ప్రకృతికే ప్రత్యేకం | Natural preparation for Visakha: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ప్రకృతికే ప్రత్యేకం

Published Fri, Jul 26 2024 6:00 AM | Last Updated on Fri, Jul 26 2024 6:00 AM

Natural preparation for Visakha: Andhra pradesh

వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యం ఎర్రమట్టి దిబ్బలు

విశాఖకు సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన వరం

18,500 ఏళ్ల క్రితం ఏర్పడినట్టు చెబుతున్న పురాతత్వ శాస్త్రవేత్తలు

దక్షిణాసియాలో మూడుచోట్ల మాత్రమే అరుదైన సంపద

సముద్రపు ఇసుకతో మట్టి, ఖనిజాలతో మిళితమై ఏర్పడిన దిబ్బలు

2014లో జాతీయ వారసత్వ ప్రదేశంగా ప్రకటించిన జాతీయ భూ విజ్ఞాన సర్వే సంస్థ

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నీలి సముద్రం సవ్వడి ఓవైపు.. పచ్చందాల ప్రకృతి మరోవైపు.. మధ్యలో సూరీడే కిందికి దిగి.. ఎర్రరంగు పులిమినట్టుంటే అరుదైన వారసత్వ సంపద ఎర్రమట్టి దిబ్బలు చూపరుల్ని కట్టిపడేస్తుంటాయి. ‘ఇందువదన కుందరదన.. మందగమన మధురవచన..’ అంటూ ఛాలెంజ్‌ చేసిన చిరంజీవికి సూపర్‌ హిట్‌ ఇచ్చింది ఈ దిబ్బలే. చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఇక్కడే సినిమా జీవితాన్ని మొదలు పెట్టిన కమల్‌హాసన్, రజనీకాంత్‌ చలనచిత్ర రంగంలో ‘మరోచరిత్ర’ సృష్టించారు.

సహజ సిద్ధమైన ప్రకృతికి ప్రతిరూపంగా.. విశాఖకు వచ్చే సందర్శకులకు వరంగా.. భీమిలిలో అందాల్ని ఎరుపెక్కించిన ఎర్రమట్టి దిబ్బలు నిజంగా అరుదైన సంపదే. దక్షిణాసియాలో కేవలం మూడంటే మూడు ప్రాంతాల్లోనే ఈ అద్భుతం కనువిందు చేస్తోంది. తొలుత ఇసుక కొండలుగా ఏర్పడి.. తర్వాత ఎర్రమట్టి దిబ్బలుగా రూపాంతరం చెందిన ఈ ప్రకృతి వరప్రసాదానికి జాతీయ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించింది.

ఇసుకే అయినా.. మట్టిదిబ్బలని..!
పూర్వకాలంలో వీటిని ఎర్ర ఇసుక కొండలుగానూ పిలిచేవారు. పాయలుగా ఏర్పడిన తర్వాత.. ఎర్రమట్టి దిబ్బలుగా పిలుస్తున్నారు. వాస్తవానికి భౌగోళిక పరంగా ఇది ఇసుక నుంచి రాయి ఏర్పడుతుంది. పొరలు పొరలుగా ఒకచోట చేరిన ఇసుక రేణువులే వేల సంవత్సరాల తర్వాత రాయిగా మారతాయి. అలా ఒకచోట పేరుకు­పోయిన ఇసుక క్రమంగా గట్టిపడటం మొదల­వు­తుంది. అది పూర్తి రాయిగా మారే క్రమంలో కాస్త మట్టిలా అనిపించే విధంగా మారుతుంది. ఇది ఇసుకే అయినా.. మట్టిలా గట్టిగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ దిబ్బ­ల్లోని ఇసుక, మట్టి ఎరుపు రంగులో ఉండటం వల్ల వీటిని ఎర్రమట్టి దిబ్బలుగా పిలవడం అలవాటైపోయింది.

జియో హెరిటేజ్‌ ప్రాంతంగా..
విశాఖపట్నం నుంచి భీమునిపట్నం వెళ్లే మార్గంలోని మట్టి దిబ్బలు 10 చదరపు కిలోమీటర్ల మేర విశాఖ–­భీమునిపట్నం మధ్య విస్తరించి ఉన్నాయి. ఇవి ఒకప్పుడు 40 మీటర్ల ఎత్తున ఉండేవి. జాతీయ భూవిజ్ఞాన సర్వే సంస్థ (జీఎస్‌ఐ) ఈ దిబ్బల ప్రదేశ రక్షణ, నిర్వహణ కోసం 2014లో జాతీయ వారసత్వ ప్రదేశం (జియో హెరిటేజ్‌ సైట్‌)గా ప్రకటించింది. అందరికీ అందుబాటులో ఉండటంతో పాటు ఎక్కువ అధ్యయనాలు, పరిశోధనలు చేసిన ప్రాంతాన్ని జియో హెరిటేజ్‌ సైట్‌గా గుర్తిస్తారు. 

ఈ నేపథ్యంలో తమిళనాడులోని 
టెరిశాండ్స్‌తో పోలిస్తే ఇక్కడి ఎర్రమట్టి దిబ్బలు అందరికీ అందుబాటులో ఉండటంతోపాటు అధ్యయనాలు, పరిశోధనలు జరగడంతో దీనికి ఈ గుర్తింపు వచ్చింది. మొత్తం 1,195 ఎకరాల్లో 262.92 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతాన్ని జియో హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించారు. ఈ దిబ్బలను గమనించడం ద్వారా ఇక్కడి వాతావరణ పరిస్థితుల గురించి అధ్యయనం చేసేందుకు దోహదపడతాయని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఒక్కసారి వీటిని ధ్వంసం చేస్తే.. తిరిగి ఏర్పాటయ్యే అవకాశమే లేదు.

ఎలా ఏర్పడ్డాయంటే..!
⇒   ఎర్రమట్టి దిబ్బలు సుమారు 18,500 నుంచి 20,000 సంవత్సరాల కిందట ఏర్పడినట్టు భౌగోళిక చరిత్ర చెబుతోంది. 
⇒    కొన్ని వేల సంవత్సరాల క్రితం బంగాళాఖాతం ప్రస్తుత తీర రేఖ నుంచి కనీసం 
5 నుంచి 10 కి.మీ. వెనక్కి ఉండేది. 
⇒     తూర్పు కనుమలలో ఖొండలైట్‌ శిలలు విస్తరించి ఉన్నాయి. ఈ శిలల్లో గార్నేట్, క్వార్జ్, సిల్లిమనైట్, ఫెల్డ్‌స్పార్, ఇనుప ఖనిజాలు విస్తారంగా ఉంటాయి. 

⇒    భారీ వర్షాలు పడే సమయంలో ఈ కొండల నుంచి నీటి ప్రవాహాల ద్వారా కొట్టుకొచ్చిన మట్టి పదార్థాలు బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇలా వరద నీటితో పాటు తూర్పుకనుమల్లో ఉన్న ఖనిజాలు కొట్టుకొచ్చి సముద్ర తీరంలోకి ఇసుకతో కలిసిపోయి.. మిశ్రమంగా ఏర్పడి పేరుకున్నాయి. 
⇒      కొండల్లోని మట్టి, సముద్రపు ఇసుక, ఖొండ­లైట్‌ శిలల్లోని ఖనిజాలన్నీ కలిసి గట్టిదనాన్ని సంతరించుకోవడం వల్ల ఇవి ఏర్పడ్డాయి.
⇒   ఖనిజాల సమ్మేళనాలు ఆక్సీకరణం చెందడం వల్ల ఈ కొండలు ఎర్రగా మారిపోయాయి. పూ­ర్వ­ం వీటిని ఎర్ర ఇసుక కొండలుగా పిలిచే­వా­రు.

⇒      కాలక్రమేణా ఈ గుట్టల్లో పేరుకుపోయిన మిశ్రమ అవక్షేపాల్లో వదులుగా ఉండేచోట 
నీటి ప్రవాహాల తాకిడితో కొట్టుకుపోవడం వల్ల ఆ ప్రాంతంలో చిన్న చిన్న లోయలుగా రూపాంతరం చెందాయి. 
⇒      క్రమంగా భారీ వర్షాల సమయంలో దాదాపు 3 వేల సంవత్సరాల క్రితం వరకూ ఎర్రమట్టి దిబ్బల్లో నిరంతరం మార్పులు సంభవించాయి.

మూడుచోట్ల మాత్రమే..!
అరుదైన ఎర్రమట్టి దిబ్బలు దక్షిణాసియాలో కేవ­లం మూడు చోట్ల మాత్రమే ఉన్నాయి. విశాఖ­లోని భీమిలి వద్ద ఏర్పడిన వీటిని ఎర్రమట్టి దిబ్బలుగా పిలుస్తారు. 
⇒    తమిళనాడులోని తూటికూడి జిల్లాలో ఏర్పడిన దిబ్బలను టెరిశాండ్స్‌ పేరుతో పిలుస్తారు.
⇒   శ్రీలంకలోని విల్‌పట్టు నేషనల్‌ పార్కు సమీపంలో పాయింట్‌ కుర్దిమళై పేరుతో ఇవి విస్తరించి ఉన్నాయి.

⇒    శ్రీలంక, తమిళనాడులో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు జనావాసాలకు దూరంగా ఉంటాయి కాబట్టి.. వాటి వద్దకు వెళ్లేందుకు ఎవరూ ఆసక్తి చూపరు. 
⇒   విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు జనావాసాలకు ఆనుకుని ఉండటం వల్ల గుర్తింపు పొందాయి. తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలి వచ్చిన తర్వాత ప్రతి 5 సినిమాల్లో ఒక చిత్రానికి సంబంధించిన పాట/సీన్‌ కచ్చితంగా భీమిలి ఎర్రమట్టి దిబ్బల వద్ద చిత్రీకరించేవారు. 

⇒  ముఖ్యంగా చిరంజీవి నటించిన ఏ సినిమా అయినా ఎర్రమట్టి దిబ్బలవద్ద చిత్రీకరిస్తే.. సూపర్‌హిట్‌ అవ్వాల్సిందే అనే సెంటిమెంట్‌ కూడా ఉండటం గమనార్హం. మరోచరిత్ర, ఛాలెంజ్, అభిలాష, కలియుగ పాండవులు, ఎర్రమందారం, రావోయి చందమామ, అడవిదొంగ, చామంతి, మాతోపెట్టుకోకు, పరుగోపరుగు.. తాజాగా వరుణ్‌ సందేశ్‌ నటిస్తున్న మట్కా వరకూ ప్రతి సినిమాకు ఎర్రమట్టి దిబ్బలు షూటింగ్‌లకు కేరాఫ్‌గా మారింది. 
⇒  అంతేకాదు.. ఇవి మన పురావస్తు నాగరికతకు చిహ్నాలుగా ఉండటంతో పాటు కార్తీక మాసంలో ఇక్కడ వనభో­జ­నాలకు కూడా కేంద్రంగా మారింది.

ఎర్రమట్టి దిబ్బల్ని పరిరక్షించుకోవాలి
వాటర్‌ మేన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌
కొమ్మాది (విశాఖ): ప్రపంచంలోనే అరుదైన, జాతీయ భౌగోళిక వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరితోపాటు ప్రభుత్వానికి కూడా ఉందని వాటర్‌ మేన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ అన్నారు. ఆక్ర­మణకు గురవుతున్న ఎర్రమట్టి దిబ్బ­లను గురువారం ఆయన పరిశీలించారు. రాజేంద్ర­సింగ్‌ మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రాము­ఖ్యతను సంతరించుకున్న ఎర్రమట్టి దిబ్బ­లను విచ్చలవిడిగా తవ్వేస్తుంటే ప్రభుత్వం, అధికారులు ఏం చేస్తు­న్నారని ప్రశ్నించారు. వీటి పరిరక్షణ కోసం ఎంత­వరకైనా పోరాడతామన్నారు. సముద్ర నీటిని కూడా మంచినీటిగా మార్చే శక్తి ఈ ఎర్రమట్టి దిబ్బలకు ఉందని ఆయన గుర్తు చేశారు. ఆయన వెంట జలబిరాదరి జాతీయ కన్వీనర్‌ బి.సత్య­నారాయణ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement