మళ్లీ ఏకపక్ష నిర్ణయం | Nimmagadda Rameshkumar made another controversial decision | Sakshi
Sakshi News home page

మళ్లీ ఏకపక్ష నిర్ణయం

Published Sat, Jan 9 2021 3:32 AM | Last Updated on Sat, Jan 9 2021 5:09 AM

Nimmagadda Rameshkumar made another controversial decision - Sakshi

సాక్షి, అమరావతి: ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలన్న సుప్రీంకోర్టు తీర్పును తోసిరాజని గ్రామ పంచాయతీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించేందుకు శుక్రవారం రాత్రి ఏకపక్షంగా షెడ్యూల్‌ జారీ చేశారు. విజయవాడలో ఎస్‌ఈసీ కార్యాలయంలో నిమ్మగడ్డ రమేష్‌తో అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌లు సమావేశమై దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోందని, రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఉందని, ఎన్నికల నిర్వహణకు ఏమాత్రం అనుకూల వాతావరణం లేదని వివరించారు.

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాల మేరకు కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు భారీ ఎత్తున వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టామని, వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని వి/æ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క కోవిడ్‌ కేసు నమోదైనప్పుడు దాన్ని కారణంగా చూపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమాత్రం సంప్రదించకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలక ఎన్నికల ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేస్తూ గతేడాది మార్చి 15న ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిన నిమ్మగడ్డ తాజాగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాల్లో అధికార యంత్రాంగం అంతా తీరిక లేకుండా ఉన్న తరుణంలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడం పట్ల ఉద్యోగ వర్గాలు విస్తుపోతున్నాయి.

తాజాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త స్ట్రెయిన్‌ విజృంభిస్తోందని, దాని ప్రభావం దేశంపైనా, రాష్ట్రంపైనా ఉంటుందని వైద్యారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అధికార యంత్రాంగం అంతా ఈ విధుల్లో చురుగ్గా నిమగ్నమైన తరుణంలో ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతూ నిమ్మగడ్డ ముందే నిర్ణయించుకున్న ప్రకారం పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ జారీ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకూ పంచాయతీ ఎన్నికలను నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం చేసిన వి/æ్ఞప్తిని తోసిపుచ్చుతూ షెడ్యూలు విడుదల చేయడాన్ని బట్టి నిమ్మగడ్డ ఏకపక్ష వైఖరి, వివాదాస్పద నిర్ణయాలు తారాస్థాయికి చేరుకున్నట్లు స్పష్టమవుతోంది.

హైకోర్టు ఉత్తర్వులు బుట్టదాఖలు..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో అక్టోబర్‌ 28న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సమావేశం నిర్వహించగా.. రాష్ట్రంలో కోవిడ్‌ తీవ్రత దృష్ట్యా అందుకు అనువైన పరిస్థితులు లేవని, ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావరణం ఏర్పడగానే తెలియజేస్తామని పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ లిఖితపూర్వకంగా తెలియచేశారు. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అంతా ఈ కార్యక్రమంలోనే నిమగ్నమవుతారని.. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై విచారించిన హైకోర్టు.. సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీకి మూడు రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు ఐదో తేదీ సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఈ నేపథ్యంలో 7వతేదీన ఎస్‌ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలియచేసింది. 

వ్యాక్సిన్‌ సన్నద్ధతపై 11న ప్రధాని సమావేశం
కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమయ్యాయని, దీనిపై ఈనెల 9న కేంద్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారని.. ఈనెల 11న సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్‌పై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారని.. ఈ నేపథ్యంలో ఈనెల 13 వరకూ ఉన్నతాధికారులు వ్యాక్సినేషన్‌ సన్నద్ధత కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారని.. అప్పటివరకూ సమావేశాన్ని వాయిదా వేయాలని ఎస్‌ఈసీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. కానీ దీన్ని పరిగణలోకి తీసుకోకుండా శుక్రవారమే సంప్రదింపులకు హాజరు కావాలని, లేదంటే తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటానని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఏకపక్షంగా తన విధానాన్ని వెల్లడించారు. దీంతో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ నేతృత్వంలోని అధికారుల బృందం ఎస్‌ఈసీ నిమ్మగడ్డతో సమావేశమైంది. కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఆవశ్యకతను వివరించి కనీసం వ్యాక్సినేషన్‌ మొదటి దశ పూర్తయ్యే వరకైనా స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. అయితే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడం గమనార్హం. 

తన ఉత్తర్వులను తానే ఉల్లంఘించిన వైనం..
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 2019 అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా అధికారులు ఓటర్ల జాబితాను రూపొందించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సవరించి 2020 తాజా జాబితాను రూపొందించింది. తాజా జాబితాలో ఉన్న ఓటర్లకూ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించేలా 2020 జాబితా ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల జాబితా రూపొందించాలని.. ఆ మేరకు వార్డులను విభజించాలని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి, 13 జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ 2020 నవంబర్‌ 17న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఓటర్ల జాబితా రూపొందించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఓటర్ల జాబితా సిద్ధం కాకుండానే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు జారీ చేయడం ద్వారా నిమ్మగడ్డ తాను జారీ చేసిన ఉత్తర్వులను తానే ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది.

దీన్నేమంటారు.?
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం ముగిశాక, పురపాలక ఎన్నికల్లో నామినేషన్‌ స్వీకరణ ప్రక్రియ ముగిశాక కరోనా సాకుతో మార్చి 15న అర్ధాంతరంగా ఆ ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేశారు. ఆ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయకుండా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు విడుదల చేయడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ఆయన వ్యవహారశైలి ఎంత వితండంగా, ఏకపక్షంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

నాలుగు విడతల్లో ‘పంచాయతీ’ పోరు
ఎస్‌ఈసీ షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 5న తొలివిడత 
9, 13, 17వ తేదీల్లో విడతలవారీగా పూర్తి 
17న ఓట్ల లెక్కింపు.. అదే రోజు సర్పంచి,ఉప సర్పంచి ఎన్నికలు.. నేటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కోడ్‌ వర్తిస్తుందని ఎస్‌ఈసీ ఉత్తర్వులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement