దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని ఆక్రోశం: పేర్ని నాని | Perni Nani Fires On Pawan Kalyan At Tadepalli | Sakshi
Sakshi News home page

దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని ఆక్రోశం: పేర్ని నాని

Published Sun, Sep 26 2021 4:58 PM | Last Updated on Mon, Sep 27 2021 7:30 AM

Perni Nani Fires On Pawan Kalyan At Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం అమల్లోకి వస్తే.. బ్లాక్‌లో అధిక రేట్లకు టికెట్లు అమ్ముకునే అవకాశం ఉండదనే ఆక్రోశంతోనే జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. రెండుచోట్ల ఎమ్మెల్యేగా నిలుచుని, ఒక్కచోట కూడా గెలవని సన్నాసిన్నర సన్నాసి అతనేనని, ఈ వెధవన్నర వెధవకు తిక్క కాదు.. ఒళ్లంతా ఉన్నది లెక్క పిచ్చే అని నిప్పులు చెరిగారు. దోపిడీదారులకు ఈ ప్రభుత్వం సింహ స్వప్నమని, నువ్వు దోపిడీ చేస్తున్నావు కాబట్టే నీకు ఈ ప్రభుత్వం సింహస్వప్నంగా కనిపిస్తోందని విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో 800 థియేటర్లలో సినిమాలు ప్రదర్శిస్తుంటే కనిపించడం లేదా? అని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘సినిమాలను ఏపీ ప్రభుత్వం తొక్కేస్తోందంటావా.. మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికల్లో ఓట్ల కోసమే కదా ఈ పిచ్చి మాటలు. ఈ పిచ్చి మాటలను నీతో మాట్లాడిస్తోంది ఎవరు?’ అని నిలదీశారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..

800 థియేటర్లు తెరుచుకున్నాయ్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినిమా హాళ్లను మూసివేయించిందని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం తెరిపించిందని పవన్‌ కల్యాణ్‌.. కక్ష, ఈర‡్ష్యతో రాజకీయ దురుద్దేశంతో మాట్లాడటం దుర్మార్గం. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1,100 థియేటర్లు రన్నింగ్‌ కండిషన్‌లో ఉంటే ప్రస్తుతం 800 థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయి. తెలంగాణలో 519 థియేటర్లకు గానూ 413 థియేటర్లలో మాత్రమే సినిమాలు ప్రదర్శిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 510 థియేటర్లలో ‘లవ్‌స్టోరీ’ సినిమా ఆడుతోంది. మొదటి రోజు ఆ సినిమా ప్రొడ్యూసర్‌కు అన్ని ఖర్చులు పోనూ మిగిలిన షేర్‌ రూ.3.88 కోట్లు. తెలంగాణలో రూ.3 కోట్లు మాత్రమే వచ్చాయి. టికెట్‌ రేటు పెంచుకోవడం, ఫ్లెక్సీ రేట్లు, ఎన్ని షోలు అంటే అన్ని షోలు అక్కడ. ఆంధ్రప్రదేశ్‌లో రెండో రోజు రూ.2.67 కోట్లు ప్రొడ్యూసర్‌ షేర్‌. అదే తెలంగాణలో వచ్చిన షేర్‌ రూ.2.49 కోట్లు మాత్రమే. ఒకవేళ నేను చెప్పేది అసత్యమైతే ప్రొడ్యూసర్‌ సునిల్‌ నారాయణను క్షమాపణలు కోరతాను.

విష ప్రచారమే
పవన్‌కల్యాణ్‌ మాట్లాడిన అవాకులు చెవాకులు కేవలం జగన్‌పై విష ప్రచారమే అన్న వాస్తవాన్ని సినీ పెద్దలు అంగీకరించాలి. రాష్ట్రంలో సినీ పరిశ్రమను జగన్‌మోహన్‌రెడ్డి ఏం ఇబ్బంది పెట్టారో చెప్పండి. పవన్‌ నాయుడు నన్ను సన్నాసి అన్నారు. ఆయన, మేం చుట్టాలం. కాపు వాళ్లం. నేను సన్నాసిని అయితే ఆయన సన్నాసిన్నర.  సాయిధరమ్‌తేజ యాక్సిడెంట్‌ గురించి కూడా ఈ వెధవన్నర మాట్లాడుతూ.. మీడియాను తప్పుబట్టాడు.

ఆ రోజు తెలంగాణ పోలీసులు ఏం చెప్పారో మీడియా అదే రాసింది. ఇక్కడ తెలంగాణ పోలీసులను తప్పు పట్టాలి. కానీ నీవు ఆ పని చేయలేదు. ఎందుకు నీకు భయమా. జగన్‌ అంటే నీకు లోకువా. కేసీఆర్‌ను ఏమీ అనలేవా. పోటుగాడివి అని చెబుతావు కదా. దమ్ము, ధైర్యం లోపలికి పోయాయా. కేసీఆర్‌ను తిట్టాలంటే ప్యాంట్‌లో కారిపోతుందా. 

ఇది రిపబ్లిక్‌ ఇండియా అందుకే..
నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇది రిపబ్లిక్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కాదు. రిపబ్లిక్‌ ఇండియా. అందుకే మనం పిచ్చవాగుడు ఏది వాగినా కూడా చలామణి అయిపోతుంది. నీ సోది అంతా మాకు తెలియదా. నాని, జూనియర్‌ ఎన్టీఆర్‌పై కపట ప్రేమ ఏమిటి. చంద్రబాబు దగ్గరికి వచ్చి కాళ్లు పట్టుకుంటావు. మోదీ కాళ్లు పట్టుకుంటావు. జగన్‌మోహన్‌రెడ్డిని జగన్‌రెడ్డి అంటావు.

ఆన్‌లైన్‌ విధానాన్ని సినీ పెద్దలే కోరారు 
2003 నుంచే సినీ పరిశ్రమ పెద్దలు ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. తెలుగు సినిమా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శి దామోదర్‌ ప్రసాద్‌ 2016 డిసెంబర్‌ 24న ఆన్‌లైన్‌ టికెట్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చారు. ఇదే అంశంపై 2018 నవంబర్‌ 1న తెలుగు సినిమా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శి రాందాస్‌ మరోసారి వినతిపత్రం ఇచ్చారు. ఈ నెల 20న సినీ పరిశ్రమ పెద్దలు నన్ను కలిసి అత్యంత పారదర్శకమైన ఆన్‌లైన్‌ టికెట్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు.

వారి కోరిక మేరకే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ పోర్టల్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. టికెట్లను ప్రభుత్వం విక్రయించదు. థియేటర్లే అమ్ముతాయి. ఆ మరుసటి రోజు నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, థియేటర్‌ యజమానులకు వారి వారి ఖాతాల్లో నగదు జమ అవుతుంది. జీఎస్టీ, వినోద పన్ను రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు చేరాల్సిన పన్ను మొత్తం జమ అవుతుంది.

నువ్వు తీసుకునేది రూ.పది కోట్లేనా!
పవన్‌ నాయుడూ.. ఒక సినిమాకు రెమ్యునరేషన్‌ రూపంలో రూ.పది కోట్లు తీసుకుంటున్నట్టు సినిమా ఫంక్షన్‌లో చెప్పావ్‌. మరి 2019లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజల కోసం ఏడాదికి రూ.100 కోట్లు సంపాదనను వదులుకున్నానన్నావ్‌. 2012 నుంచి ఇప్పటిదాకా చూస్తే తొమ్మిదేళ్లలో నువ్వు చేసింది 8 సినిమాలే. ఒరేయ్‌ సన్నాసిన్నర సన్నాసి పవన్‌ నాయుడూ.. మనలో మన మాట ఏడాదికి రూ.వంద కోట్లు సంపాదిస్తానని నువ్వు చెప్పింది తప్పేనా? పోనీ.. నీ సినిమాల్లో ఘన విజయం సాధించినవి ఏమున్నాయ్‌. నీ కంటే చిన్న పిల్లలు హీరోలుగా చేసిన సినిమాలకే 60 శాతం ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయ్‌. ఏముంది నీ గొప్ప.

అధికారంలో లేకపోతే బరితెగింపా!
అధికారంలో ఉన్నవారు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. అంటే అధికారంలో లేకపోతే బరితెగించి నీలా మాట్లాడాలా. నీవు ఏం చెప్పావు. 2012లో పార్టీ పెడతానని చంద్రబాబు దగ్గరకు పోతే, ఆయన పార్టీ పెట్టొద్దు అన్నాడని నీవే చెప్పావు. ఆ చంద్రబాబు కొడుకును గుంటూరు సభలో బండ బూతులు తిట్టావు. నేను చిన్నప్పటి నుంచే కమ్యూనిస్టుని అని కూడా చెప్పావు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు అనుకూలంగా పార్టీ టికెట్లు ఇచ్చుకున్నావు. మంగళగిరిలో ఏం చేశావో అందరికీ తెలుసు.అలాంటి నీవు కులం, మతం గురించి మాట్లాడుతున్నావు. ఇకనుంచైనా ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిది.

కేంద్రాన్ని అడుగు.. కేంద్రానికి ఫిర్యాదు చెయ్‌
సీఎం వైఎస్‌ జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఆ కేసు దర్యాప్తు ఏమైందని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాను ప్రశ్నించు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్నావ్‌ కదా? వారిని ప్రశ్నించాలంటేనే ప్యాంటు తడిసిపోతోందా. ఇడుపులపాయ నేలమాళిగలలో డబ్బులు దాచి ఉంటే కేంద్రానికి ఫిర్యాదు చెయ్‌. ఎందుకీ ఒట్టి మాటలు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సినిమా థియేటర్లు కట్టించు సీఎం జగన్‌ అని వ్యంగ్యోక్తులు విసురుతావా? ఏం అగ్రవర్ణాల వారికే సినిమా థియేటర్లు ఉండాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం సీఎం వైఎస్‌ జగన్‌ పాటుపడుతుంటే నీకెందుకు కడుపుమంట. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే నువ్వన్నట్టుగానే వారికి థియేటర్లు కట్టిస్తాం. బోయలను ఎస్టీల్లో, మత్స్యకారులను ఎస్సీల్లో చేర్చుతానని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేసేలా చంద్రబాబును అప్పట్లో ఎందుకు నిలదీయలేదు. కాపులను బీసీల్లో చేరుస్తానన్న చంద్రబాబు మాట తప్పితే ఎందుకు నిలదీయలేదు.

అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావ్‌. నువ్వు భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయావ్‌. రెండుచోట్ల ఓడావ్‌ కాబట్టి నువ్వు సన్నాసిన్నర సన్నాసివి. మేం కూడా చిరంజీవి అభిమానులం. ఆయనను అన్నయ్య అంటాం. సురేఖను వదినమ్మ అంటాం. ఏరా పీకే ఆ రోజు వదినమ్మ నిన్ను బాగా చదువుకోమంది. అయినా నువ్వు ఆ పని చేయలేదు. 

 చదవండి: (రాజకీయాల్లో పనికి మాలిన స్టార్ పవన్‌ కల్యాణ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement