గన్నవరం: కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఇందుకు తగ్గట్లుగా దేశీయ విమాన సర్వీసులు పెరగకపోవడంతో టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్, బెంగళూరు విమాన చార్జీలయితే విపరీతంగా పెరిగిపోయాయి. 2020 ఫిబ్రవరి వరకు దేశంలోని వివిధ నగరాల నుంచి విజయవాడ విమానాశ్రయానికి రోజుకు 36 రూట్లలో 72 సర్వీసులు తిరిగేవి. సుమారుగా 3,600 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. కోవిడ్ పరిస్థితులతో రోజువారీ సర్వీసుల సంఖ్య 32కు, ప్రయాణికుల సంఖ్య 2,200కు పడిపోయింది. సెకండ్ వేవ్ సమయంలో ప్రయాణికుల్లేక స్పైస్‌జెట్, ట్రూజెట్ సంస్థలు తమ సర్వీసులను పూర్తిగా రద్దు చేసుకున్నాయి.
ఎయిరిండియా, ఇండిగో సంస్థలు మాత్రమే ఇక్కడికి సర్వీసులు నడుపుతున్నాయి. ఎయిరిండియా సంస్థ న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు నుంచి రోజుకు 6 నుంచి 8 సర్వీసులు తిప్పుతోంది. మిగిలిన 24 సర్వీసులూ ఇండిగో సంస్థే నడుపుతోంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు సర్వీసులకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ రూట్లలో ఇండిగో ప్రతిరోజూ విజయవాడ–బెంగళూరు మధ్య 8, విజయవాడ–హైదరాబాద్ మధ్య మరో 8 సర్వీసులు నడుపుతోంది. ఈ రూట్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని ఆ సంస్థ సొమ్ము చేసుకుంటోంది. దీంతో ఈ రూట్లలో ప్రయాణం చేయాలంటే టికెట్‌కు రూ.10 వేల వరకు చెల్లించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ రూట్లలో ఇతర ఎయిర్‌లైన్స్ సర్వీసులు పెద్దగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి అని వారు పేర్కొంటున్నారు. దీనిపై ఎంపీ బాలశౌరి స్పందిస్తూ.. ఈ రూట్లలో ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు కూడా సర్వీసులు నడిపే విధంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తానని చెప్పారు.
సంప్రదింపులు జరుపుతున్నాం..
పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా విమాన సర్వీసులు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం.
– పీవీ రామారావు, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment