ఏం జరిగిందో తెలిసే లోగానే బోగీ అంతా రక్తసిక్తం... | Odisha Train Accident Victims Tearful stories | Sakshi
Sakshi News home page

ఏం జరిగిందో తెలిసే లోగానే బోగీ అంతా రక్తసిక్తం...

Published Mon, Jun 5 2023 9:30 AM | Last Updated on Mon, Jun 5 2023 9:31 AM

Odisha Train Accident Victims Tearful stories - Sakshi

మాటలకందని విషాదం.. మనసుల్ని చిదిమేసింది.. ప్రమాదం జరిగి.. 60 గంటలు గడుస్తున్నా.. ఎవరు ఎక్కడున్నారో..? ఎలా ఉన్నారో తెలియని హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. భయానక ఉత్పాతం నుంచి అదృష్టవశాత్తూ బయటపడి.. సొంతూళ్లకు తిరిగివచ్చిన వారంతా.. తమకు పునర్జన్మ లభించిందని చెబుతున్నారు. ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో చిక్కుకొని ఎలాగోలా బయటపడి వచ్చేసినా.. ఇంకా ఆ రాత్రి తమ జీవితాల్లో కాళరాత్రిలా కళ్లముందే కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరుగాని ఊరులో ప్రమాదపుటంచుల్లో హాహాకారాల మధ్య జీవనం గడుపుతూ ప్రతి నిమిషం భయం వెంటాడుతున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సాయం మరువలేనిదని చెబుతున్నారు. విశాఖ చేరుకున్న పలువురు బాధితుల కన్నీటి కథలివీ..  

సాక్షి, విశాఖపట్నం: నగరంలోని జాలరిపేట, వాడపేటల నుంచి ఏడుగురు గత నెల 27న తీర్థయాత్రకు బయల్దేరారు. వీరు తొలుత కాశీ వెళ్లి విశ్వేశ్వరుని, అనంతరం కోల్‌కతాలోని కాళీమాతను దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఈనెల రెండో తేదీన కోల్‌కతాలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. వీరిలో ఎస్‌–1లో ఇద్దరు, ఎస్‌–4 బోగీలో ఐదుగురు ఉన్నారు. వీరెక్కిన రైలు ఒడిశాలోని బహనగ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగానూ, ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరు ఆదివారం ఉదయం  ఓ వాహనంలో విశాఖ చేరుకున్నారు.

ప్రమాద బాధితుల్లో ఒకరైన జాలరిపేటకు చెందిన ఎం.సత్యంకు బాధితుల తరఫున ప్రభుత్వం రవాణా ఖర్చుల కింద రూ.30 వేల చెక్కును మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం కలెక్టరేట్‌లో అందజేశారు. ఈ సందర్భంగా రైలు దుర్ఘటనపై సత్యం ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ప్రమాదం జరిగే సమయానికి మేం ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇంతలో పెద్ద శబ్దంతో భారీ కుదుపు. క్షణాల్లోనే బోగీలు తిరగబడ్డాయి. అంతా అరుపులు.. కేకలు. ఏం జరిగిందో తెలిసే లోగానే బోగీ అంతా రక్తసిక్తం.

చాలామంది చనిపోయారు. మాపైనా చాలా మంది పడిపోయారు. నాతో ఉన్న రాజు, రమణలకు బాగా దెబ్బలు తగిలాయి. నాకు, నా భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. మేం బతుకుతామన్న నమ్మకం లేదు. మాతోటి ప్రయాణికుడు సీహెచ్‌ రాజు కారుతున్న రక్తాన్ని లెక్క చేయకుండా మమ్మల్ని బతికించాడు. లేదంటే మేమంతా చనిపోయేవాళ్లం. ఆ కలకత్తా కాళీమాతే మమ్మల్ని బతికించింది.’ అని కన్నీటి పర్యంతమవుతూ సత్యం చెప్పాడు.  

బతికున్నానంటే నమ్మలేకపోతున్నా.. 
ఒక్కసారిగా కుదుపు వచ్చి పడిపోయాను. నా మీద బ్యాగులు, మనుషులు పడిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాను. కాసేపటి తర్వాత కళ్లు తెరిస్తే.. కొందరు నన్ను మోసుకొంటూ అంబులెన్స్‌ దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్లు మొత్తం చెక్‌ చేశారు. అప్పటి వరకు ఏం జరిగిందో.. ఎందుకు పడిపోయానో తెలీదు. పక్కనున్న వాళ్లని అడిగితే.. రైళ్లు గుద్దుకున్నాయని చెప్పారు. కళ్లముందే శవాల గుట్టలు కనిపించాయి. కొందరు తమ వాళ్లు కనిపించక.. రక్తాలతో అటు ఇటు పరుగెడుతున్నారు. నాకు నా కుటుంబం గుర్తొచ్చింది. భయంతో వణికిపోయాను.

నా భర్తకి అప్పటికే దెబ్బలు తగిలున్నాయి. ఆయన నా దగ్గరికి వచ్చారు. ఆయన్ని చూడగానే ఊపిరి వచ్చింది. ప్రభుత్వ సహకారంతో ఇక్కడి వచ్చాం. చాలా బాగా తీసుకొచ్చారు. దారిలో భోజనాలు, పళ్ల రసాలు అందిస్తూ.. జాగ్రత్తగా చూసుకుని వైద్యం అందిస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నాం. ఇంత ఘోరం జరిగిందని తలచుకుంటేనే భయం, ఏడుపు వచ్చేస్తున్నాయి. బతికున్నానంటే నమ్మలేకపోతున్నాను. మళ్లీ నా పిల్లల్ని, మనవళ్లని చూస్తామని కలలో కూడా అనుకోలేదు. 
– భారతి, బుచ్చిరాజుపాలెం, విశాఖపట్నం 

షాక్‌ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది 
షాలిమార్‌లో రైలు ఎక్కాను. వైజాగ్‌లో దిగాల్సి ఉంది. నేను దివ్యాంగుల కోచ్‌లో ఉన్నాను. భారీ శబ్ధం వినిపించింది. మా బోగీ.. గూడ్స్‌ రైలుకు ఇటువైపున పడిపోయింది. అటు పడి ఉంటే.. ఇప్పుడు మాట్లాడేందుకు ఉండేవాడిని కాదేమో. మా బోగీలో నా పక్కన కూర్చున్న వారిలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. అది చూసి నాకు భయం మొదలైంది. నరకం కనిపించింది. అతి కష్టమ్మీద.. బోగీ నుంచి బయటకు వచ్చాను. ఏమి కనిపించ లేదు. చాలా మంది ఏడుపులు, కేకలు వినిపిస్తున్నాయి. నా మొబైల్‌లో లైట్‌ వేసి చూశాను.

చాలా మంది రక్తంతో అటు ఇటు తిరుగుతున్నారు. బోగీలో అటు ఇటు.. ఎగిరి పడటం వల్ల.. ఒళ్లంతా నొప్పులైపోయాయి. నడవలేని పరిస్థితిలో ఉన్నాను. మెల్లగా ట్రాక్‌ దాటి.. ఒక మూల కూర్చున్నాను. ఇంతలో కొందరు ఊరి వాళ్లు వచ్చి.. నన్ను అంబులెన్స్‌ దగ్గరకు తీసుకెళ్లారు. తర్వాత రోజు ఉదయం సీఎం జగన్‌ మన వైజాగ్‌ నుంచి మంత్రుల్ని పంపించారని తెలిసింది. తెలుగు వాళ్లందర్ని అక్కడికి తీసుకెళ్లి.. స్పెషల్‌ ట్రైన్‌లో వైజాగ్‌ పంపించారు. ఇక్కడ ట్రీట్‌మెంట్‌ బాగా ఉంది. ప్రతి గంటకు డాక్టర్లు వచ్చి.. ఎలా ఉందని అడుగుతున్నారు. నొప్పులు ఇంకా తగ్గలేదు.. రికవరీ అయ్యేందుకు కొంత టైమ్‌ పడుతుందని డాక్టర్లు చెప్పారు. నా జీవితాంతం ఈ ప్రమాదం నా కళ్లముందే కనిపిస్తుంటుందేమో. వెంటనే ఆదుకొని వైజాగ్‌ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. 
– శంకర్‌రావు, పాతర్లపల్లి గ్రామం, రణస్థలం, శ్రీకాకుళం

ఇలాంటి ఘోరాన్ని ఎవరూ చూడకూడదు 
ఖరగ్‌పూర్‌ పెళ్లికి వెళ్లి.. కోరమండల్‌లో తిరిగి వస్తున్నాం. ఎస్‌–3 బోగీలో ఉన్నాం. సాయంత్రం చిన్నగా కునుకు తీస్తున్నాను. ఇంతలో ఒక్కసారిగా బండి జర్క్‌ అయినట్లు అయింది. ఫాస్ట్‌గా ట్రైన్‌ వెళ్తోంది కదా.. అందుకే అనుకున్నాను. ఒక్క క్షణంలో కింద పడిపోయాను. నాపైన లగేజీలు, పై బెర్త్‌లో ఉన్న ఇద్దరు పడిపోయారు. బోగీలో జనమంతా ముద్దగా పడిపోయాం. పైనున్న ఒక్కొక్కరూ లేచి ఒకరికొకరం సాయం చేసుకుని బయటపడ్డాం. అప్పటికే.. అందరికీ దెబ్బలు తగిలాయి. ఈ క్రమంలో స్పృహ కోల్పోయాను.

కాసేపటికి ఎవరో నలుగురు ముఖంపై నీళ్లు చల్లితే దుకాణం వద్ద ఉన్నాను. వాళ్లు నా ప్రాణాలు కాపాడారు. ఏం జరిగిందని అడిగితే.. ఘోరం గురించి చెప్పారు. తల్లడిల్లిపోయాను. నా భార్య కోసం వెతికితే.. ఆమె క్షేమంగా ఇంకో చోట ఉందని చెప్పారు. వెంటనే నన్ను అక్కడికి తీసుకెళ్లమని చెప్పాను. దారిలో వెళ్తుంటే.. శవాలను, గాయపడిన వారిని మోసుకెళ్తున్నారు. అది చూశాక దేవుడా.. ఇలాంటి ఘోరాన్ని ఇంకెవరూ చూడకుండా కాపాడు స్వామీ అని మొక్కుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, బంధువుల సహకారంతో విశాఖ వచ్చేశాను. ఇక్కడ మంచి వైద్యం అందిస్తున్నారు.                                                
 – మాధవరావు, బుచ్చిరాజుపాలెం   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement