9.05 లక్షల మందికి మూడో విడత ‘జగనన్న తోడు’ | Peddireddy Ramachandra Reddy Comments On Jagananna Thodu | Sakshi
Sakshi News home page

9.05 లక్షల మందికి మూడో విడత ‘జగనన్న తోడు’

Published Tue, Feb 15 2022 4:00 AM | Last Updated on Tue, Feb 15 2022 4:00 AM

Peddireddy Ramachandra Reddy Comments On Jagananna Thodu - Sakshi

సాక్షి, అమరావతి: ‘జగనన్న తోడు’ పథకంలో చిరు వ్యాపారులకు ప్రభుత్వం మూడో విడత కింద లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటికే 9,05,023 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. జగనన్న తోడు, వైఎస్సార్‌ చేయూత, ఆసరా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ, స్వయం సహాయక సంఘాలు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక తదితర పథకాల అమలుపై సోమవారం మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ..జగనన్న తోడు మూడో విడత కార్యక్రమాన్ని ఈ నెల 22న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. బ్యాంకుల ద్వారా గత రెండు విడతలుగా రుణాలు పొందిన 6,91,530 మందితో పాటు కొత్తగా మరో 1,57,760 మందికి మూడో విడతలో బ్యాంకు రుణాలు అందించనున్నట్లు వివరించారు. సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మూడో విడత సున్నా వడ్డీ పథకం కోసం..
వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద మొదటి విడతలో దాదాపు 81 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు రూ.1,207.14 కోట్లు, రెండో విడతలో 97 లక్షల మంది మహిళలకు రూ.1,081.23 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మూడో విడత కింద పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ ద్వారా లబ్ధి చేకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పెన్షన్‌ లబ్ధిదారుల జాబితాలను ఆధార్‌ లింక్‌తో అనుసంధానం చేసి మరింత పారదర్శకంగా పింఛన్ల పంపిణీ చర్యలు చేపట్టాలని సూచించారు. పొదుపు సంఘాలకు సంబంధించి గ్రామ సమాఖ్యలో నిధుల దుర్వినియోగంపై అధికారులు దృష్టి సారించాలని.. గ్రామ సమాఖ్యల కార్యక్రమాలపై పర్యవేక్షణ, పరిశీలన కోసం ఒక జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement