ఎనభై పళ్ల ఇసుక సంచుల బరువుతో పరుగెడుతున్న గార్ధభం
కోవెలకుంట్ల: మనలో చాలామందికి గుర్రాల పరుగు పందేలు తెలుసు. వృషభాల బండలాగుడు పోటీలు కూడా చూసే ఉంటారు. ఈ కోవలోనే గాడిదల (గార్ధభాలు)కూ పరుగు పందేలు ఇటీవల కాలంలో నిర్వహిస్తున్నారు. తరతరాల నుంచి ప్రజలు గాడిదలను బరువులు మోసేందుకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో కొండప్రాంతాల నుంచి ధాన్యం, అటవీ సంపదను గార్ధభాలపై వేసుకుని ఒకచోట నుంచి మరో చోటకు తరలించేవారు. జంతు బలప్రదర్శన పోటీలపై ఆసక్తి ఉన్న కొందరు వ్యక్తులు ఇటీవల గార్ధభాలను పెంచి పోషిస్తున్నారు. జిల్లాలోని కోవెలకుంట్ల, చాగలమర్రి, ఆళ్లగడ్డ, రుద్రవరం, బనగానపల్లె, అవుకు, కోడుమూరు, ఆదోని, పత్తికొండ, కల్లూరు, వెలుగోడు, తదితర మండలాల్లో గార్ధభాలను ప్రత్యేకంగా పెంచుతున్నారు.
బలవర్ధక ఆహారం
పోటీలకు పెంచే గార్ధభాలకు బలవర్ధక ఆహారం అందజేస్తున్నారు. కేవలం దాణారూపంలో పెసలు, ఉలవలు, వడ్లగింజలు, కొర్రలు, కొర్ర పిండి, బెల్లం, తదితర పప్పుదినుసులతోపాటు వివిధ పండుగల సందర్భంగా కజ్జికాయలు కూడా ఆహారంగా అందజేస్తున్నారు. పశుగ్రాసంతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో రోజుకు 750 గ్రాముల దాణాను ఆహారంగా ఇస్తున్నారు.
పోటీలకు నిర్ణీత సమయం
పరుగుపందెం పోటీల్లో ఇసుక సంచుల బరువుతో గార్ధభాలు నిర్ణీత పది నిమిషాలు సమయంలో నిర్దేశించిన దూరం పరుగెత్తాలి. సంజామల మండలం ఆల్వకొండ క్రాస్ సమీపంలో కాశినాయన ఆరాధనోత్సవాల సందర్భంగా ఇటీవల నిర్వహించిన పోటీల్లో ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి గ్రామానికి చెందిన యోహాన్ గార్ధభం నిర్ణీత సమయంలో 11వేల అడుగుల దూరం పరుగెత్తి విజేతగా నిలిచి రూ.20 వేలు బహుమతి కైవసం చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన నాగవైష్ణవి గార్ధభం 10,700 అడుగులు, చాగలమర్రి మండలం పెద్ద వంగలికి చెందిన పాములేటి గార్ధభం 10,500 అడుగుల దూరం పరుగెత్తి తర్వాతి రెండు, మూడుస్థానాల్లో రూ.10వేలు, రూ.8 వేలు గెలుపొందాయి.
పండుగలు, తిరుణాళ్లలో పోటీలు
ఏటా ఉగాది, శ్రీరామ నవమి, సంక్రాంతి పండుగలతోపాటు కాశినాయన ఆరాధోత్సవాలు, పాండురంగస్వామి బ్రహ్మోత్సవాలు, గ్యార్మీ, అమ్మవారి జాతరల సందర్భంగా కర్నూలు, నంద్యాల, చాగలమర్రి, ఆల్వకొండ, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో ఎక్కువగా గార్ధభాల పరుగు పందెం పోటీలను నిర్వహిస్తున్నారు. నిర్వాహకుల నుంచి పోటీల సమాచారం తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో గార్ధభాలను పెంచే వారు పందేలకు కొన్ని రోజుల ముందు మరోసారి శిక్షణ ఇచ్చి పోటీల్లో పాల్గొంటున్నారు.
రూ.లక్ష వరకు ధర
పరుగు పందెం పోటీలకు ఉపయోగించే గార్ధభాల ధర మార్కెట్‌లో సైజును బట్టి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతోంది. వివిధ సైజుల్లోని గార్ధభాలను కొనుగోలు చేసిన వారు వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పోటీలకు సిద్ధం చేస్తున్నారు. పోటీల్లో పాల్గొనే గార్ధభాలకు ఆయాసం రాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో పరిగెత్తించడం, పోటీలకు తగ్గట్టు ఇసుకను సంచుల్లో నింపి పరుగుపందెం ప్రాక్టీస్ చేయిస్తారు. వాటిపై ఇసుక సంచులు తాళ్లతో కట్టి పోటీలకు దింపుతారు. పోటీలలో గార్ధభం దాదాపు 200 కిలోల బరువుతో పరిగెత్తాల్సి ఉంటుంది.
రూ.42 వేలతో కొన్నా
వైఎస్సార్ జిల్లా జంగాలపల్లెలో నెల రోజుల క్రితం రూ.42 వేలు వెచ్చించి గార్ధభాన్ని కొన్నాను. ఆ జిల్లాలో పది పర్యాయాలు పరుగు పందెం పోటీల్లో పాల్గొని అది బహుమతులు కైవసం చేసుకుంది. ఆ గార్ధభాన్ని కొనుగోలు చేశాక ఇటీవల ఒంగోలు, ఆల్వకొండ ప్రాంతాల్లో జరిగిన పోటీలకు తీసుకెళ్లాను. – సుధాకర్, కోవెలకుంట్ల
చాకిరేవు వృత్తితోపాటు పోటీలకు
చాకిరేవు వృత్తితోపాటు గార్ధభం పోటీలపై ఆసక్తి ఉండటంతో ఏడాది క్రితం కర్నాటక రాష్ట్రంలో రూ.50 వేలు వెచ్చించి గార్ధభాన్ని కొనుగోలు చేశాను. ప్రతి రోజు జొన్నలు, వడ్లు కలిపి ఆహారంగా పెడుతున్నాను. ఇప్పటి వరకు నంద్యాల, అయ్యలూరు, చిన్నవంగలి, ఆల్వకొండలో జరిగిన పోటీల్లో పాల్గొన్నాను.
– సుబ్బరాయుడు, ముక్కమల్ల, సంజామల మండలం
Comments
Please login to add a commentAdd a comment