, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో
Comments
Please login to add a commentAdd a comment