ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,032 మంది అమ్మాయిలు
1,138 మంది అమ్మాయిలతో టాప్‌లో కేరళ
11 రాష్ట్రాల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిల
సంఖ్య ఎక్కువ కేంద్ర ప్రభుత్వం వెల్లడి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏపీలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అబ్బాయిల కన్నా అమ్మాయిలే అధికమని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ వెల్లడించింది. ఈ మేరకు లేబర్ ఫోర్స్ సర్వే నివేదికను కేంద్రం విడుదల చేసింది. 2023 జూలై నుంచి 2024 జూన్ వరకు ఈ సర్వే నిర్వహించినట్లు నివేదికలో తెలిపింది. దేశంలో అబ్బాయిల కన్నా అమ్మాయిలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో మేఘాలయ, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని పేర్కొంది.
కేరళలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,138 మంది అమ్మాయిలుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 1,032 మంది అమ్మాయిలున్నారని వెల్లడించింది. 2019–20లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలుండగా.. 2023–24లో ఆ సంఖ్య 1,032కు పెరిగిందని పేర్కొంది. అలాగే ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,019 మంది అమ్మాయిలుండగా.. పట్టణ ప్రాంతాల్లో 1,064 మంది అమ్మాయిలున్నట్లు తెలిపింది. దేశం మొత్తం మీద 11 రాష్ట్రాల్లోనే అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉందని వెల్లడించింది.
జాతీయ స్థాయిలోనూ పురోగతి..
దేశం మొత్తం మీద చూస్తే అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా ఉన్నప్పటికీ.. అమ్మాయిల సంఖ్య గతంలో కంటే పెరిగిందని నివేదిక వెల్లడించింది. దేశంలో 2019–20లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 963 మంది అమ్మాయిలుండగా.. 2023–24లో ఆ సంఖ్య 981కి పెరిగిందని తెలిపింది. ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోందని నివేదిక పేర్కొంది. అమ్మాయైనా, అబ్బాయైనా.. ఒక్కరు చాలనుకునే వారి సంఖ్య పెరిగిందని వెల్లడించింది. ఇక హరియాణాలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 867 మంది అమ్మాయిలు, ఢిల్లీలో 837 మంది, దాద్రా–నగర్–హవేలీ–డామన్–డయ్యూలో 818 అమ్మాయిలు మాత్రమే ఉన్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment