
సాక్షి, అమరావతి: పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రభావితం చేసేలా ప్రకటనలున్నాయనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. ‘ప్రభుత్వ ప్రకటనలను తప్పుబడుతూ నాలుగైదు రాజకీయ పార్టీలు కొత్త విషయాన్ని ఎన్నికల కమిషన్ ముందుకు తెచ్చాయి. ఎన్నికలు మొదలయ్యాక ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలు కమిషన్ పరిధిలోనే ఉంటాయి. ఈ ప్రకటనపై ఐ అండ్ పీఆర్ కమిషనర్ నుంచి సంజాయిషీ కోరా’ అని నిమ్మగడ్డ పేర్కొన్నారు. మీడియాతో నిమ్మగడ్డ సమావేశం వివరాలివీ..
అపరిమితమైతే పరిశీలనే
సాధారణంగా జరిగే ఏకగ్రీవ ఎన్నికలకు ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఏకగ్రీవాల సంఖ్య అపరిమితంగా పెరిగిపోతే నిశితంగా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంటుంది. ఎన్నికల్లో పోటీచేసే ఔత్సాహిక అభ్యర్థులకు అండగా నిలబడాలని కలెక్టర్లకు చెప్పా. ఇందుకు ఆటంకాలు కల్పిస్తే చర్యలు తీసుకోవాలని సూచించాం.
తుది నిర్ణయం తీసుకోలేదు..
గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చాలా అక్రమాలు జరిగాయని, దాని మూలంగానే ఏకగ్రీవాలు అయ్యాయని ఆరోపణలున్నాయి. ఇవన్నీ కమిషన్ విచారణలో ఉన్నాయి. ప్రస్తుతం ఏకగ్రీవాలు జరిగితే క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా పరిశీలించి సముచిత నిర్ణయం తీసుకోవాలని సూచించాం. ఎన్నికలు సజావుగా జరుగుతాయని నాకు నమ్మకం ఉంది. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే సుప్రీం తీర్పును ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని భావించి, అన్ని విషయాలు న్యాయస్థానాల ముందుంచాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంటుంది.
సంయమనం పాటించేలా చూడాలని కోరా
ఇవాళ కలెక్టర్ల సమావేశం తర్వాత ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయి. ఎన్నికల కమిషనర్‌ను వ్యక్తిగతంగా నిందించడం తగదని, ప్రభుత్వంలో ఉన్న అధికార పెద్దలు సంయమనం పాటించి ఎన్నికల కమిషన్ ప్రతిష్టను కాపాడేందుకు కృషి చేయాలని గవర్నర్‌ను కోరా. ఈ విషయంపై సీఎస్‌కు గవర్నర్ సూచన చేసినట్లు తెలిసింది. మంత్రులందరికీ సీఎస్ చెప్పి ఉంటారు. కానీ సాయంత్రానికి ఓ మంత్రి.. ఎవరి ప్రాపకం కోసమో తాను ఇద్దరు అధికారులపై చర్య తీసుకున్నట్లు మాట్లాడడం బాధాకరం. అవి రాజ్యాంగ స్ఫూర్తి, ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకం. ఇద్దరు అధికారులపై చర్య తీసుకున్నది వాస్తవమే. వాళ్లకు హానికరంగా ఉండేటట్లు నేనేమీ చేయలేదే. నేనేమీ వాళ్ల బదిలీ, క్రమశిక్షణ చర్యలు కోరలేదు. సస్పెండ్ చేస్తాననలేదు. కేవలం ‘సెన్సూర్’ చేశా. వారు మెరుగైన పనితీరు ప్రదర్శించి, పోకడలో మార్పు ఉంటే పునరాలోచించే అవకాశం ఉంటుంది. పొద్దున వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణను గిరిజా శంకర్‌కే అప్పగించా. జిల్లాలో సమస్యలుంటే ఆయన్నే సంప్రదించాలని కలెక్టర్లకు సూచించా. నేను వారి ప్రతిష్ట, గౌరవాన్ని పెంచడానికి ప్రయత్నించా.
Comments
Please login to add a commentAdd a comment