సాక్షి, నెల్లూరు: స్కిల్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు దొరికిపోయిన దొంగ అని అన్నారు అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు పట్ల కక్ష సాధింపు లేదు కాబట్టే జైలులో ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు స్పష్టం చేశారు. ఇదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌కు సంబంధించి కీలక వివరాలను వెల్లడించారు.
తాజాగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలి. ప్రభుత్వం తరపున కోర్టులో నేను వాదనలు వినిపించాను. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని కొందరు అంటున్నారు. జీవో నెంబర్-4లో స్పష్టంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వ్యవహారంలో నిబంధనలు పాటించలేదు. జీవో ప్రకారం జరగడం లేదని అప్పటి అధికారులు చెప్పినా ప్రభుత్వ పెద్దలు వినలేదు. అప్పట్లో ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపినా చంద్రబాబు ముందుకు సాగారు.
ఎల్లో మీడియా విశ్వప్రయత్నం..
కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని ముందుగా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం చట్ట పరంగానే విచారణ చేసింది. ప్రజాధనం కాపాడాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగింది. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారు. స్కిల్ స్కామ్ పేరుతో రూ.371కోట్లను చంద్రబాబు కాజేశారు. రాజకీయ కక్ష అనే మంత్రజాలంతో పాపాన్ని కడిగేసుకోవాలని టీడీపీ నేతలు, ఆ వర్గం మీడియా విశ్వ ప్రయత్నం చేసింది. ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని సుప్రీంకోర్టే చెప్పింది. ఎఫ్‌ఐఆర్ క్వాష్ చేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.
నేను గల్లీ నుంచి వెళ్లి కమిట్మెంట్‌తో వాదనలు..
చంద్రబాబు వయసుకు గౌరవం ఇచ్చి జైలులో సకల సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. చంద్రబాబు పట్ల చాలా గౌరవంగా వ్యవహరించాము. జైలు మన్యువల్‌లో లేనివి కూడా చంద్రబాబుకు అందించాము. చంద్రబాబుకు అన్ని సదుపాయాలు కల్పించినా కొందరు అనవసర వ్యాఖ్యలు చేశారు. జైలులో చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కూడా కల్పించాము. ఆయనకు అన్ని సదుపాయాలు కల్పించినా కక్ష సాధింపు చర్య ఎలా అవుతుంది. చంద్రబాబు అరెస్టు సక్రమమే అని న్యాయస్థానం తెలిపింది. కోర్టుల్లో వ్యతిరేక తీర్పు వస్తే వ్యవస్థల్ని మేనేజ్ చేశారని కొందరు ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. నేను గల్లీ నుంచి వెళ్లి కమిట్మెంట్‌తో వాదించాను. కొందరు ఢిల్లీ నుంచి వచ్చారు అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment