మంగళగిరిలో జనసేన నాయకులను అడ్డుకుంటున్న లబ్ధిదారులు
మంగళగిరి/కశింకోట/పెంటపాడు: వైఎస్సార్ జగనన్న కాలనీలలో పర్యటించి రాజకీయాలు చేయాలనుకున్న జనసేన నాయకులకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురైంది. తమ నివాసాలలో ఎవరు పర్యటించాల్సిన అవసరంలేదని వెంటనే వెనక్కి వెళ్లాలని కరాఖండిగా చెప్పారు. ఇంకోసారి తమ కాలనీల్లోకి వస్తే మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెబుతామని ముక్తకంఠంతో లబ్ధిదారులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడికక్కడ లబ్ధిదారుల నుంచి ఇలా వ్యతిరేకత వస్తుండడంతో జనసేన నేతలు చేసేదిలేక వెనుదిరుగుతున్నారు.
రాజకీయాల కోసం రావొద్దు.. వెళ్లిపోండి
గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్‌లో నిర్మించిన వైఎస్సార్ జగనన్న కాలనీ (టిడ్కో) ఇళ్లను పరిశీలించేందుకు వచ్చిన జనసేన శ్రేణులకు చేదు అనుభవం ఎదురైంది. వీరి పర్యటనను ముందుగానే తెలుసుకున్న లబ్ధిదారులు సమావేశమై జనసేన నాయకులను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్టీ నేత చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు టిడ్కో ఇళ్ల సముదాయానికి చేరుకున్నారు. వీరి రాకను గమనించిన లబ్ధిదారులు అనుకున్నట్లుగానే వారిని అడ్డుకున్నారు.
తమ ఇళ్లకు అన్ని వసతులు కల్పించి అత్యాధునికంగా తీర్చిదిద్దారని.. గృహప్రవేశాలు కూడా చేసుకున్నామని చెప్పారు. అసలు జనసేన నాయకులు ఎందుకు వచ్చారని నిలదీశారు. రాజకీయాల కోసం ఎవరూ తమ దగ్గరకు రావాల్సిన అవసరంలేదని వెంటనే వెనక్కి వెళ్లాలని కరాఖండిగా చెప్పారు. దీంతో జనసేన శ్రేణులు తాము సమస్యలేమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకే వచ్చామని చెప్పారు.
అంతేకాక.. ప్రజాస్వామ్యంలో తమకు ఇలా వచ్చే హక్కు ఉందని కొందరు జనసేన కార్యకర్తలు లబ్ధిదారులైన మహిళలతో వాగ్వాదానికి దిగారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన లబ్ధిదారులు సమస్యలుంటే తమ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్తామని మీరు వెళ్లిపోవాలంటూ మండిపడ్డారు. అలాగే, రాజకీయం చేసి మా పొట్ట కొట్టొద్దని కోరారు. దీంతో ఏంచేయాలో పాలుపోని జనసేన నేతలు లబ్ధిదారులకు దండం పెట్టి వెనుదిరిగారు.
అనంతరం.. సి–3 బ్లాక్‌లో ఎఫ్‌ఎఫ్–8 ప్లాట్‌లో నివాసముంటున్న జనసేన కార్యకర్త ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇది గమనించిన లబ్ధిదారులు మళ్లీ అక్కడకు చేరుకుని అసలు ఏ ఇంటినీ పరిశీలించాల్సిన అవసరంలేదని వెంటనే వెళ్లిపోవాలని కోరడంతో మరోసారి వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో పట్టణ ఎస్‌ఐ మహేంద్ర అక్కడకు చేరుకోవడంతో చేసేదిలేక జనసేన శ్రేణులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత పలువురు లబ్ధిదారులు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల కోసం ఏ పార్టీ పర్యటించినా అడ్డుకుంటామన్నారు. రాజకీయాల కోసం జగనన్న ఇళ్ల వద్దకు వస్తే మాటలతో కాకుండా చేతలతోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు.
సంతృప్తికరంగానే ఉంటున్నాం..
అలాగే, అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలోని తాళ్లపాలెం శివారు బంగారయ్యపేట, తేగాడ గ్రామాల వద్ద నిర్మిస్తున్న వైఎస్సార్ జగనన్న గృహ నిర్మాణ లేఅవుట్లను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను సమస్యలు చెప్పమని అడిగారు. అయితే, ఇళ్ల స్థలం, ఇళ్లు మంజూరు చేయడంతో సంతృప్తికరంగా నిర్మించుకుంటున్నామని వారు బదులిచ్చారు. తేగాడ లేఅవుట్‌లో కూడా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం సంతృప్తికరంగా సాగుతుందని బదులివ్వడంతో తాము ఆశించిన ఫలితం రాలేదంటూ జనసేన శ్రేణులు నిరాశతో వెనుదిరిగారు.
గోబ్యాక్ నినాదాలతో తోకముడిచిన జనసేన
‘జగనన్న కాలనీలో జనసేన జెండాల ప్రదర్శన తగదు.. మమ్మల్ని సంప్రదించకుండా కాలనీలోకి రావడాన్ని సహించం.. మాకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయి.. జనసేన నేతలు వచ్చి ఇక్కడ కిరికిరీలు పెట్టొద్దు.. జగనన్న ప్రభుత్వం మాకెంతో మేలు చేస్తోంది.. గతంలో ఏ ప్రభుత్వం మాకు ఇళ్లు ఇవ్వలేదు’.. అంటూ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శిపర్రు శివారు బిళ్లగుంట జగనన్న కాలనీవాసులు జనసేన శ్రేణులకు అడ్డుతగిలారు.
జనసేన గోబ్యాక్ అంటూ మహిళలు నినదించారు. తమకు సీఎం జగనన్న, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నిరకాలుగా అండగా నిలుస్తుంటే ఓర్వలేకపోతున్నారా అని ప్రశ్నించారు. దీంతో జనసేన శ్రేణులు తమ జెండాలను ముడిచి వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment