
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా యువత జనాభా తగ్గుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే యువత భారత్‌లోనే అధికంగా ఉన్నట్లు కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ ‘యూత్ ఇన్ ఇండియా–22’ నివేదికలో వెల్లడించింది. 2036 నాటికి యువ జనాభాపై నివేదిక రూపొందించింది. క్షీణిస్తున్న సంతానోత్పత్తి, ఆయుర్థాయం పెరుగుదల కారణంగా ఒకపక్క యువ జనాభా తగ్గుతుండగా మరో సమయంలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. 15 – 29 ఏళ్ల లోపు వారిని యువత కింద పరిగణించి నివేదిక రూపొందించారు.
► 2021 నాటికి ఏపీలో 1.32 కోట్ల మంది యువత ఉండగా 2036 నాటికి 1.05 కోట్లకు తగ్గనున్నట్లు నివేదిక అంచనా వేసింది. అంటే యువత శాతం 25.1 నుంచి 19.6 శాతానికి తగ్గనుంది. ఇదే సమయంలో 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు 12.3 శాతం నుంచి 19 శాతానికి పెరగనున్నారు.
► దేశంలో ప్రస్తుత జనాభాలో యువత 27.3 శాతం ఉండగా 2036 నాటికి 22.7 శాతానికి తగ్గనుంది. ఇదే సమయంలో వృద్ధులు 10.1 శాతం నుంచి 15 శాతానికి పెరగనున్నారు.
► దేశంలో ప్రస్తుతం 14 సంవత్సరాల్లోపు జనాభా 25.7 శాతం ఉండగా 2036 నాటికి 20.2 శాతానికి తగ్గనుంది. ఇదే వయసు వారు రాష్ట్రంలో 20.5 శాతం నుంచి 15.7 శాతానికి తగ్గనున్నారు.
► దేశంలో 30 – 59 ఏళ్ల లోపు జనాభా 37 శాతం ఉండగా 2036 నాటికి 42.2 శాతానికి పెరగనుంది. ఇదే వయసు వారి జనాభా రాష్ట్రంలో 42 శాతం నుంచి 45.8 శాతానికి పెరగనున్నట్లు అంచనా.
Comments
Please login to add a commentAdd a comment