సంక్రాంతి సంబరం.. ఆయ్‌.. మా ఊరొచ్చేశామండీ.. | People In Their Own Villages Are Celebrating Sankranti | Sakshi
Sakshi News home page

సంక్రాంతి సంబరం.. ఆయ్‌.. మా ఊరొచ్చేశామండీ..

Published Sat, Jan 15 2022 11:57 AM | Last Updated on Sat, Jan 15 2022 3:08 PM

People In Their Own Villages Are Celebrating Sankranti - Sakshi

అమలాపురం మండలం ఇందుపల్లిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళల సరదా కబుర్లు

అమలాపురం టౌన్‌(తూర్పుగోదావరి): పండగంటే పదిమందీ కలవడమే.. అయినవాళ్లతో ఆనందం కలబోసుకోవడమే.. ఉపాధికో ఉద్యోగ రీత్యానో చెల్లాచెదురై ఏడాదికోసారైనా కన్న ఊరికి చేరుకోవడమే.. ఆత్మీయ పలకరింపుల మధ్య అన్నీ మరచిపోవడమే.. అనుబంధాలన్నీ పెనవేసుకోవడమే.. చిన్ననాటి అనుభవాలను గుర్తుకు తెచ్చుకోవడమే.. తీపి అనుభూతులను మూటగట్టుకోవడమే.. ఔను అదే పండగ.. కాదు.. అనురాగ నిలయమైన మన గోదావరి జిల్లాలో ఇది పెద్ద పండగే.. అందుకే  ఏటా సంక్రాంతి కోసం అన్ని ఎదురు చూపులు.. అంత సంతోషం.. ఆ రోజే రానే వచ్చింది.

ప్రతి లోగిలీ మమతల కోవెల.. 
జిల్లాకు చెందిన వేలాది కుటుంబాలు ఉద్యోగ, ఇతర వృత్తుల రీత్యా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడ్డాయి. వారందరూ భోగి నాటికే (శుక్రవారం) సొంతూళ్లకు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా రెక్కలు కట్టుకుని మరీ వాలిపోయారు. లోగిళ్లన్నీ పలకరింపులతో పులకరించిపోతున్నాయి. అయినవారి ఆనంద కాంతులతో మెరిసిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కళ తప్పిన పల్లెలు కళకళలాడుతున్నాయి. తండ్రి, తల్లి, కొడుకులు, కోడళ్లు, కూతుర్లు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లతో ప్రతి ఇల్లూ ఓ మమతల కోవెలను తలపిస్తోంది. కోడి పందేలు, ప్రభల తీర్థాలు, సహపంక్తి భోజనాలు, గ్రామీణ క్రీడలు, పచ్చని కొబ్బరి తడికలతో జోడెడ్ల గూడు బండ్ల వంటి అరుదైన అనుభూతులను వారు చవి చూస్తున్నారు. తాము హైదరాబాద్‌లో స్థిరపడినప్పటికీ సంక్రాంతికి అమలాపురం వచ్చి పండగ మూడు రోజులూ ఆనంద సాగరంలో మునిగిపోతామని కోనసీమకు చెందిన మెట్రో కెమ్‌ కంపెనీల అధినేత నందెపు బాలాజీ అన్నారు.


గంగలకుర్రులో ఉమ్మడి కుటుంబంలా సహపంక్తి భోజనాలు చేస్తున్న బంధువులు 

ఆయ్‌ తినండి మరీ.. 
మర్యాదలతో ఉక్కిరిబిక్కిరి చేయడం జిల్లా వాసుల సహజ లక్షణం. సరికొత్త రుచులతో కొసరి కొసరి వడ్డించేస్తారు. పూత చుట్టలు, కజ్జికాయలు, పోక ఉండలు, జంతికలు, మినపసున్నుండలే కాదు.. గోదావరి పాయల్లో దొరికే చందువ, పండుగప్ప వంటి చేపలే కాకుండా కోడి పందేల్లో వీర మరణం పొందిన పుంజు కోస మాంసం కూరలు వడ్డించి తినమంటూ సుతిమెత్తని ఒత్తిడి పెట్టేస్తారు.

కోనసీమ సంప్రదాయాలు సూపర్‌ 
నాది తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట. ఉద్యోగ రీత్యా కుటుంబ సమేతంగా కొన్నేళ్లుగా మలావి దేశంలో స్థిరపడ్డాను. అక్కడ నాతో కలిసి పని చేసే అంబాజీపేటకు చెందిన పరసా బాలాజీతో కలిసి కోనసీమ వచ్చాను. మా కోనసీమ రుచులు, సంక్రాంతి సంబరాలు స్వయంగా చూడాలని చెప్పి నా స్నేహితుడు బాలాజీ ఈ సీమకు తీసుకు వచ్చాడు. ఇక్కడి సంక్రాంతి సంబరాలు, పిండి వంటలు అన్ని అద్భుతంగా, అమోఘంగా ఉన్నాయి. ఈ మధురానుభూతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. 
– నేగూరి నవీన్, అంబాజీపేట 

పుణె నుంచి పుట్టింటికి.. 
సంక్రాంతి పండగలెప్పుడొస్తాయా అని పుణెలో ఎదురు చూస్తూంటాను. పండగ రాగానే రెండు రోజుల ముందే పుట్టిల్లయిన అంబాజీపేట మండలం గంగలకుర్రు వచ్చే స్తాం. ఇక్కడికి దగ్గర్లో జరిగే జగ్గన్నతోట ప్రభల తీర్థం చూడడం కోసమైనా పుణె నుంచి వస్తాం. ఉద్యోగ రీత్యా మేము అక్కడ ఉంటున్నా సంక్రాంతికి రెక్కలు కట్టుకు వచ్చి మరీ వాలిపోతాం. 
– పమ్మి అరుణ, గృహిణి, గంగలకుర్రు 

ఉమ్మడి కుటుంబ వారసత్వం 
అంబాజీపేట మండలం గంగలకుర్రు, ఇందుపల్లి గ్రామాల బ్రాహ్మణుల వీధిలోని 300 కుటుంబాలకు చెందిన ఇళ్లన్నీ పండగ సందర్భంగా ఓ స్వర్గసీమగా మారిపోయాయి. ఉమ్మడి కుటుంబాల ఉనికిని చాటుతున్నాయి. పండగ మూడు రోజులూ ఈ కుటుంబాలన్నీ ఒకచోట సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గంగలకుర్రుకు చెందిన ఆకెళ్ల పద్మామహాలక్ష్మి కుటుంబం ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నా సంక్రాంతికి కుటుంబ సమేతంగా పుట్టింటికి వచ్చారు. ఇదే గ్రామానికి చెందిన పుల్లెల సతీష్‌ కుటుంబం అమెరికాలో ఉంటున్నా సంక్రాంతికి ఆ ఊరి వేడుకలకు హాజరు కావడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement