సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌వే ఉంటున్నాయి. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు వస్తున్న శాంపిల్స్ ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు భరోసా ఇస్తున్నారు. వైరస్ సోకితే ఎదురయ్యే పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకుని, అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ లక్షణాలు..
రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ బారిన పడిన అత్యధికుల్లో తొలి రెండు రోజులు చలిచలిగా ఉండటం.. జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం, తలనొప్పి ఉంటోంది. మూడో రోజు నుంచి జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గుముఖం పట్టి.. జలుబు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గొంతులో గరగర, గొంతు మంట, పట్టేసినట్లు ఉండటం, దగ్గు వంటి సమస్యలు వస్తున్నాయి.
– ఈ లక్షణాలు మూడు, నాలుగు రోజులు ఉంటున్నాయి.
– వారం రోజుల్లో ఈ సమస్యలన్నీ పూర్తిగా నయమవుతున్నాయి.
పదిశాతం మందికే ఆక్సిజన్ అవసరం..
ఆసుపత్రుల్లో చేరుతున్న పాజిటివ్ రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. మెజారిటీ శాతం హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ వైరస్ నుంచి కోలుకుంటున్నారు. రెండు డోసులు టీకా తీసుకోని వారు.. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె, కిడ్నీ జబ్బులు సహా, ఇతర అదుపులో లేని కోమొర్బెడిటీ జబ్బులతో బాధపడుతున్న వారే ఎక్కువగా ఆసుపత్రుల్లో చేరుతున్నారు. మూడ్రోజుల క్రితం విశాఖ కేజీహెచ్‌లో అధికారులు వీరిని పరిశీలించారు. ఒక్కరోజులో 158 మంది చేరగా, వీరిలో కేవలం 10 మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం ఏర్పడినట్లు గుర్తించారు. వీరికి ఐదు లీటర్ల ఆక్సిజన్ మాత్రమే బేసిక్ సపోర్ట్ కోసం వినియోగించారు. మిగిలిన 148 మందినీ పరీక్షల అనంతరం సలహాలు, సూచనలిచ్చి సాయంత్రానికే ఇంటికి పంపారు. ఆ పది మంది కూడా గతంలో ఆస్తమా, డయాబెటిక్, అధిక రక్తపోటు వంటి వాటితో బాధపడిన వారే. ఈ జబ్బులకు వాడుతున్న మందులు, చికిత్సను నిర్లక్ష్యం చేయడం, అదే సమయంలో కరోనా బారిన పడటంవల్ల ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఎదురైనట్లు డాక్టర్లు గుర్తించారు.
హోమ్ ఐసోలేషన్ కిట్‌లో మార్పులు
ఈ నేపథ్యంలో.. హోమ్ ఐసోలేషన్ కిట్‌లో నిపుణుల కమిటీ సూచనల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ మార్పులు చేసింది. జింక్ మాత్రలను కిట్ నుంచి తొలగించారు. జింక్ వాడటంవల్ల మ్యూకోర్మైకోసిస్ రావడానికి ఆస్కారం ఉందని అధ్యయనాల్లో వెల్లడైంది. దీంతో జింక్‌ను తొలగించారు. అదే విధంగా.. సెట్రిజెన్ స్థానంలో ‘లెవో సెట్రిజెన్’ను చేర్చారు. సెట్రిజెన్ వాడకంవల్ల మత్తుగా ఉంటోంది. దీంతో ఈ మాత్ర స్థానంలో మరో మాత్రను చేర్చారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న హోమ్ ఐసోలేషన్ కిట్‌లో లెవో సెట్రిజెన్, విటమిన్ సీ, డీ, బీ కాంప్లెక్స్, పారాసెటిమాల్, ఫామోటిడిన్.. ఇలా ఆరు రకాల మందులు ఉంటున్నాయి.
ఆసుపత్రిలో చికిత్స ఎవరికి అవసరమంటే..
– ఇతర జబ్బులు ఉన్న వారందరూ ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరంలేదు.
– అదుపులో లేని ఇతర జబ్బులున్న వారు వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రుల్లో చేరాల్సి ఉంటుంది. (ఉదా.. శరీరంలో చక్కెర శాతం 200, 300 ఇలా అదుపులో లేకుండా పెరగడం, స్పృహ తప్పి పడిపోవడం)
– జ్వరం, దగ్గు తీవ్రమైనప్పుడు, ఆక్సిజన్ శ్యాచురేషన్ 94 శాతానికన్నా తక్కువగా ఉన్నావారు.
– కరోనా బారినపడి 10 రోజుల్లో ప్రసవించే గర్భిణులు, హైరిస్క్ గర్భిణులు.
– పిల్లలు కరోనా బారిన పడినట్లైతే పీడియాట్రిక్ వైద్యుడి సలహాలు, సూచనల మేరకు ఆసుపత్రుల్లో చేరాలి.
– శస్త్రచికిత్సల అనంతరం ఏడు రోజుల్లోపు వైరస్ సోకిన వారు..
– వైద్యులు ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసిన అనంతరం అధిక ప్రమాదం నిర్ధారణ అయిన పక్షంలో..
ఆందోళన వద్దు.. నీళ్లు బాగా తాగాలి
వైరస్ బారినపడిన వారు రోజుకు కనీసం 2.5 లీటర్ల నీరు తాగాలి. నీరు, పళ్ల రసాలు, మజ్జిగ, ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకుని, మూత్రాన్ని ఎక్కువగా విసర్జించడంవల్ల పోస్ట్ కోవిడ్ ఇబ్బందులను అధిగమించవచ్చు. త్వరగా సాధారణ పరిస్థితుల్లోకి రావచ్చు. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు వస్తున్న నమూనాల్లో 90శాతం ఒమిక్రాన్ కేసులు అని తేలుతున్నప్పటికీ ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు. పాజిటివ్ అని తెలిసిన వెంటనే స్థానిక గ్రామ/వార్డు సచివాలయానికి సమాచారం వెళ్తుంది. ఆరోగ్య సిబ్బంది మీకు ఫోన్‌చేసి హోమ్ ఐసోలేషన్ కిట్ ఇంటికి తెచ్చిస్తారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తారు. అలాగే, 104కు ఫోన్‌చేసి కరోనాకు సంబంధించిన అన్ని సేవలు ప్రజలు పొందవచ్చు.
– డాక్టర్ వినోద్‌కుమార్, రాష్ట్ర కోవిడ్ వైద్య నిర్వహణ ప్రత్యేక అధికారి
గతంలో వాడుతున్న మందులు కొనసాగించాలి
కోమొర్బెడిటీ జబ్బులతో బాధపడుతున్న వారు గతంలో వాడుతున్న మందులను ఆపకూడదు. మందులు వాడకం, ఆరోగ్య పరిస్థితిపై నిర్లక్ష్యం చేసిన క్రమంలో కరోనా సోకితే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. రెండో దశలో మాదిరి ఇప్పుడు ఊపిరితిత్తులపై ప్రభావం ఉండటంలేదు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వారు చాలా అరుదుగా ఉంటున్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకినా ఇబ్బందులు ఎదురు కావు. సాధారణ దగ్గు, జలుబు, జ్వరం వచ్చి తగ్గిపోయినట్లే తగ్గిపోతుంది.
– డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూల్ జీజీహెచ్
Comments
Please login to add a commentAdd a comment