(నాగా వెంకటరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : తీర ప్రాంతాలు, వాటి సమీపంలోని పట్టణాల శాశ్వత ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలతో అడుగులు ముందుకు వేస్తోంది. పూర్వపు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తొమ్మిది జిల్లాల పరిధిలోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని జాతీయ రహదారులతో ఎక్కడికక్కడ కొత్త మార్గాలతో అనుసంధానించాలనే ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలతతో అభివృద్ధి వేగం అందుకోనుంది.
తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో పోర్టు/ఫిషింగ్ హార్బర్.. ఏదో ఒకటి ఉండాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించారు. దీనికి తోడు లాజిస్టిక్ పార్కులు, పోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కులు రూపు దిద్దుకుంటున్నాయి. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు చెన్నై– కోల్‌కతా, కత్తిపూడి– త్రోవగుంట తదితర జాతీయ రహదారులు, రైలు మార్గాలు ఇప్పటికే ఉన్నాయి. పోర్టులు, హార్బర్లతో ఎన్‌హెచ్‌ల అనుసంధానానికి భారత్‌మాల పరియోజనలో భాగంగా నూతన రోడ్ల నిర్మాణం.. నాలుగు, ఆరు వరుసలకు విస్తరించడం ద్వారా సమీప పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి.
సరుకు రవాణా వేగవంతం, పరిశ్రమల ఏర్పాటు.. తద్వారా వర్తక, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమిస్తాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సానుకూలంగా వ్యవహరించాలని ఢిల్లీ పర్యటనల సమయంలో ప్రధానితో పాటు సంబంధిత శాఖల మంత్రుల వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదిస్తూ వచ్చారు. ఫలితంగా నెలల వ్యవధిలోనే పోర్టుల అనుసంధానానికి నిర్ణయాలు వేగవంతమయ్యాయి.
22 పోర్టు అనుసంధాన ప్రాజెక్టులు
రాష్ట్రంలోని పోర్టులను అనుసంధానిస్తూ 22 జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. రూ.18,896 కోట్ల అంచనాలతో 446 కిలోమీటర్ల మేర విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం, నిజాంపట్నం, కృష్ణా రివర్ టెర్మినల్, భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నుంచి ఎన్‌హెచ్‌లను అనుసంధానిస్తూ నూతన రహదారులు నిర్మితం కానున్నాయి.
రెండు మార్గాలకు సంబంధించి పురోగతిలో ఉన్న వాటిలో.. అచ్చంపేట జంక్షన్ (ఎన్‌హెచ్ –216) నుంచి కాకినాడ యాంకరేజ్ పోర్టు – వాకలపూడి లైట్ హౌస్ (ఎన్‌హెచ్–516 ఎఫ్) వరకు రూ.140.50 కోట్లతో 13.19 కి.మీ నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థ ఒప్పందం చేసుకుంది. వచ్చే ఏడాది జనవరిలోగా పనులు పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ కాంట్రాక్టు సంస్థకు సూచించింది. విశాఖపట్నం పోర్టును అనుసంధానించేలా ఈస్ట్ బ్రేక్ వాటర్ (ఎన్‌హెచ్–216) నుంచి కాన్వెంట్ జంక్షన్ (ఎన్ హెచ్–516సి) వరకు 3.49 కి.మీలను రూ.40 కోట్లతో ఫేజ్–1 కింద నాలుగు లేన్ల రహదారి పనులను నిర్మాణ సంస్థ చేపట్టాల్సి ఉంది.
బిడ్ల పరిశీలన.. డీపీఆర్
కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ పోర్టుల కనెక్టివిటీకి సంబంధించి మూడు ప్రాజెక్టుల కింద రూ.2,109.61 కోట్లతో 58.50 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి, అభివృద్ధికి సంబంధించిన బిడ్లు పరిశీలన దశలో ఉన్నాయి. ఇందులో భాగంగా సబ్బవరం నుంచి షీలానగర్ వరకు 12.50 కి.మీ మేర రూ.1,028.26 కోట్లతో ఆరు లైన్ల మార్గాన్ని భారతమాల పరియోజన కింద విశాఖ పోర్టు వరకు చేపట్టనున్నారు.
విశాఖ, కృష్ణపట్నం, కృష్ణా రివర్ టెర్మినల్, నిజాంపట్నం, గంగవరం పోర్టుల కనెక్టివిటీకి సంబంధించి 148.08 కి.మీ మేర రహదారి నిర్మాణానికి రూ.8,963 కోట్లతో ఆరు ప్రాజెక్టులుగా చేపట్టడానికి డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. ఇందులో నెల్లూరు సిటీ నుంచి కృష్ణపట్నం, వైజాగ్ పోర్టు కంటెయినర్ టెర్మినల్ నుంచి రుషికొండ, భీమిలి మీదుగా ఆనందపురం జంక్షన్ వరకు, గుంటూరు– నారాకోడూరు– తెనాలి– చందోలు మీదుగా నిజాంపట్నం పోర్టుకు, గంగవరం పోర్టు నుంచి తుంగలం వరకు, ఇబ్రహీంపట్నం జంక్షన్ నుంచి పవిత్ర సంగమం మీదుగా కృష్ణా రివర్ టెర్మినల్ వరకు, విశాఖ పోర్టుకు సంబంధించి ఈస్ట్ బ్రేక్ వాటర్ నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులు డీపీఆర్ దశలో ఉన్నాయి.
కాగా, భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల అనుసంధానానికి 106.7 కి.మీ మేర రూ.2,870 కోట్లతో ఐదు ప్రాజెక్టుల కింద రహదారుల నిర్మాణానికి డీపీఆర్‌ల తయారీకి కన్సల్టెంట్లను ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించాల్సి ఉంది.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో భరోసా
విశాఖలో ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) దేశంలోనే పారిశ్రామిక ప్రగతికి భవిష్యత్ వేదిక ఆంధ్రప్రదేశ్ అనే విశ్వసనీయతను పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల్లో కల్పించింది. రూ.13 లక్షల కోట్లకు పైగా విలువైన 386 ఒప్పందాల ద్వారా దాదాపు 20 రంగాలలో ఆరు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖ ఉండటం, సుదీర్ఘ సముద్రతీరంతో తూర్పు ఆసియా దేశాలకు ముఖ ద్వారం కావడం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, జాతీయ రహదారులు, రైలు కనెక్టివిటీ కలిగి ఉండటం ప్రగతికి సోపానాలే. తద్వారా చెన్నై–కోల్‌కతా ఎన్‌హెచ్ వెంబడి, ఈ రెండింటికి మధ్యలో విశాఖ, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, ఏలూరు, భీమవరం, నరసాపురం, విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు గూడూరు తరహా పట్టణాలు, పలు మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు శరవేగంగా అభివృద్ధి చెందనున్నాయి.
ఆక్వా అదనపు అవకాశం
కోస్తా జిల్లాల్లో 5.30 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఆక్వా రంగం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 16 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తోంది. ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆక్వా రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు దేశీయ ఎగుమతుల్లో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర వాటా ఐదు శాతం నుంచి రానున్న ఏడేళ్లలో పది శాతానికి పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా ఏపీ నుంచి వివిధ ఆహార ఉత్పత్తులు, అన్ని రంగాల వర్తక వాణిజ్యాల ముడి సరుకుల ఎగుమతులు, దిగుమతులను పెంచే ప్రణాళికతో వ్యవహరిస్తోంది.
అగ్రిమెంట్ దశలో ఐదు ప్రాజెక్టులు
ఆయా ప్రాంతాల్లోని జాతీయ రహదారులతో కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టులను నాలుగు, ఆరు వరుసల రహదారులతో అనుసంధానించే ఐదు ప్రాజెక్టుల కాంట్రాక్టులు అవార్డు పూర్తయి అగ్రిమెంటు దశలో ఉన్నాయి. వీటిని రూ.3,745 కోట్లతో 104 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు.
♦ కాకినాడ పోర్టును అనుసంధానించేలా 12.25 కి.మీ మేర సామర్లకోట నుంచి అచ్చంపేట జంక్షన్ వరకు రహదారి
♦ కృష్ణపట్నం పోర్టును కనెక్టు చేసే చిలకర్రు క్రాస్ రోడ్డు నుంచి తూర్పు కనుపూరు మీదుగా పోర్టు దక్షిణ గేటు వరకు 36.06 కి.మీ రోడ్డు
♦ నాయుడుపేట నుంచి తూర్పు కనుపూరు (ఎన్‌హెచ్–71) వరకు 34.88 కి.మీ రోడ్డు
♦ 11 కి.మీ మేర విశాఖ పోర్టు రోడ్డు అభివృద్ధి
♦ కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ జంక్షన్ (ఎన్‌హెచ్–516సీ) రోడ్డు అభివృద్ధి
22 పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులు
446 కి.మీ మొత్తం దూరం
రూ.18,896 కోట్లు ప్రాజెక్టుల వ్యయం
పోర్టులు
విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్ట్, కాకినాడ యాంకరింగ్, కాకినాడ రవ్వ క్యాప్టివ్ పోర్టు, కృష్ణపట్నం
రానున్నవి
మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ గేట్‌వే
ఫిషింగ్ హార్బర్లు
జువ్వలదిన్నె (నెల్లూరు), నిజాంపట్నం (బాపట్ల జిల్లా), మచిలీపట్నం (కృష్ణా జిల్లా), ఉప్పాడ (కాకినాడ జిల్లా) పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండో దశ కింద బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) హార్బర్ల పనులు త్వరలో ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment