తుమ్మపూడి గ్రామంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ నారా లోకేశ్
కొంచెం సిగ్గు–లజ్జ... కొంచెం బుద్ధీ–బుర్రా.. ఇంకొంచెం నిజాయితీ కావాలిప్పుడు తెలుగుదేశం పార్టీకి, దాని యువరాజు లోకేశానికి. ఎందుకంటే మద్యం తాగి ఉచ్ఛం నీచం మరిచిపోయి తన కార్యకర్త చేసిన ఘోరానికి.. ప్రభుత్వాన్ని నిలదీసి రచ్చ చేయాలని చూసిన చినబాబు దిగజారుడుతనం ఎవరెస్టును దాటేసింది మరి! పూటుగా తాగిన తెలుగు తమ్ముడు కొర్రపాటి సతీష్ చౌదరి... తనతో అక్రమ సంబంధం సాగిస్తున్న మహిళను తన స్నేహితుడికి అప్పగించేశాడు.
ఆమె ఎదురుతిరిగితే... ఆ స్నేహితుడు చీరకొంగుతో గొంతు బిగించేశాడు. ఆమె మరణించింది. పోలీసులు తేల్చిన వివరాల మేరకు... ఇంతవరకూ ఇది క్రైమ్ స్టోరీయే!. కానీ దీన్ని ప్రభుత్వానికి ముడిపెడుతూ... సామూహిక అత్యాచారం జరిగిందనే ఆరోపణలతో పొలిటికల్ డ్రామా చేయబోయిన నారా లోకేశ్‌ని ఏమనుకోవాలి? తన కార్యకర్త దురాగతాన్ని... తన మీడియా బలంతో ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించబోయిన చినబాబును ఏమనాలి? ఎక్కడ ఏం జరిగినా నిజానిజాలతో సంబంధం లేకుండా రాజకీయమే లక్ష్యంగా చెలరేగిపోతున్న తండ్రీకొడుకుల్ని ఏం చేయాలి? ఏం చేయాలన్నది జనానికి తెలుసు. కాకపోతే ఒక్కటి నిజం! తండ్రికి తగ్గ కొడుకే లోకేశ్!!
చదవండి: మహిళలకు సంబంధించిన విషయాల్లో రాజకీయం సరికాదు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: వివాహేతర సంబంధంతో ఓ మహిళ చావుకు టీడీపీ కార్యకర్త ఒకడు కారకుడు కాగా.. నారా లోకేశ్ తమ పార్టీ క్యాడర్‌తో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు దండయాత్ర తరహాలో రావడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. టీడీపీ కార్యకర్త, నారా లోకేశ్ యూత్ టీమ్ సభ్యుడు కొర్రపాటి వెంకటసాయి సతీష్ చౌదరి అఘాయిత్యం వల్లే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన వివాహిత వీరంకి తిరుపతమ్మ బుధవారం లైంగిక దాడికి బలైనట్లు స్పష్టమైంది. టీడీపీ కార్యకర్త కొర్రపాటి వెంకట సతీష్ చౌదరి తన కంటే 11 ఏళ్లు పెద్దదైన అదే గ్రామానికి చెందిన బాధితురాలితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. తన స్నేహితుడు శివసత్య సాయిరామ్ కోరికను కూడా తీర్చాలని ఆమెను వేధించాడు. అందుకు అంగీకరించకపోవడంతో శివసత్యసాయిరామ్ ఆమెను దారుణంగా హత్యచేశాడు. ఈ కేసులో నిందితులను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం 12 గంటల వ్యవధిలోనే పట్టుకుని గురువారం కోర్టులో హాజరు పరిచింది. వివాహేతర సంబంధంతో జరిగిన ఈ హత్యను సామూహిక లైంగికదాడి అంటూ టీడీపీ నేతలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. ఆ వెంటనే నారా లోకేశ్ బాధితురాలి కుటుంబానికి పరామర్శ పేరుతో మరోసారి శవ రాజకీయానికి తెర తీశారు.
మీరే చంపేసి.. మీరే పరామర్శలా?
తెనాలిలో మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం తుమ్మపూడికి తరలిస్తుండగా లోకేశ్ వచ్చేవరకు వెళ్లనివ్వబోమంటూ మాజీ మంత్రి నక్కా ఆనందబాబుతోపాటు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. మార్చురీ గేటు ముందు బైఠాయించారు. స్వయంగా మృతురాలి భర్త, కుటుంబ సభ్యులు ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని, తమను వెళ్లనివ్వాలని అభ్యర్థించినా ఆలకించలేదు. తోపులాట అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని అంబులెన్సును తుమ్మపూడికి పంపించారు.
అనంతరం లోకేశ్ తన కాన్వాయ్‌తో సుమారు 100 కార్లతో బయట నుంచి వచ్చిన కార్యకర్తలతో తుమ్మపూడి చేరుకుని విలేకరులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఆమెను హత్య చేసిందీ టీడీపీ కార్యకర్తేనని స్పష్టం చేశారు. ‘‘మీరే హత్య చేసి ...మీరే పరామర్శకు వస్తారా?...’’ అంటూ నిలదీశారు. దీంతో కంగు తిన్న లోకేష్ బాధితురాలి ఇంటి వద్దే మీడియాతో మాట్లాడేందుకు యత్నించారు. అంత్యక్రియల సమయంలో రాజకీయాలు వద్దని గ్రామస్తులు మరోసారి వారించడంతో టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. టీడీపీ కార్యకర్త ఒకరు పెద్ద రాయిని గ్రామస్తులపైకి రువ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. రాళ్ల దాడిలో హెడ్‌కానిస్టేబుల్ మాధవ తలకు గాయమైంది. అప్పటికే అక్కడికి చేరుకున్న జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సూచనల మేరకు పోలీసులు సంయమనం పాటించడంతో బాధితురాలి అంత్యక్రియలు పూర్తయ్యాయి.
అండగా నిలిచిన ప్రభుత్వం
హత్యకు గురైన బాధితురాలి కుటుంబాన్ని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి పరామర్శించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీ వద్ద మృతదేహానికి నివాళులర్పించారు.
నిందితులకు ఉరిశిక్ష వేయాలి: నారా లోకేశ్
రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. దిశ చట్టం ద్వారా హత్య కేసు నిందితులకు 21 రోజుల లోపు ఉరిశిక్ష విధించాలి. నాపై ఇప్పటికి 12 కేసులు పెట్టారు. ఇంకా కేసులు పెట్టినా భయపడేది లేదు. మృతురాలి కుటుంబానికి పార్టీ ద్వారా రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా అందజేస్తాం. పిల్లలను చదివిస్తాం.
నిన్న నాన్న.. నేడు చినబాబు
ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేస్తుందా? అనే రీతిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ వ్యవహరిస్తున్నారు. బాధిత కుటుంబాలకు పరామర్శ పేరుతో దండయాత్రను తలపించే రీతిలో బీభత్సం సృష్టిస్తున్నారు. ఇటీవల విజయవాడలో అత్యాచార బాధితురాలికి పరామర్శ పేరిట చంద్రబాబు ప్రభుత్వ ఆసుపత్రిలో వందల మందితో రచ్చ చేశారు. తాజాగా లోకేశ్ తుమ్మపూడికి వందలాది వాహనాలతో ర్యాలీగా వచ్చి తీవ్ర ఉద్రిక్తతలు రేకెత్తించారు. గతేడాది ఆగస్టులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య అనంతరం లోకేశ్ వచ్చే వరకూ మృతదేహాన్ని తరలించకుండా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద టీడీపీ కార్యకర్తలు అడ్డుపడిన సంగతి తెలిసిందే. ఈసారి తెనాలి అందుకు వేదికగా మారింది. బాధితురాలి మృతదేహాన్ని లోకేశ్ వచ్చి పరామర్శించే వరకూ హాస్పిటల్ నుంచి తరలించడానికి వీలు లేదంటూ టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. ముఖ్యమంత్రిని, స్థానిక ఎమ్మెల్యేని, ప్రభుత్వాన్ని అసభ్య పదజాలంతో దూషించారు.
బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మంత్రి నాగార్జున, ఎమ్మెల్యేలు సుచరిత, ఆర్కే
గూండాగిరిని ప్రోత్సహిస్తున్న లోకేశ్
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్‌కే
ప్రశాంతంగా ఉండే మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ గూండాగిరిని ప్రోత్సహిస్తున్నారు. పక్క నియోజకవర్గాలనుంచి జెండాలు తగిలించుకుని 80 కార్లతో దండయాత్ర తరహాలో వచ్చారు. నేను ఎమ్మెల్యే అయిన ఎనిమిది సంవత్సరాల్లో ఇటువంటి సంఘటనలు జరగలేదు. తెలుగుదేశం కార్యకర్తలు రాళ్లు, కొబ్బరిబోండాలు విసిరి
పోలీసులను గాయపరిచారు.
హత్య కిరాతకం
వాసిరెడ్డి పద్మ, మహిళా కమిషన్ చైర్‌పర్సన్
ఈ హత్య కిరాతకం. మృతదేహాన్ని తరలించే సందర్భంలో లోకేశ్ వస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం దారుణం.
శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ నాగార్జున
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తుమ్మపూడిలో బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షలు, నివేశన స్థలంతో పాటు ఇల్లు కట్టించి ఇస్తాం. చిలుమూరు ఘటనలోనూ బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు, నివేశన స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టించి ఇస్తాం. ప్రతిపక్షాల చర్యలు శవాలపై పేలాలు ఏరుకుంటున్న మాదిరిగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment