జాతీయ చేనేత దినోత్సవం: ‘వైఎస్‌ను గుర్తుచేస్తున్న సీఎం జగన్‌’ | National Handloom Day 2021: Glory Of Handloom Industry In AP | Sakshi
Sakshi News home page

జాతీయ చేనేత దినోత్సవం: ‘వైఎస్‌ను గుర్తుచేస్తున్న సీఎం జగన్‌’

Published Sat, Aug 7 2021 7:53 AM | Last Updated on Sat, Aug 7 2021 8:39 AM

National Handloom Day 2021: Glory Of Handloom Industry In AP - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, అమరావతి: ‘మగ్గాలను పెట్టినాం.. నూలు నూలు ఒడికినాం.. మా నరాలనే దారాలుగా గుడ్డలెన్నో నేసినాం.. శ్రమ ఎవడిదిరో.. సిరి ఎవడిదిరో అని ఆక్రోశించిన నేతన్నల బతుకు చిత్రం ఇప్పుడు మెరుగుపడుతోంది. నవరత్నాలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సాయం చేనేతపై ఆధారపడిన వేలాది కుటుంబాలకు ఉపాధి దక్కేలా చేసింది. కరోనా కష్టకాలంలోనూ ‘నేతన్న నేస్తం’ ఆదుకుంది.  చేనేత రంగం.. ఇప్పుడు సంక్షేమ రంగులు అద్దుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగం బతికి బట్టకడుతున్న వైనం పూర్వాపరాలపై ‘జాతీయ చేనేత దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం.

సుదీర్ఘ చరిత్ర గల చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రంగులు అద్దుతోంది. వైఎస్సార్‌ నేతన్న నేస్తం ద్వారా మగ్గం కలిగివున్న 81,703 మందికి రూ.383.79 కోట్లు అందించి జీవనోపాధి కల్పించింది. ఇప్పటికే రెండు పర్యాయాలు నేతన్న నేస్తం అందించిన ప్రభుత్వం మూడో పర్యాయం కూడా ఒక్కొక్కరికీ రూ. 24 వేల చొప్పున  సాయమందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా సమయంలో చేనేత సొసైటీల్లో పేరుకుపోయిన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలని సంకల్పించింది. ఆర్గానిక్‌ వస్త్రాల తయారీ, కొత్త కొత్త డిజైన్లు వంటి అనేక వినూత్న ప్రయోగాలతో చేనేత రంగానికి మరింత ఊతమిచ్చేలా ఆప్కో ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  

( ఫైల్‌ ఫోటో )

చేనేత ఉపాధికి చేయూత..
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగం ఒక కులానికి పరిమితం కాకుండా అనేక సామాజికవర్గాలకు ఉపాధి చూపుతోంది. పద్మశాలి, దేవంగ, కర్ణిభక్తులతోపాటు దాదాపు 18 ఉపకులాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. నాల్గవ అఖిల భారత చేనేత లెక్కలు 2019–2020 ప్రకారం చేనేత, నేత, అనుంబంధ కార్యకలాపాల్లో దేశంలో 31.45 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో 90,775 చేనేత కుటుంబాలు ఉన్నట్టు అంచనా. రాష్ట్రంలోని వెంకటగిరి, ధర్మవరం, చీరాల, మంగళగిరి, పెడన, మచిలీపట్నం, ఉప్పాడ, రాజాం తదితర అనేక ప్రాంతాల్లో చేనేత రంగం రారాజుగా గుర్తింపు పొందింది. పట్టుచీరలు, జరీ చీరలు, కాటన్‌ చీరలు, కలంకారీ, పొందూరు ధోవతులు, పుత్తూరు లుంగీలు అంటూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో చేనేత వస్త్రం ప్రసిద్ధి పొందాయి.

స్వదేశీ ఉద్యమ స్ఫూర్తి..
స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుకు తెచ్చేలా ప్రతియేటా ఆగస్టు7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.  ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాల్లో 95 శాతం మన దేశానివే. చేనేత వస్త్రాలకు కొంతకాలంగా పవర్‌ లూమ్స్, షటిల్‌ మగ్గాలు, స్పిన్నింగ్‌ మిల్లులు, ప్రాసెసింగ్‌ మిల్లులతో పోటీ ఎదురవుతుండగా.. నేడు కంప్యూటర్‌ సాయంతో ఎయిర్‌జెట్‌ వంటి మగ్గాల నుంచి పోటీ వచ్చిపడింది. ఇటువంటి పరిస్థితిలో చేనేతను ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి.


( ఫైల్‌ ఫోటో )

హామీలు మరచిన బాబు.. ‘నేతన్న నేస్తం’ అందించిన సీఎం జగన్‌ 
రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకుంటానంటూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత మరిచిపోయారని ఇప్పటికీ నేతన్నలు గుర్తు చేసుకుంటున్నారు. కాగా.. 2019లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘నేతన్న నేస్తం’ తదితర  పథకాల ద్వారా చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దుతున్నారని నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

కరోనా కష్టకాలంలో ఉపాధి చూపారు
నేతన్న నేస్తం ద్వారా రూ.24వేలు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా కష్టకాలంలో మా కుటుంబానికి ఉపాధి చూపారు. మొత్తంతో ముడి సరుకులు(మెటీరియల్‌) కొనుక్కున్నాను. పెట్టుబడి పెట్టిన రూ.24 వేలు రాగా, రోజువారీ కూలీ డబ్బులు(ఉపాధి) గిట్టుబాటు కాగా, అదనంగా మరో రూ.3వేల లాభం వచ్చింది.  
–జంజనం లక్ష్మీ, మంగళగిరి, గుంటూరు జిల్లా

మగ్గాన్ని ఆధునీకరించుకున్నాను
పాత మగ్గంతో ఎన్నో ఏళ్లుగా అవస్థలు పడ్డాను.  ప్రభుత్వం ఇచ్చిన రూ.24 వేలకు తోడు.. నేను కొంత సొమ్ము కలిపి లిఫ్టింగ్‌ మిషన్, జాకార్డ్‌ అమరికం ఏర్పాటు చేసుకున్నాను. దీని వల్ల నాకు నేత పని ఎంతో సులువు అయ్యింది. 2019 నుంచి మా జీవితాల్లో కొత్త కాంతి వచ్చింది. 
–జక్కుల వెంకట సుబ్బారావు, పెడన, కృష్ణా జిల్లా

జీవితాల్లో రంగులు నింపారు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేనేతకు ఎంతో ఊతమిచ్చారు. అచ్చం తండ్రి మాదిరిగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతన్నలను ఆదుకోవడంలో నిజంగానే నేస్తం అన్పించుకున్నారు. మహానేత వైఎస్‌ను గుర్తు చేస్తున్నారు. కళా విహీనంగా మారిన చేనేత బతుకుల్లో రంగులు నింపుతున్నారు. 
– ఊటుకూరి రంగారావు, పెడన, కృష్ణా జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement