
ప్రసాదంపాడులోని సచివాలయాన్ని సందర్శిస్తున్న సంతోష్ మెహరా
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ రామవరప్పాడు: దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా, పారదర్శకమైన సేవలు అందించడం అభినందనీయమని జాతీయ మానవ హక్కుల కమిషన్ డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) సంతోష్ మెహరా అన్నారు. ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
తొలుత సంతోష్ మెహరాను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ బృందం ఎన్టీఆర్ జిల్లాలోని ప్రసాదంపాడు, గూడవల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాల్లోని సచివాలయాలను సోమవారం ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ సభ్యులు డాక్టర్ జి.శ్రీనివాసరావుతో కలసి సందర్శించారు. కలెక్టర్ ఢిల్లీరావు.. సంతోష్ మెహరాకు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు, సచివాలయ వ్యవస్థలో పని చేస్తున్న వివిధ శాఖల వారి పనితీరును వివరించారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను బృందానికి తెలిపారు.
చదవండి: (Somu Veerraju: ప్రధాని పర్యటనలో భారీ కుట్ర)
అవినీతికి, వివక్షకు తావు లేకుండా పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500కు పైగా సేవలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ వివరించారు. ఎన్నో గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే సమస్యలు పరిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు. సచివాలయ వ్వవస్థలో వలంటీర్ల వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుందని.. అర్హులైన ప్రతి లబ్ధిదారుని గడపకు వెళ్లి స్వయంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని వివరించారు.
దిశ యాప్ గరించి..
దిశ యాప్‌ను సంతోష్ మెహరా స్వయంగా పరిశీలించారు. దిశ యాప్ ఆయన ఉపయోగించగానే మంగళగిరిలోని దిశ కంట్రోల్ పోలీస్ స్టేషన్ సమాచారం అందుకుని స్పందించిన తీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో చేస్తున్న కృషి హర్షణీయమన్నారు. గ్రామ సచివాలయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంతోష్ మెహరా కోరారు. జెడ్పీ సీఈవో సూర్యప్రకాష్, డ్వామా పీడీ సునీత, డీపీవో కేపీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.