కదిరి: నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుంది.. కదిరిలోని నారాయణ పాఠశాల యాజమాన్యం తీరు. పిల్లల ప్రాణాలు పణంగా పెడుతూ ఓ పెట్రోల్ బంకు పక్కన ఏర్పాటు చేసిన ఈ పాఠశాలను తొలగించాలని ఇప్పటికి అనేక సార్లు అధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు స్వయంగా హెచ్చరించినా తీరు మాత్రం మారలేదు. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకూ తరగతులు నిర్వహిస్తున్నారు. సుమారు 3 వేల మందికి పైగా చిన్నారులు చదువుతున్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే జరిగే నష్టం ఎవరూ ఊహించలేం.
మమ్మల్నేం చేయలేరు..!
- పెట్రోలు బంక్ పక్కనే నిర్వహిస్తున్న నారాయణ స్కూల్‌ను మూసేయాలంటూ పలు విద్యార్థి సంఘాలతో పాటు కుల సంఘాల నాయకులు ఇప్పటికే అనేక సార్లు ధర్నాలు చేపట్టారు. టీడీపీ హయాంలో ఎన్నో సార్లు నిరసనలకు దిగారు. కానీ అప్పటి ప్రభుత్వంలో అన్నీ తానై చక్రం తిప్పిన నారాయణ అవేమీ పట్టించుకోలేదు.
- కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పట్లో విద్యాశాఖా మంత్రిగా ఉన్న సాకే శైలజానాథ్ స్వయంగా పాఠశాలను సందర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా పెట్రోలు బంక్ పక్కనే నారాయణ స్కూల్ ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. వెంటనే పాఠశాలను మూసివేయాలని కూడా ఆదేశించారు. కానీ ఆ తర్వాత చర్యలు మాత్రం శూన్యం.
- పాఠశాలను మూసివేయాలంటూ గతంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నాగన్నతో పాటు మరికొందరు స్థానిక ఎంఈఓ కార్యాలయం ముందు నెలల తరబడి రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. కానీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
- నోటీసులైతే లెక్కలేనన్ని సార్లు అధికారులు పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. అయినా, వారు పాఠశాలను మూసివేయనూ లేదు. వేరే చోటుకు తరలించనూ లేదు.
అడ్మిషన్లూ నిబంధనలకు విరుద్ధంగానే..
2022–23 విద్యాసంవత్సరం మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. అయితే వేసవి సెలవుల్లోనే ఆ పాఠశాలలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇలా అడుగడుగునా నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న నారాయణ పాఠశాల యాజమాన్యంపై కలెక్టర్ బసంత్‌కుమార్ అయినా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
దీక్ష చేపడతాం
నారాయణ స్కూల్‌ను సీజ్ చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నాం. ఇప్పటి దాకా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మా మాటలు అధికారులకు చెవిటోని ముందు శంఖం ఊదినట్టు ఉన్నాయి. ఈసారి నిర్వహిస్తే పాఠశాల ముందే దీక్ష చేపడతాం.
– రాజేంద్ర ప్రసాద్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
అధికారులే మార్పించాలి
గ్యాస్ సిలిండర్ పేలితేనే పెద్ద మొత్తంలో ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగిన సంఘటనలున్నాయి. పెట్రోల్ బంక్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే తీవ్రత ఇంకెంత ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. అందుకే మా బాబును అక్కడ చేర్పించలేదు. అధికారులు ఈసారైనా ఆ బడిని మార్చేసేలా చర్యలు తీసుకోవాలి.
– యాదవేంద్ర యాదవ్, కదిరి
పాఠశాల నిర్వహిస్తే సీజ్
పెట్రోలు బంక్ పక్కన నారాయణ పాఠశాల నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం. ఆ పాఠశాల నిర్వాహకులకు దీనిపై నోటీసులు కూడా ఇచ్చాం. ఈసారి అక్కడే పాఠశాల నిర్వహిస్తే సీజ్ చేయడం ఖాయం. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అక్కడ అడ్మిషన్ చేసే ముందు ఒకసారి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
– చెన్నకృష్ణ, ఎంఈఓ, కదిరి
(చదవండి: యువకుడి దారుణహత్య)
Comments
Please login to add a commentAdd a comment