సాక్షి, కర్నూలు: అధిక ఆశ్వయుజ మాసం శుక్రవారం ముగిసింది. నేటి (శనివారం) నుంచి నిజ ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతోంది. దసరా నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలకు శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్–19తో ఇన్నాళ్లూ కళ తప్పిన కల్యాణ వేదికల్లో మళ్లీ సందడి కన్పించనుంది. ఈ నెల 18వ తేదీ, 21 నుంచి 31వ తేదీ వరకు, నవంబర్ 4, 6, 7, 11వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇవి వివాహాలు చేసుకోవడానికి అనుకూలం. నవంబర్ 16న కార్తీక మాసం ప్రారంభమవుతుంది.
ఈ మాసం వివాహాలకు తప్పా మిగతా శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. అలాగే నవంబర్ 20 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల సమయాన జిల్లాలో శుభకార్యాలు చేయరు. కాగా..ఈసారి కోవిడ్–19 నిబంధనలు అనుసరించి శుభకార్యాలు, వేడుకలు చేసుకోవాల్సి ఉంది. పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న వారు, గృహాలు నిర్మించుకున్న వారు ఈ శుభ ముహూర్తాలను వినియోగించుకోవాలని పండితుడు పి.చంద్రశేఖర్ శర్మ సూచించారు. ఇవి తప్పితే వచ్చే ఏడాది మార్చి వరకు మంచి రోజుల కోసం ఎదురు చూడాల్సిందేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment