జీజీహెచ్‌లో ఉచిత భోజన కార్యక్రమం కోసం సిద్ధమవుతున్న భవనం
అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టటానికి మించిన మంచిపనిలేదని లోకోక్తి. అన్నదానం మహాయజ్ఞంతో సమానమని చెబుతారు. అటువంటి మహాకార్యం గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పురుడుపోసుకుంటోంది. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వారి సహాయకులకు జనవరి నుంచి రెండుపూటలా ఉచితంగా అన్నం పెట్టనున్నారు. ఇందుకు రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సంకల్పించారు. ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగటానికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు.
సాక్షి, గుంటూరు: గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్) నైపుణ్యమైన వైద్యసేవలకు పెట్టింది పేరు. అవిభక్త కవలల శస్త్రచికిత్సల నుంచి గుండె శస్త్రచికిత్సల వరకు అనేక క్లిష్టమైన వైద్యసేవలను అందించిన ఘనత కలిగింది ఈ వైద్యశాల. రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి రోగులు ఈ ఆస్పత్రికి వస్తుంటారు. వీరిలో పేద, మధ్యతరగతి రోగులే అధికం. 1,500 మందికిపైగా రోగులు ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతుంటారు. వీరికి ఒకరిద్దరు కుటుంబసభ్యులో, బంధువులో సహాయంగా ఉంటారు. సహాయంగా ఉండేవారి సంఖ్య 2,500 నుంచి మూడువేల వరకు ఉంటుంది. రోగులకు చికిత్స, భోజనం బాధ్యత ఆస్పత్రిదే. సహాయకులు మాత్రం సొంత డబ్బుతో తినాల్సిందే. ఉదయం టిఫిన్, రెండుçపూటలా భోజనానికి ఒక్కొక్కరికి రూ.200 వరకు ఖర్చవుతుంది. 3 వేల మంది సహాయకులు రోజుకు రూ.6 లక్షల భోజనానికే వెచ్చించాల్సి వస్తోంది. ఈ సహాయకుల్లో పలువురు చేతిలో డబ్బులేక పస్తులుంటున్నారు. ప్రస్తుతం పొగాకు వ్యాపారి పోలిశెట్టి సోమసుందరం రోజూ మధ్యాహ్నం 500 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నారు.
చలించిన మంత్రి
కుటుంబసభ్యులు, ఆప్తులు అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి సహాయంగా ఉంటూ.. డబ్బులేక కొందరు, సరిపోక కొందరు ఆకలితో బాధపడుతుండటాన్ని గమనించిన మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చలించిపోయారు. సాటి మనుషులు ఆకలితో బాధపడకుండా చూడాలని అనుకున్నారు. ఇందుకోసం నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మహత్కార్యానికి కోటిరూపాయల విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆస్పత్రి ప్రాంగణంలో ఏపీఎన్‌జీవో సంఘం ఇచ్చిన రూ.25 లక్షలతో నిర్మిస్తున్న భవనాన్ని అన్నదాన భవనంగా ఉపయోగించనున్నారు. రెండంతస్తుల్లో ఒకేసారి 300 మంది భోజనం చేసేలా వసతులు సమకూరుస్తున్నారు. అత్యాధునిక వంటశాల రూపుదిద్దుకుంటోంది. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఆధునిక వంటసామగ్రిని తెప్పించారు. తరువాత ఉదయం 11 గంటల నుంచి, రాత్రి 7 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ప్రారంభించాలని, పరిమితి లేకుండా ఎందరు సహాయకులున్నా అందరికీ భోజనం పెట్టాలని నిర్ణయించారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, దాతలు తలోచేయి వేస్తే ఈ అన్నదానయజ్ఞం నిరాటంకంగా సాగుతుంది.
జనవరి మొదటి వారంలో అందుబాటులోకి
వచ్చే జనవరి మొదటి వారంలో జీజీహెచ్‌లో రోగుల సహాయకులకు ఉచిత భోజన కార్యక్రమం అందుబాటులోకి తీసుకువస్తాం. ఫైవ్‌స్టార్ హోటల్‌ను తలపించేలా భవనంలో వసతులు సమకూరుస్తున్నాం. ఆస్పత్రి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
– చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి
Comments
Please login to add a commentAdd a comment