ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల సమీక్షల్లో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: నూతన ఇసుక విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సమగ్ర సమాచారం, ఆలోచనలతో రావాలని సూచించారు. అక్రమాలు, అవినీతికి అవకాశం లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలిగించని కొత్త ఇసుక విధానాన్ని తీసుకువస్తామన్నారు. నూతన ఇసుక విధానం, దెబ్బతిన్న రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ఆయన మంగళవారం సచివాలయంలో ఆయా శాఖల మంత్రులు, అధికారులతో విడివిడిగా సమీక్షలు నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. ప్రస్తుతం స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉన్న ఇసుకను సరఫరా చేసేందుకు ఉన్న వెసులుబాటును చూడాలని సూచించారు.
గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అనేక సమస్యల్లో ఉన్నారని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. సమస్యల తీవ్రతను బట్టి తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దీర్ఘకాలికంగా ఎటువంటి ప్రణాళికలు అమలు చేయాలి అనే వాటిపై నిర్దిష్టమైన విధానంలో ముందుకెళ్లాలని సూచించారు.
దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలి..
రోడ్లపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దెబ్బతిన్న రోడ్లను పూర్తి స్థాయిలో బాగు చేయడంతోపాటు రహదారులపై గుంతలు పూడ్చడం, మరమ్మతులపై దృష్టిపెట్టాలన్నారు. ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయో నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి సాంకేతికంగా అందుబాటులోకి వచి్చన కొత్త విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు.
ప్రస్తుతం వర్షాలు పడుతున్నా వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై ప్రణాళికను రూపొందించాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ధరల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలనేదానిపై ప్రణాళికతో రావాలని ఆదేశించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 122 రైతు బజార్‌లు ఉన్నాయని అధికారులు చెప్పగా.. వాటి నిర్వహణ సరిగా లేక.. వాటి ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం నెరవేరడం లేదన్నారు. ఈ సమీక్షల్లో మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్‌రెడ్డి, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment