‘దాస్యమూ, దోపిడీ, దారిద్య్రమూ హెచ్చి, పాడిపంటల మేలు బంగారు నా తల్లి, కరవు కాపురమైందిరా పలనాడు.. కంటనీరెట్టిందిరా’ అంటూ కవి పులుపుల ఎంతో ఆవేదన చెందాడు ఆనాడు. ఇక మళ్లీ అలాంటి పరిస్థితులు ఎన్నడూ ఈ పలనాటి సీమ దరి చేరకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. ఇక్కడి మాగాణుల్లో ఆయకట్టు పెంచి ఆదాయ వనరులు పుష్కలంగా పెంపొందించేందుకు అన్ని అవకాశాలు కల్పించింది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు నేడు ఫలనాడుగా మారనుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వరికిపూడిశెల ప్రాజెక్టు కూడా రానుండటంతో పల్నాడు జిల్లాలో ఆయకట్టు పెరగనుంది. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన పలనాడులోకే సాగునీటి ప్రాజెక్టులన్నీ రావడం విశేషం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాచర్ల నియోజకవర్గంలో ఉంటే, పులిచింతల ప్రాజెక్టు పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలో ఉంది. మూడేళ్లుగా వర్షాలు బాగా కురుస్తుండటంతో ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి.
పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 41.8813 టీఎంసీలు ఉంది. నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 544.90 అడుగులకు చేరింది. ఇది 198.6870 టీఎంసీలకు సమానంగా ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకి 4,459, ఎడమకాలువకి 6,097, ఎస్‌ఎల్‌బీసీకి 1,650, వరదకాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగునీటికి ఇబ్బందులు లేని పరిస్థితులు నెలకొన్నాయి. వెనకబడిన పల్నాడు ప్రాంతంలో చెంతనే కృష్ణానది ఉన్నప్పటికీ సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. బుగ్గవాగు రిజర్వాయర్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగునీరు సరైన సమయంలో అందక పంటలు ఎండుముఖం పట్టేవి. ఈ తరుణంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వరికపూడిశెలకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
ఈ ఎత్తిపోతల పూర్తి అయితే 73 వేల ఎకరాల ఆయకట్టుకు నీటి ఎద్దడి లేకుండా చూడవచ్చు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బొల్లాపల్లి మండలంలో 25 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందటంతో పాటు వినుకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. అలాగే ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో కూడా సాగు, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. నూజెండ్ల మండలంలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.95 కోట్లతో 5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు ఏర్పాటు చేసేందుకు సర్వే పూర్తి చేశారు. నూజెండ్ల మండలం కంభంపాడు, కొత్తపాలెం, పువ్వాడ, ములకలూరు, ఉప్పలపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఏర్పాటు కానున్నాయి.
మరోవైపు వాణిజ్య పంటలకు పల్నాడు కేరాఫ్‌గా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పండే పత్తి, మిర్చి పంటలు 90 శాతం పల్నాడులోనే ఉండటం గమనార్హం. ఈ ఏడాది రికార్డు స్థా యిలో 2,66,640 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. సుమారు రెండు లక్షల ఎకరాల వరకూ పల్నాడు ప్రాంతంలోనే సాగైంది. జిల్లాలో మాచర్ల, దుర్గి, రెంటచింతల, గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి, రాజు పాలెం, సత్తెనపల్లి, క్రోసూరు, పెదకూరపాడు, ఫిరంగిపురం, మేడికొండూరు, అమరావతి, బెల్లంకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల తదితర మండలాల్లో విస్తారంగా మిర్చి పంట సాగు చేశారు.
మరోవైపు పత్తిని తీసుకుంటే జిల్లాలో 4,23,750 ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా ఈ ఏడాది గులాబీ రంగు పురుగు ఉధృతి వల్ల 2,73, 950 ఎకరాల్లోనే సాగు అయ్యింది. అందులో కూడా 90 శాతం పల్నాడులోనే సాగు అయ్యింది. పల్నాడు ప్రాంతంలో 2.81 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేయడం జరిగింది. పల్నాడు జిల్లాలో 7,13,142 ఎకరాలు సాధారణ విస్తీర్ణం ఉంది. భవిష్యత్‌లో కూడా వాణిజ్య పంటల కారణంగా పల్నాడు జిల్లాకు ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రాష్ట్రంలో అధిక ఆదాయం పొందే జిల్లాల్లో పల్నాడు కూడా నిలిచే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన అధికార యంత్రాంగం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment