సాక్షి, విజయవాడ: ‘స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు కీలక దశలో ఉంది. రూ.371 కోట్లు కొల్లగొట్టిన ఈ సామాజిక, ఆర్థిక కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా తానై చంద్రబాబు వ్యవహరించారు. ఈ కేసులో ఇప్పటికే ఆయన సాక్షులను బెదిరిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన బెయిల్‌పై బయటకొస్తే మిగిలిన సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును ప్రభావితంచేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతున్నా’.. అని రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తూ చంద్రబాబుకు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించేందుకు ఉన్న బలమైన కారణాలను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర సుస్పష్టమన్నారు. జీఓ జారీ, అందుకు విరుద్ధంగా ఒప్పందం కుదుర్చుకోవడం, అధికారుల నియామకం, ఆర్థిక శాఖ అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధుల విడుదల.. ఇలా అన్ని దశల్లోనూ చంద్రబాబే ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు.
అందుకు 13 నోట్‌ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేయడమే నిదర్శనమన్నారు. జీఓ నంబర్ 4 కంటే ముందే ఒప్పందం కుదుర్చుకున్నారని.. కానీ, ఆ ఒప్పందాన్ని జీఓలో ఎందుకు ప్రస్తావించలేదన్నది ఈ కేసులో కీలకమన్నారు. ఆర్థిక శాఖ అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను చంద్రబాబు దురుద్దేశపూరితంగానే తన విచక్షణాధికారాలు (వీటో)తో తోసిపుచ్చారని న్యాయస్థానానికి వివరించారు.
బాబు బెదిరింపులపై ఆధారాలున్నాయి..
అంతేకాదు.. తాను చెప్పినట్లు చేయకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. వారిని పదవుల నుంచి తొలగిస్తానని ఆనాడు సీఎంహోదాలో చంద్రబాబు అధికారులను బెదిరించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని కూడా పొన్నవోలు న్యాయస్థానానికి వివరించారు. స్కిల్ కుంభకోణం ఏమీ ఫిక్షన్ కథ కాదని, ప్రభుత్వ నిధులు కొల్లగొట్టిన అవినీతి వ్యవహారమని చెప్పారు.
ఆ మేరకు సమగ్ర దర్యాప్తు ద్వారా సీఐడీ గుర్తించి నివేదించిన ఆధారాలను పరిశీలించాలని న్యాయస్థానాన్ని కోరారు. షెల్ కంపెనీలు, నకిలీ ఇన్వాయిస్‌ల ద్వారా పన్ను ఎగవేతను 2017లోనే జీఎస్టీ అధికారులు గుర్తించారన్నారు. ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తులో ఉండగానే 2018లో 17వ సవరణ చేశారనే విషయాన్ని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తించదన్నారు.
చంద్రబాబు ఆదేశాలతోనే వారిద్దరు పరార్..
ఇక నిధులను అక్రమంగా తరలించడంలో కీలక వ్యక్తులైన చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని దేశం విడిచి పరారైన ఉదంతాన్ని ప్రస్తావించారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని వారిని సీఐడీ నోటీసులు ఇవ్వగానే దేశం విడిచిపెట్టి పోవడం తీవ్రమైన పరిణామమన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే వారిద్దరూ పరారయ్యారని చెప్పారు. పెండ్యాల శ్రీనివాస్ పాస్‌పోర్ట్‌ను సీజ్ చేసేలా న్యాయస్థానం ఆదేశించాలని కోరారు.
ఇక ఈ కేసులో గతంలో 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఇచ్చిన అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ప్రస్తుతం అందుకు భిన్నంగా మీడియా చానళ్లలో చర్చల్లో మాట్లాడుతుండటం వెనుక చంద్రబాబు ఒత్తిడి ఉందన్నారు. కాబట్టి ఈ తరుణంలో చంద్రబాబుకు బెయిల్ ఇస్తే ఆయన తన రాజకీయ పలుకుబడితో సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయన్నారు. కాబట్టి ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని న్యాయస్థానాన్ని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోరారు.
సాక్షులను ప్రభావితం చేసే అవకాశంలేదు : దూబే
అంతకుముందు.. ఈ కేసులో ముద్దాయి చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే వాదనలు వినిపిస్తూ.. ఆర్థిక శాఖ అధికారులు గుజరాత్ వెళ్లి అధ్యయనం చేసి ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదన్నారు. ఈ ప్రాజెక్టు విలువను నిర్ణయించిన కాస్ట్ వేల్యూయేషన్ కమిటీలో చంద్రబాబు లేరన్నారు. ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్న భాస్కరరావు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారని చెప్పారు. కేబినెట్ నిర్ణయం మేరకు చేసుకున్న ఒప్పందంలో చంద్రబాబును తప్పుబట్టడానికి లేదన్నారు.
సాక్షులను ప్రభావితం చేయడంగానీ, ఆధారాలను ధ్వంసం చేయడంగానీ పరారయ్యే అవకాశంగానీ లేనందున చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. అనంతరం.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయనకు పీటీ వారంట్ జారీచేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై కూడా న్యాయస్థానం గురువారం విచారించే అవకాశాలున్నాయి.
వాదనలపై వక్రీకరణలా!?
ఏబీఎన్, టీవీ–5పై ఏఏజీ పొన్నవోలు ఆగ్రహం
మరోవైపు.. న్యాయస్థానంలో జరిగిన వాదనలను వక్రీకరిస్తూ ఏబీఎన్, టీవీ–5 చానళ్లు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆ రెండు చానళ్లు తనను లొంగదీసుకోవాలని చూస్తున్నాయని.. అది సాధ్యం కాకపోవడంతో తనపై బురద జల్లుతున్నాయని ఆయన విమర్శించారు. విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ప్రాంగణంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసు విచారణ సమయంలో న్యాయస్థానం తనపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు ఏబీఎన్, టీవీ–5 చానళ్లు దుష్ప్రచారం చేశాయని విమర్శించారు.
అత్యంత కీలకమైన ఈ కేసులో ప్రభుత్వం తరఫున తాను బుధవారం మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5గంటల వరకు వినిపించిన వాదనను న్యాయస్థానం ఓపిగ్గా విందన్నారు. ఆ సమయంలో న్యాయస్థానం తనపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని.. నిరూపించలేకపోతే ఏం చేస్తారని ఏబీఎన్, టీవీ–5 చానళ్లకు పొన్నవోలు సవాల్ విసిరారు.
ఆ రెండు చానళ్లు టీవీ చర్చల్లో తనను తిట్టిస్తున్నా సహించానని కానీ, ఏకంగా న్యాయస్థానంలో వాదనలను వక్రీకరించడాన్ని మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. ఈ విషయాన్ని గురువారం విచారణ సమయంలో న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఆ రెండు చానళ్లకు ధైర్యం ఉంటే గురువారం న్యాయస్థానం విచారణ సమయంలో రావాలని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment