
మాట్లాడుతున్న నారాయణమూర్తి
అగనంపూడి (గాజువాక): కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. రాజ్యాంగేతర శక్తిగా మారి ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన జైల్ భరో కార్యక్రమం కూర్మన్నపాలెం కూడలి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ .. రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడాది నుంచి ఉద్యమాలు చేపడుతున్నా కేంద్రం స్పందించకపోవడం తగదన్నారు.
ఇప్పటికే విద్య, వైద్య, రక్షణ, బ్యాంకింగ్ రంగాలను ప్రైవేటీకరించిన కేంద్రం కొరియన్ సంస్థ పోస్కోకు విశాఖ స్టీల్‌ను అమ్మేస్తే భవిష్యత్‌లో తెలుగు ప్రజలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మృగ్యం అవుతాయన్నారు. విశాఖ జోలికి రావద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోస్కో యాజమాన్య ప్రతినిధులకు చెప్పారని, అవసరమైతే కడప స్టీల్‌ప్లాంట్ అప్పగిస్తామని చెప్పినా అవసరం లేదని వారు తేల్చి చెప్పేశారన్నారు. కేవలం విశాఖ ఉక్కు భూములు, ఇక్కడ సహజ నౌకాశ్రయం ద్వారా దేశ సంపదను తరలించిపోడానికి పన్నిన పన్నాగమన్నారు. దీనిని ప్రజలు గ్రహించి మేల్కొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు సీహెచ్.నరసింగరావు, ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్, వై.మస్తానప్ప, డి.ఆదినారాయణ పాల్గొన్నారు.
239 మంది కార్మికుల అరెస్ట్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో గాజువాకలో 239 మంది కార్మికులు, కార్మిక సంఘాల నేతలు స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద, తగరపువలసలో కూడా జైల్‌భరో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పలువురు స్వచ్ఛందంగా అరెస్టయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment