
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు జగ్జీవన్ జ్యోతి పథకం కింద ఉచితంగా విద్యుత్ ఇచ్చేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.390.92 కోట్లు కేటాయించింది. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన తరువాత ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తోంది. బిల్లుల్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా ఇస్తున్న విద్యుత్‌తో వారి ఇళ్లల్లో వెలుగు కనిపిస్తోంది. 200 యూనిట్ల వరకు ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా విద్యుత్‌ను ఇస్తామని 2019 జూలై 24న ప్రభుత్వం జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 15.63 లక్షల ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు ఈ పథకం ద్వారా లబ్ధికలుగుతోంది. వీటిలో 10.87 లక్షల ఎస్సీల ఇళ్లు, 4.76 లక్షల ఎస్టీల ఇళ్లు ఉన్నాయి. 2020–21లో ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.390.92 కోట్లు (ఎస్సీలకు రూ.305.92 కోట్లు, ఎస్టీలకు రూ.85 కోట్లు) కేటాయించింది. ఇంకా అర్హులైన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలవారు దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా ఈ పథకం అమలు చేయనుంది.
మాకు ఉచిత గృహవిద్యుత్ వరం
మా ఇళ్లకు ఉచిత విద్యుత్ ప్రభుత్వం ఇచ్చిన వరం. ఒకప్పుడు కిరోసిన్ దీపాల వెలుగులో ఉండాల్సి వచ్చేది. కరెంటు బిల్లులు ప్రభుత్వం కట్టకపోతే ఇప్పుడు కూడా కిరోసిన్ బుడ్లు పెట్టుకుని బతకాల్సిందే. ఏపూటకు ఆపూట తెచ్చుకుని తినే మా ఇళ్లకు ఉచితంగా విద్యుత్ వెలుగులు ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎప్పటికీ మరువలేం.
– ఆరిక సూర్యనారాయణ, అధ్యక్షుడు, ఏపీ ట్రైబల్ డెవలప్‌మెంట్ మిషన్
దళితుల ఇంటి వెలుగు
దళిత కుటుంబాలు ఏరోజు కారోజు కూలికెళ్తేగానీ పూట గడవని పరిస్థితి. కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి లేదు. అటువంటి వారి ఇళ్లల్లో చీకటి ఉండకూడదని భావించిన ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. లక్షల కుటుంబాల వారు ఫ్యాను, లైటు వేసుకుని ఎంతోహాయిగా ఇతర పథకాల సాయంతో జీవిస్తున్నారు.
– కల్లూరి చంగయ్య, అధ్యక్షుడు, ఐక్యదళిత మహానాడు