
సాక్షి ప్రతినిధి, అనంతపురం : వైద్య వృత్తిలో ఉన్న వాళ్లు నిత్య విద్యార్థులు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రోజుకో మెలకువ నేర్చుకుంటూ ఉండాలి. దీన్నే సీఎంఈ (కంటిన్యుటీ మెడికల్ ఎడ్యుకేషన్) అంటారు. కొత్త మెలకువలు నేర్చుకోవాలంటే ఎక్కడో ప్రత్యేక ఇన్‌స్టిట్యూట్‌కో, సంస్థకో వెళ్లాలి. కానీ అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలోకే బస్సు వచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ కార్పొరేట్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సామాజిక బాధ్యత)లో భాగంగా శస్త్రచికిత్సలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన బస్సును గురువారం తీసుకొచ్చింది. శుక్రవారం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మైరెడ్డి నీరజ ‘ఇనిస్టిట్యూట్ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. శనివారం వరకు సాగే ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల, సర్వజనాస్పత్రిలో పనిచేసే వైద్యులు, పీజీలు, హౌస్ సర్జన్‌లు దాదాపు 200 మంది శిక్షణ తీసుకోనున్నారు.
ల్యాప్రోస్కోపిక్‌పై శిక్షణ
ప్రధానంగా ఈ బస్సు బడిలో అతి చిన్న కోతలు అంటే ల్యాప్రోస్కోపిక్ ద్వారా సర్జరీ ఎలా చేయాలి, కుట్లు ఎలా వేస్తే త్వరగా గాయం మానే అవకాశం ఉంటుందన్న విధానాలపై శిక్షణ ఇచ్చారు. స్టిమ్యులేషన్ పద్ధతిలో బస్సులోనే ప్రత్యేకంగా రూపొందించిన అత్యంత ఆధునిక పరికరాలతో సర్జరీ మెలకువలు నేర్పించారు. కొంతమంది ప్రొఫెసర్లు సైతం ఈ టెక్నిక్‌లను నేర్చుకునేందుకు ఆసక్తి చూపించారు. పెద్దగా గాట్లు పెట్టడం, కుట్లు సరిగా వేయకపోవడం వంటి కారణాలతో రక్తస్రావం అవుతుంది. ఇలా రక్త స్రావం కాకుండా సర్జరీ ఎలా చేయాలి అన్నదానిపై ప్రత్యేక ట్రైనర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. సర్జరీ అనంతరం రోగి వీలైనంత త్వరగా డిశ్చార్జి అయ్యేలా, అందుకు తగ్గట్టు ఆపరేషన్లు ఎలా సూక్ష్మగాటుతో చేయాలనే దానిపై చూపించారు. సుమారు రూ.10 కోట్లతో రూపొందించిన ఈ బస్సు ఆధునిక వైద్య విజ్ఞాన వేదికగా ఉందని పలువురు పీజీ వైద్యవిద్యార్థులు పేర్కొన్నారు.
ఇదొక సువర్ణావకాశం
వైద్యశాస్త్రంలో రోజుకో కొత్త మెలకువ వస్తోంది. అది ప్రాక్టికల్‌గా చేస్తే గానీ తిరిగి పేషెంటుకు చెయ్యలేం. అలా కొత్త టెక్నిక్ స్టిమ్యులేషన్ పద్ధతిలో బస్సులో నేర్చుకునే అవకాశం వచ్చింది. వైద్యవిద్యార్థులకే కాదు మాకు కూడా ఇది బాగా ఉపయోగపడింది.
–డా.రామకృష్ణ నాయక్, హెచ్‌ఓడీ, జనరల్ సర్జరీ విభాగం
కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటేనే..
పాతికేళ్లుగా సర్జరీలు చేస్తున్నా. ఏరోజుకారోజు కొత్తే. దీన్ని నేర్చుకోవాల్సిందే. ఇక్కడకు వచ్చిన బస్సులో వైద్యులు, విద్యార్థులు అందరికీ ఉపయోగపడే కొత్త టెక్నిక్స్ ఉన్నాయి. ప్రధానంగా గైనకాలజీ సర్జరీల్లో కుట్లు చాలా ముఖ్యం. దీనిపై కొత్త మెలకువలు చెప్పారు.
–డాక్టర్ మాణిక్యాలరావు, హెచ్‌ఓడీ, గైనకాలజీ విభాగం